Begin typing your search above and press return to search.

ఆదిత్య ఎల్ 1 టార్గెట్ ఏంటి? ఎంత దూరం? ఎన్ని నెలలు?

ఈ రోజు ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహంతో పీఎస్ ఎల్ వీసీ 57 వాహన నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది.

By:  Tupaki Desk   |   2 Sep 2023 6:04 AM GMT
ఆదిత్య ఎల్ 1 టార్గెట్ ఏంటి? ఎంత దూరం? ఎన్ని నెలలు?
X

లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూరీడు కాస్త కన్నెర్ర చేస్తే.. భూమి మీద ఉన్న సమస్త జీవులు అల్లాడిపోతాయి. అలాంటిది సూరీడుకు దగ్గరగా వెళ్లటమా? ఆఖండ తేజస్సుతో వెలిగిపోతూ.. విపరీతమైన వేడిని విడుదల చేసే భానుడికి దగ్గరకు వెళ్లిన ఎవరైనా మాడిపోవాల్సిందే. మరి.. అలాంటి భానుడి గుట్టు తేల్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో భారీ ప్రయోగానికి తెర తీయటం తెలిసిందే. చంద్రయాన్ 3 విజయంతో మాంచి ఊపు మీద ఉన్న ఇస్త్రో.. ఈ రోజు (శనివారం) ఆదిత్య ఎల్ 1 ఉప గ్రహాన్ని ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. సూరీడికి కొన్ని లక్షల కిలోమీటర్ల వరకు వెళ్లి.. అక్కడి నుంచి తన పరిశోధనల్ని చేపట్టనుంది.

ఈ రోజు ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహంతో పీఎస్ ఎల్ వీసీ 57 వాహన నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటల వేళలో కౌంట్ డౌన్ స్టార్ట్ కాగా.. ఈ రోజు ఉదయంతో ప్రయోగం జరగనుంది. ఈ ఉపగ్రహం నాలుగు నెలల పాటు ప్రయాణించి భూమి నుంచి సూర్యుడి దిశగా ఎల్1 పాయింట్ చేరుకోనుంది. భూమి నుంచి ఈ ప్రదేశానికి దూరం అక్షరాల 15 లక్షల కిలోమీటర్లు. ఇంత సదూర తీరానికి భారత ఉపగ్రహ ప్రయోగం చేయటం ఇదే తొలిసారి.

ఎందుకింత దూరం అంటే.. అక్కడి నుంచి సూర్యుడి మీద పరిశోధనలు చేయటానికి అనువుగా ఉండే ప్రదేశం ఇదే. ఇక్కడి నుంచి సూర్యుడ్ని నిరంతరం అధ్యయనం చేసే వీలుంది. అక్కడి నుంచి సూర్యుడికి మధ్య దూరం దగ్గర దగ్గర 1.5 లక్షల కిలోమీటర్లు ఉండనుంది. అంత దూరం నుంచి పరిశోధనలు చేయటం ద్వారా భానుడి రహస్యాల్ని గుర్తించే వీలుందని చెబుతున్నారు.

తాజాగా ప్రయోగిస్తున్న ఉపగ్రహంలో ఏడు పరిశోధన పరికరాలు ఉన్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫోటో స్పియర్.. క్రోమో స్పియర్ తో సహా సూరీడికి వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేయనున్నాయి. ఈ ప్రయోగం ద్వారా సౌర జ్వాలలు.. సౌర రేణువులు.. అక్కడి వాతావరణం గురించి ఎన్నో రహస్యాల్ని ఛేదిస్తాయని భావిస్తున్నారు. ఈ పరిశోధనల ద్వారా సౌర తుపానుల కారణంగా అంతరిక్షంలోని ఆస్తుల్ని కాపాడుకోవటానికి వీలు కలుగుతుందని భావిస్తున్నారు. ఎప్పటిలానే తాము చేసే ప్రతి ప్రయోగం ముందు.. దేవాలయాలకు వెళ్లి పూజలు చేయటం తెలిసిందే. ఆదిత్య ఎల్ 1 ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాత్ సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.