Begin typing your search above and press return to search.

టార్గెట్ పార్ల‌మెంట్‌: కేసీఆర్ జ‌లాస్త్రం

ఇదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను పార్ల‌మెంటులో లేవ‌నెత్తాల‌ని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్ర‌ధానంగా ఇప్పుడు రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా ఉన్న కృష్ణా జ‌లాల విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు.

By:  Tupaki Desk   |   2 Feb 2024 1:30 AM GMT
టార్గెట్ పార్ల‌మెంట్‌:  కేసీఆర్ జ‌లాస్త్రం
X

వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ రెడీ అవుతోంది. ఒక‌వైపు అభ్య‌ర్థుల విష‌యాన్ని తేలుస్తూనే .. మ‌రోవైపు యుద్ధాన్ని ముమ్మ‌రం చేసేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. తాజాగా ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధిఏత కేసీఆర్‌.. త‌న పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి.. ఎలా ముందుకు వెళ్లాల‌నే విష‌యంపై ఆయ‌న వారితో చ‌ర్చించారు. ఈ క్ర‌మంలో టికెట్ల విష‌యాన్నిత‌న‌కు వ‌దిలేయాల‌ని కేసీఆర్ సూచించారు. "ఇప్పుడు టికెట్ల లొల్లి వ‌ద్దు. అది నేను చూసుకుంటా" అని వ్యాఖ్యానించారు.

ఇదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను పార్ల‌మెంటులో లేవ‌నెత్తాల‌ని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్ర‌ధానంగా ఇప్పుడు రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా ఉన్న కృష్ణా జ‌లాల విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. జ‌లాల విష‌యంలో రాజీ ధోర‌ణి వ‌ద్ద‌ని ఎంపీల‌కు సూచించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇదే మ‌న‌కు అస్త్రం కాబోతోంద‌ని ఆయ‌న సంకేతాలు ఇచ్చారు. "కృష్ణాన‌దిపై ఉన్న ప్రాజెక్టుల‌ను త‌మ‌కు అప్ప‌గించాల‌ని కృష్ణాన‌ది నిర్వాహ‌క బోర్డు(కేఆర్ ఎంబీ) కోరుతోంది. ఇది చాలా పెను ప్ర‌మాదం. దీనిని మ‌నం అడ్డుకోవాలి. రాష్ట్ర ప్ర‌భుత్వం క‌న్నాముందే.. మ‌నం దీనిపై దృష్టి పెట్టాలి" అని కేసీఆర్ వ్యాఖ్యానించిన‌ట్టు తెలిసింది.

ఈ క్ర‌మంలో పార్ల‌మెంటులో ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించాల‌ని కేసీఆర్ సూచించారు. రాష్ట్ర‌ప‌తికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంలో కృష్ణాన‌ది జ‌లాల విష‌యాన్ని ప్ర‌తి ఎంపీ ప్ర‌స్తావించాల‌ని.. తెలంగాణ ఎంపీలు ఏం మాట్లాడినా.. కృష్ణాన‌ది జ‌లాలు, తెలంగాణ ప్రాధాన్యాలు అనేలా ఉండాల‌ని ఆయ‌న దిశానిర్దేశం చేశారు. దీనికి ముందు..కేఆర్ ఎంబీ నిర్ణ‌యాన్ని నిర‌సిస్తూ.. పార్ల‌మెంటులో గాంధీ విగ్ర‌హం వ‌ద్ద నిర‌స‌న తెల‌పాల‌ని కేసీఆర్ సూచించారు. అవ‌స‌ర‌మైతే.. పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లోనూ ఆందోళ‌న చేయ‌డానికి సైతం వెనుకాడ‌వ‌ద్ద‌ని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

"స‌స్పెండ్ చేస్త‌ర‌నే భ‌యం వ‌ద్దు. అయితే.. ఏమ‌వుతుంది. ప్ర‌జ‌ల్లోకి పోదాం" అని చెప్పారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో రాజీ ప‌డే ధోర‌ణిని విడ‌నాడాల‌ని ఆయ‌న సూచించారు. కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రిని క‌లిసి.. కృష్ణాజ‌లాలు.. ప్రాజెక్టుల విష‌యంపై నిర‌స‌న తెల‌పాల‌ని సైతం సూచించారు. ఈ ప‌నిని శుక్ర‌వారం నుంచే ప్రారంభించాల‌ని ఆయ‌న ఎంపీల‌కు దిశానిర్దేశం చేయ‌డం గ‌మ‌నార్హం. కాగా.. స‌మావేశంలో ఒక‌రిద్ద‌రు.. టికెట్ల విష‌యాన్ని ప్ర‌స్తావించ‌గా.. కేసీఆర్‌.. తాను అంతా చూసుకుంటాన‌ని వారికి న‌చ్చ‌జెప్పారు.