టార్గెట్ రేవంత్ బాగానే ఉన్నా..ఎక్కడో తేడా కొడుతోంది కేసీఆర్ సర్!!
తాజాగా సీఎం కేసీఆర్.. టీ-పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే..ఆయన చేసిన వ్యాఖ్యలపై వెంటనే విశ్లేషణలు కూడా వచ్చేశాయి.
By: Tupaki Desk | 22 Nov 2023 11:30 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారమే పరమావధిగా నాయకులు, పార్టీలు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుతున్నారు. ఒకరిని ఒకరు ఏకేస్తున్నారు. అయితే.. ఏకుళ్ల విషయంలో నాయకులు చెబుతున్న మాటలకు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న చర్చకు మధ్య ఎక్కడా పొంతన ఉండడం లేదు. ఎందుకంటే.. ఎన్నికల కోసమే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనే సందేహాలు ప్రజల్లో ఉండడమే దీనికి కారణం. ఎవరు ఏనేత విమర్శలు చేసినా.. గతంలో మాదిరిగా ప్రజలు, ఓటర్లు గుడ్డిగా నమ్మేసే పరిస్థితి ఇప్పుడు లేదు.
సోషల్ మీడియా పెరిగిపోయిన దరిమిలా.. నాయకులు చేస్తున్న విమర్శలు, కామెంట్లపై నిముషాల వ్యవధిలోనే విశ్లేషణలు వస్తున్నాయి. వాటిలోని(ఆ వ్యాఖ్యల్లోని) లోతుపాతులు, నర్మగర్భ అంశాలపై వెనువెంటనే సోషల్ మీడియాలో పోస్టులు వరదల్లా పారుతున్నాయి. దీంతో నాయకులు ఆచితూచి కామెంట్లు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అయినప్పటికీ.. నాయకులు కొందరు ధోరణి మార్చుకున్నట్టు కనిపించడం లేదు. తాజాగా సీఎం కేసీఆర్.. టీ-పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే..ఆయన చేసిన వ్యాఖ్యలపై వెంటనే విశ్లేషణలు కూడా వచ్చేశాయి. దీంతో 'టార్గెట్ రేవంత్' అనే సంగతి.. ఎక్కడో పక్కదారి పడుతోందనే హెచ్చరికలు కూడా కనిపిస్తున్నాయి.
కేసీఆర్ చేసిన విమర్శ 1: రేవంత్ రెడ్డి పెద్ద భూకబ్జాదారు.
సోషల్ మీడియా కామెంట్: మరి పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వం భూకబ్జాదారులను ఎందుకు వదిలేసింది? దీనికి బాధ్యులు ఎవరు? కేసీఆర్ పాలనలో వైఫల్యాలేగా!
కేసీఆర్ చేసిన విమర్శ 2: రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయలేదు.
సోషల్ మీడియా కామెంట్: ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు.. కాబట్టి చేయలేదు అనుకుందాం. మరి అధికార పార్టీ నాయకులు కూడా అనేక నియోజకవర్గాల్లో అభివృద్ధి చేయలేదు కదా! ఈ విషయాన్ని ఇప్పుడు వారే ఒప్పుకొంటున్నారు కదా! దీనికి ఏమంటారు సర్!!
కేసీఆర్ చేసిన విమర్శ 3: రేవంత్ నోరు తెరిస్తే గబ్బు
సోషల్ మీడియా కామెంట్: అసలు ఆయన మాత్రమేనా? బీఆర్ ఎస్‌లో లేరా? కొడుకుల నుంచి బర్రెలు దున్నల వరకు కామెంట్లు చేస్తున్నది నాయకులే కదా! ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా ఏముందిలే కేసీఆర్ సర్.. అందరూ రేవంత్‌రెడ్డిలే!
కేసీఆర్ చేసిన విమర్శ 4: రేవంత్ రెడ్డి ఏనాడైనా వ్యవసాయం చేశారా? పొలం దున్నారా?
సోషల్ మీడియా టాక్: అలా అనుకుంటే.. ఏ నాయకుడూ నాగలి పట్టుకోడు సర్. ఇదంతా ఎన్నికల హంబక్కే. రైతు కుటుంబాల నుంచి వచ్చినవారే.. సాగును విస్మరిస్తున్న పరిస్థితి ఉంది. ఒకరిని అనుకుని ప్రయోజనం ఏంటి? మీ కుటుంబంలో ఎంత మంది వ్యసాయంలో ఉన్నారు?
కేసీఆర్ చేసిన విమర్శ 5: రేవంత్ టికెట్లు అమ్ముకున్నారని కాంగ్రెస్ నేతలే అంటున్నారు.
సోషల్ మీడియా టాక్: టికెట్లు రాని వారు.. బీఆర్ ఎస్‌లోనూ ఇదే కామెంట్ చేసిన విషయాన్ని కేసీఆర్ సర్ మరిచిపోయినట్టున్నారే!
కొసమెరుపు: ప్రజలను నమ్మించేలా కాదు.. సర్, నమ్మేలా కామెంట్లు చేయండి!