Begin typing your search above and press return to search.

ఆశ్చర్యం.. బీజేపీ ఉపాధ్యక్షుడిగా ముస్లిం.. అలీగఢ్ వర్సిటీ మాజీ వీసీ

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఆయన పేరు తారీఖ్ మన్సూర్

By:  Tupaki Desk   |   29 July 2023 10:36 AM GMT
ఆశ్చర్యం.. బీజేపీ ఉపాధ్యక్షుడిగా ముస్లిం.. అలీగఢ్ వర్సిటీ మాజీ వీసీ
X

దేశంలో రెండు విశ్వవిద్యాలయాలకు దశాబ్దాల చరిత్ర ఉంది. దేశ విభజనకు ముందే కాలగమనంలో ఎన్నో ఘటనలకు సాక్షీ భూతాలుగా నిలిచాయి ఈ వర్సిటీలు. అంతేస్థాయిలో వివాదాస్పదం కూడా అయ్యాయి. కానీ, ఇప్పటికీ వాటి ప్రత్యేకత మాత్రం చెక్కుచెదరలేదు.

అటు అలీగఢ్.. ఇటు బెనారస్ పైన చెప్పుకొన్న రెండు విశ్వవిద్యాలయాలు బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్ యూ), అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ). పేరుకు తగ్గట్లే రెండు వర్గాల వారి భావజాలానికి చెందినవాటిగా వీటిని పరిగణిస్తుంటారు. మరోవైపు చూస్తే రెండూ మతపరంగా సున్నితమైన ఉత్తర ప్రదేశ్ లోనే ఉన్నాయి.

ఇక దేశ స్వాతంత్ర్య సమరంలో రెండు విశ్వవిద్యాలయాలు వార్తల్లో నిలిచాయి. ఏఎంయూ 148 ఏళ్ల కిందట ఏర్పాటవగా, బీహెచ్ యూను 1916లో స్థాపించారు. తాజా విశేషం ఏమంటే ఏఎంయూ మాజీ వైస్ చాన్స్ లర్ ను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఆయన పేరు తారీఖ్ మన్సూర్.

ఎవరీ తారీఖ్ మన్సూర్? మూడేళ్ల కిందట దేశంలో వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరసత్వ పట్టిక (ఎన్ఆర్సీ)లపై తీవ్రస్థాయి ఆందోళనలు జరిగిన సంగతి గుర్తుంది కదా..? ఆ సమయంలో ఏఎంయూ కూడా అట్టుడుకింది.

అసలే సున్నిత అంశం.. అందులోనూ ఏఎంయూలో ఆందోళనల నేపథ్యంలో విషయం చాలా తీవ్రమైంది. కాగా, అప్పుడు ఏఎంయూ వైస్ చాన్స్ లర్ గా ఉన్నది తారీఖ్ మన్సూరే. ఎన్నికల ముంగిట ముస్లింలకు దగ్గర కావాలనుకుంటున్న బీజేపీ తారీఖ్ కు పార్టీలో కీలక పదవి కట్టబెట్టింది.

కీలక సమయంలో..హిందూ మతంపై మొఘల్ యువరాజు దారా షికో బోధనలను ప్రోత్సహించే ప్రాజెక్టులో భాగంగా తారీఖ్.. ఆర్ఎస్ఎస్ తో కలిసి పనిచేశారు. అలా బీజేపీతో బంధం ఏర్పడింది. ఆయన పనితీరు ఆర్ఎస్ఎస్ కు నచ్చింది. అయితే, వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న కీలక సమయంలో ఆయనకు బీజేపీ కీలక పదవి కట్టబెట్టడం గమనార్హం.

అదికూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జీవిత చరిత్రపై రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ఒక రోజు ముందు కావడం గమనార్హం. మరోవైపు యూపీలో ముస్లింల జనాభా 19 శాతం. 30 లోక్ సభ స్థానాల్లో వారి ప్రభావం ఉంటుంది. 15 నుంచి 20 స్థానాల్లో ఫలితాన్ని తారుమారు చేయగలరు. తారీఖ్ అలీగఢ్ కే చెందినవారు.

వైద్యుడు కూడా..తారీఖ్ ఎంబీబీఎస్ చేశారు. ప్రొఫెషనల్ సర్జన్ కూడా. 1970 నుంచి ఏఎంయూతో అనుబంధం ఉంది. అక్కడ విద్యార్థిగా అడుగుపెట్టిన ఆయన వీసీగా రిటైరయ్యారు. కొంతకాలంగా ముస్లింలలోని నిమ్నవర్గాలైన పాస్మాందాలను ఆకట్టుకునే పనిలో ఉన్న బీజేపీ.. ఇప్పుడు తారీఖ్ కు ముఖ్యమైన పదవి కట్టబెట్టింది.

కాగా, బీజేపీలో మూడు దశాబ్దాలుగా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కీలకంగా ఉన్నారు. 2019లో మోదీ కేబినెట్ లో ఆయన ఏకైక ముస్లిం మంత్రి కూడా. ఇటీవల రాజ్య సభ సభ్యత్వం ముగియడంతో తప్పుకొన్నారు. మరో ముస్లిం సయ్యద్ షానవాజ్ హుస్సేన్ కూడా బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుడిగా కీలక స్థానంలో ఉన్నారు.