Begin typing your search above and press return to search.

రేవంత్ దెబ్బకు మరో బిగ్ వికెట్ పడింది!

అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయన్న దానికి నిలువెత్తు రూపంగా మారింది తెలంగాణ రాజకీయం.

By:  Tupaki Desk   |   12 Dec 2023 5:15 AM GMT
రేవంత్ దెబ్బకు మరో బిగ్ వికెట్ పడింది!
X

అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయన్న దానికి నిలువెత్తు రూపంగా మారింది తెలంగాణ రాజకీయం. పదేళ్లుగా తిరుగులేని అధికారాన్ని ప్రదర్శించిన కేసీఆర్ ప్రభుత్వం పడిపోయి.. ఆ స్థానే రేవంత్ కొలువు తీరటం తెలిసిందే. అయితే.. మార్పు వేగంగా మొదలు కావటమే కాదు.. వివాదాలకు భిన్నంగా సాగటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ప్రభుత్వాలు మారినంతనే కీలక పదవులు ఖాళీ అవుతాయి. కొందరు మాత్రం మొండికేస్తారు. మరికొందరిని మార్చాలని ఎంత అనుకున్నా.. నిబంధనలు ససేమిరా ఒప్పుకోవు. అలాంటప్పుడు వారికి వారుగా రాజీనామాలు చేయాల్సి ఉంటుంది.

అలాంటి వారిని దారికి తెచ్చుకోవటంలో తన టాలెంట్ ను ప్రదర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ సర్కారు పడిపోవటానికి కారణాల్లో ఒకటైన నిరుద్యోగుల సమస్యకు మూలంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫెయిల్యూర్. నిరుద్యోగుల గుండె మండేలా.. గులాబీ సర్కారుకు గుబులు పుట్టేలా చేయటంలో నిరుద్యోగులు కీలక భూమిక పోషించారు. తెలంగాణ ఉద్యమం అనంతరం చెల్లాచెదురైన విద్యార్థుల్ని ఏకం చేయటంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక భూమిక పోషించింది.

టీఎస్పీఎస్సీ ఫెయిల్ దెబ్బకు నిరుద్యోగులంతా ఏకం కావటమే కాదు.. తెలంగాణలో మార్పు దిశగా అడుగులు పడ్డాయి. రేవంత్ సర్కారు కొలువు తీరిన తర్వాత.. పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు తమ పదవుల్ని విడిచి పెట్టటం బాగానే ఉన్నా.. టీఎస్సీఎస్ ఛైర్మన్ పదవి నుంచి మాత్రం జనార్ధన్ రెడ్డి తప్పుకున్నది లేదు. ఇదిలా ఉంటే.. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ తో భేటీ అయిన కొన్ని గంటల వ్యవధిలోనే జనార్దన్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం రాత్రి వేళ.. అందునా పొద్దుపోయిన తర్వాత తీసుకున్న ఈ నిర్ణయం ఆసక్తికరంగా మారింది.

తాజాగా పదవుల్ని వదిలేసుకున్న వారిలో జనార్దన్ రెడ్డిది బిగ్ వికెట్ గా అభివర్ణిస్తున్నారు. అనవసరమైన రాద్దాంతం లేకుండా.. కామ్ గా.. ఎవరు విమర్శల కత్తులు విదల్చకుండా కీలక పదవిని విడిచి పెట్టేలా చేయటంలో రేవంత్ టాలెంట్ ఉందన్న మాట వినిపిస్తోంది. జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారన్న మాట తెలిసింతనే.. అశోక్ నగర్ లోని నిరుద్యోగులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవటం గమనార్హం. ఒక కీలక పదవిలో ఉన్న వారు రాజీనామా చేశారన్న వార్తబయటకు వచ్చినంతనే.. రాత్రివేళ రోడ్ల మీదకు వచ్చి సంబరాలు చేసుకోవటం అంటేనే.. టీఎస్పీఎస్సీ ఎంతలా ఫెయిల్ అయ్యిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చన్న మాట వినిపిస్తోంది.