Begin typing your search above and press return to search.

బీజేపీని గుర్తించడయ్యా బాబు!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి

By:  Tupaki Desk   |   14 Sep 2023 8:15 AM GMT
బీజేపీని గుర్తించడయ్యా  బాబు!
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే పొలిటికల్ హీట్ మొదలైంది. ప్రస్తుతం ఎన్నికల రేసులో అధికార బీఆర్ఎస్ ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ ఆ తర్వాతి స్థానంలో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రేసులో బీజేపీ వెనుకబడిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరిగి పుంజుకోవడానికి బీజేపీ నానా ప్రయత్నాలు చేస్తోందనే చెప్పాలి. తాజాగా నిరుద్యోగ సమస్యపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేపట్టిన నిరసన కూడా అందుకేనన్నది విశ్లేషకుల మాట.

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డిని నియమించినప్పటి నుంచే పార్టీలో ముసలం మొదలైందనే టాక్ ఉంది. అప్పటి నుంచి పార్టీలో జోష్ తగ్గిందనే చెప్పాలి. మరోవైపు బీఆర్ఎస్కు పోటీగా కాంగ్రెస్ దూసుకుపోతుండగా.. బీజేపీ మాత్రం వెనుకంజలోనే ఉందనే సూచనలు కనిపించాయి. ఎన్నికల ముందు పార్టీకి తెలంగాణలో ఈ పరిస్థితి మంచిది కాదని అధిష్ఠానం గమనించినట్లు సమాచారం. అందుకే దూకుడు పెంచాలనే తెలంగాణ బీజేపీ నేతలకు ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు టాక్.

అందుకే కిషన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారని చెబుతున్నారు. నిరుద్యోగ సమస్యపై ఇందిరా పార్కు దగ్గర ధర్నాకు దిగారు. కానీ ధర్నాకు సాయంత్రం వరకూ అనుమతి తీసుకున్నారు. కానీ 24 గంటలు దీక్ష కొనసాగిస్తామని, రాత్రి కూడా ఇక్కడే ఉంటామని కిషన్ రెడ్డి మొండి పట్టు పట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు ఆయన్ని అక్కడి నుంచి తరలించడంతో నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డి దీక్ష కొనసాగించారు. అయితే ఈ డ్రామా అంతా జనాల్లోకి మళ్లీ పార్టీని తీసుకెళ్లాలనే ప్రయత్నమేనని, పార్టీని గుర్తించేందుకే చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.