రతన్ టాటా వీలునామాలో ఆ రూ.500 కోట్లు ఎవరికో తెలుసా..?
దివంగత పారిశ్రామిక వేత్త, సమాజ సేవకుడు, మహోన్నత మానవతామూర్తిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రతన్ టాటా ఇటీవల పరమపదించిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 7 Feb 2025 1:34 PM GMTదివంగత పారిశ్రామిక వేత్త, సమాజ సేవకుడు, మహోన్నత మానవతామూర్తిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రతన్ టాటా ఇటీవల పరమపదించిన సంగతి తెలిసిందే. దీంతో.. ఆయన మరణానంతరం బయటకు వచ్చిన వీలునామాలో కీలక విషయాలు తెరపైకి రాగా.. తాజాగా రూ.500 కోట్లు ఓ రహస్య వ్యక్తికి ఇవ్వాలని వెల్లడించిన విషయం తెరపైకి వచ్చింది.
అవును... రతన్ టాటాకు ఉన్న సుమారు రూ.10,000 కోట్ల ఆస్తులను ఆయన నెలకొల్పిన ఫౌండేషన్లకు, సోదరుడు జిమ్మీ టాటాకు, తన సహాయకులకు, ఇతరులకు చెందేలా వీలునామా రాసిపెట్టినట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... సుమారు మూడు దశాబ్ధాలుగా తన వద్ద పనిచేస్తూ, వ్యక్తిగత సహాయకులుగా ఉన్న రాజన్ షా, సుబ్బయ్య, పెంపుడు శునకం టిటో పేర్లు చేరిచినట్లు తెలుస్తోంది.
ఇలా తన వద్ద ఉన్న వేల కోట్ల సంపదను తన వద్ద పనిచేస్తున్నవారికి, తాను స్థాపించిన ఫౌండేషన్లకు, పెంపుడు శునకానికి ఇస్తూ వీలునామా రాయగా.. తాజాగా బయటకు వచ్చిన మరో వీలునామాలో ఓ రహస్య వ్యక్తి వివరాలు ఉన్నాయని.. అతనికి తన ఆస్తిలో రూ.500 కోట్లు ఇవ్వాలని పేర్కొన్నారని అంటున్నారు.
ఈ సమయంలో తాజాగా ఆ రహస్య వ్యక్తి వివరాలు బయటకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... రతన్ టాటా వీలునామాలో ఉన్న ఆ రహస్య వ్యక్తిది జంషెడ్ పుర్ అని.. అతను ఓ ట్రావెల్స్ వ్యాపారవేత్త అని.. అతని పేరు మోహినీ మోహన్ దత్తా అని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మోహన్ దత్తా.. సుమారు ఆరు దశాబ్ధాలకు పైగా రతన్ టాటా దగ్గర నమ్మకంగా పని చేశారని అంటున్నారు.
టాటా గ్రూపుకు చెందిన అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం... టాటా కుటుంబానికి మోహన్ దత్తా చాలా సన్నిహితంగా ఉండేవారు. తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో భాగమైన తాజ్ సర్వీసెస్ తో 2013 నుంచి మోహన్ దత్తాకు చెందిన స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీ కలిసి పనిచేస్తోందని చెబుతున్నారు. డిసెంబర్ 2024లో ముంబైలో నిర్వహించిన రతన్ టాటా బర్త్ డే సెలబ్రేషన్స్ కు మోహన్ దత్తాను ఆహ్వానించారని అంటున్నారు.
ఇక, రతన్ టాటా మరణించినప్పుడు ఆయనతో తనకు ఉన్న అనుబంధం గురించి స్పందించిన మోహన్ దత్తా... రతన్ టాటా 24 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచీ తనకు తెలుసని అన్నారు. ఇదే సమయంలో.. తాను జీవితంలో ఎదగడానికి ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో రతన్ టాట వీలునామాలో రూ.500 కోట్లు ఇవ్వాలని రాసి ఉన్న రహస్య వ్యక్తి ఈ దత్తానే అని అంటున్నారు.