పాతికేళ్లకు పైగా అందని ద్రాక్ష... ఆ రూ.12 లక్షల నిర్ణయం అందిస్తోందా?
ఈ క్రమంలో... ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాల సరళి ఉన్నట్లు కనిపిస్తుంది.
By: Tupaki Desk | 8 Feb 2025 5:23 AM GMTదేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో... ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాల సరళి ఉన్నట్లు కనిపిస్తుంది. ఉదయం 10 గంటల వరకూ వెలువడిన ఫలితాలను చూస్తే.. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ (36)ను దాటేసి దూసుకెళ్తోంది. ప్రస్తుతం కమలం పార్టీ 41 స్థానాల్లో ముందంజలో ఉంది.
అవును... ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే అన్నట్లుగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆప్ 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 41 స్థానాల్లో ముందంజలో ఉంది. దీంతో... అప్పుడే సంబరాలకు సిద్ధమైపోతున్నారు కాషాయ పార్టీ శ్రేణులు అనే మాటలు వినిపిస్తున్నాయి.
ఈ సమయంలో.. మూడు దఫాలుగా దేశాన్ని పాలిస్తోన్న బీజేపీకి, దాదాపు 26 ఏళ్ల నుంచి అందని ద్రాక్షగా ఉన్న హస్తిన సీఎం కుర్చీ ఆ పార్టీకి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయనే చర్చ తెరపైకి వచ్చింది. దీనికి చాలా కారణాలు ఉండోచ్చు కానీ.. ఇటీవల కేంద్రం ప్రకటించిన రూ.12 లక్షల వరకూ పన్ను మినహాయింపు అంశం కీలక భూమిక పోషించిందని అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్ లో ఓ ఆసక్తికర నిర్ణయం ప్రకటించింది. ఇందులో భాగంగా.. మధ్యతరగతి ప్రజలపై పన్ను భారాన్ని భారీగా తగ్గిస్తూ.. పన్ను నిబంధనల్లో మార్పులు చేస్తూ.. ఏకంగా రూ.12 లక్షల వరకూ పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
ఇలా... ఎవరూ ఊహించని విధంగా అన్నట్లుగా పన్ను మినహాయింపు పరిమితిని ఒక్కసారిగా రూ.12 లక్షలకు పెంచడదంతో మధ్య తరగతి వర్గాలు చాలా వరకూ సంబరాలు చేసుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని మధ్య తరగతి ఓటర్లు ఈ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం గుర్తు ముందున్న బటన్ నొక్కారనే చర్చ జరుగుతుంది.
ఏది ఏమైనా.. తాజా కౌంటింగ్ సరళి ఇలానే కంటిన్యూ అయితే... భారతీయ జనతాపార్టీకి హస్తిన సీఎం పీఠంపై పాతికేళ్లకు పైగా ఉన్న సుదీర్ఘ నిరీక్షణకు తెరపడినట్లేనని అంటున్నారు పరిశీలకులు.