Begin typing your search above and press return to search.

3 రోజులే మిగిలాయి..జెట్ స్పీడ్ తో ట్యాక్స్ రీఫండ్

ఐటీఆర్ లు దాఖలు చేసిన ఒక్క రోజులోనే ప్రాసెస్ చేయటం గత ఏడాదితో పోలిస్తే వంద శాతం పెరిగినట్లు చెబుతున్నారు

By:  Tupaki Desk   |   29 July 2023 5:46 AM GMT
3 రోజులే మిగిలాయి..జెట్ స్పీడ్ తో ట్యాక్స్ రీఫండ్
X

ఆదాయపన్నుకు సంబంధించి ఐటీ రిటర్న్ దాఖలు చేయాల్సిన వారికి మరో మూడు రోజులే మిగిలాయి. ఈ రోజు (శని) జులై 29 కాగా.. ఆదివారం.. సోమవారంతో గడువు ముగియనుంది. గత ఏడాదికి సంబంధించిన ఆదాయపన్నుకు సంబంధించిన రిటర్న్ దాఖలు చేసేందుకు గడువు దగ్గరపడుతున్న వేళ.. ఈ విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేసినా.. అందుకు తగ్గ పెనాల్టీని చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐటీ రిటర్న్ ను త్వరగా దాఖలు చేయాల్సిన అవసరం ఉంది.

అయితే.. ఇక్కడో గుడ్ న్యూస్. ఐటీ రిటర్న్ దాఖలు చేసే వారిలో పలువురు ముందుగా చెల్లించిన ట్యాక్స్ మొత్తానికి రీఫండ్ కోసం దాఖలు చేస్తారు.

ఇలాంటి వారికి గతానికి భిన్నమైన అనుభవం దక్కుతున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ట్యాక్స్ ఫైలింగ్ లో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా ఐటీఆర్ ఫైలింగ్.. రీఫండ్ ప్రాసెసింగ్ లో వేగం పెరిగింది. ఐటీఆర్ లు దాఖలు చేసిన ఒక్క రోజులోనే ప్రాసెస్ చేయటం గత ఏడాదితో పోలిస్తే వంద శాతం పెరిగినట్లు చెబుతున్నారు.

తాను ఐటీఆర్ ఫైల్ చేసిన 12 గంటల్లోనే ట్యాక్స్ రీఫండ్ పొందినట్లుగా ఒక పన్ను చెల్లింపుదారు ట్వీట్ చేయటం ఆసక్తికరంగా మారింది. నిర్ణయ్ కపూర్ అనే జర్నలిస్టు తన సొంత అనుభవాన్ని ట్వీట్ చేశారు. ఐటీఆర్ ఫైలింగ్.. ట్యాక్స్ రీఫండ్ డిపాజిట్ మెసేజ్ ను స్క్రీన్ షాట్ రూపంలో షేర్ చేశారు.

ట్యాక్స్ రీఫండ్ ఇంత వేగంగా ప్రాసెస్ చేయటాన్ని తాను ఇప్పటివరకు చూడలేదన్నారు. జులై 27న ఉదయం వేళలో నిర్ణయ్ కపూర్ ఐటీ రిటర్న్ దాఖలు చేస్తే.. అదే రోజు సాయంత్రానికి ట్యాక్స్ రీఫండ్ డిపాజిట్ అయినట్లుగా మెసేజ్ లు వచ్చినట్లుగా పేర్కొన్నారు.

గతంలో ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత రీఫండ్ మొత్తాన్ని వారాల తర్వాత కానీ బ్యాంక్ అకౌంట్ కు డిపాజిట్ అయ్యేది కాదు. కానీ.. ఐటీ శాఖలో అంతర్గతంగా చేపట్టిన సంస్కరణల కారణంగా రీఫండ్ జెట్ స్పీడ్ లో జరుగుతుందని చెబుతున్నారు. మొత్తంగా 2023-24 అసెస్ మెంట్ ఇయర్ కు గాను దాఖలు చేయాల్సిన ఐటీఆర్ ను వెంటనే దాఖలు చేయటం ద్వారా ఫైన్ ముప్పు నుంచి తప్పించుకునే వీలుందన్న విషయాన్ని మర్చిపోవద్దు.