Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్ కు సవాలుగా మారిన ‘8’ స్థానాలు

తెలంగాణ అధికార పక్షానికి తాజాగా జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారింది.

By:  Tupaki Desk   |   25 March 2024 5:57 AM GMT
టీ కాంగ్రెస్ కు సవాలుగా మారిన ‘8’ స్థానాలు
X

తెలంగాణ అధికార పక్షానికి తాజాగా జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారింది. గతానికి భిన్నంగా పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య పోటీ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. దీంతో.. సరైన అభ్యర్థిని ఎంపిక చేయటం ఆలస్యమవుతోంది. మొత్తం 17 ఎంపీ స్థానాలకు ఇప్పటివరకు 9 స్థానాలకు అభ్యర్థుల్ని ఫైనల్ చేసిన కాంగ్రెస్ పార్టీ మరో 8 నియోజకవర్గాల్లో మాత్రం ఏటూ తేల్చుకోలేకపోతోంది. దీనికి కారణం ఈ ఎనిమిది స్థానాలకు అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. అదెలా అన్నది చూస్తే..

హైదరాబాద్

మజ్లిస్ కు కంచుకోట లాంటి ఈ స్థానాన్ని తన సొంతం చేసుకోవాలన్న పేరాశలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ.. అదే మాత్రం ఈజీ కాదన్న విషయం తెలిసిందే. ఈ స్థానం నుంచి పోటీ మజ్లిస్ కు మింగుడుపడని రీతిలో ఉండాలన్న ఆలోచనతో కాంగ్రెస్ ఉన్నట్లు చెబుతున్నారు. తొలుత మజ్లిస్ కు బద్ధ శత్రువు అయిన ఎంబీటికి మద్దతు ఇవ్వటం.. వారితో కలిసి ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపాలని భావించారు. అయితే.. తర్వాతి కాలంలో తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రేసులో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అజారుద్దీన్.. ఫిరోజ్ ఖాన్ లతో పాటు అలీ మస్కతి.. న్యాయవాది షహనాజ్ తబసుమ్ లు కాంగ్రెస్ తరఫు పోటీ చేయటానికి మొగ్గు చూపుతున్నారు. మరి.. టికెట్ రేసులో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.

మెదక్

బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ ఎంపీ స్థానాన్ని ఏది ఏమైనా కాంగ్రెస్ విజయం సాధించాలన్న పట్టుదలతో తెలంగాణ అధికార పక్షం ఉంది. దీని కోసం బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచికాంగ్రెస్ కు చేరి.. పటాన్ చెర్వు టికెట్ ఆశించిన నీలం మధు ముదిరాజ్ ఆ తర్వాతి కాలంలో బీఎస్పీ నుంచి పోటీ చేయటం తెలిసిందే. నీలం మధుతో పాటు పలువురు అభ్యర్థులు టికెట్ ను ఆశిస్తున్నారు.

మంత్రి దామోదర్ రాజనర్సింహా కుమార్తె త్రిష.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మలకూడా టికెట్ కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో జగ్గారెడ్డి సతీమణికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. ఇప్పటివరకు ఉన్న పేర్లలో నీలం మధుకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.

భువనగిరి.. ఖమ్మం

ఈ రెండు ఎంపీ స్థానాలకు భారీ ఎత్తున టికెట్లు ఆశిస్తున్నారు. ఈ రెండుస్థానాల్లో కాంగ్రెస్ విజయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న మాట ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో ఈ రెండు ఎంపీ స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఖమ్మం ఎంపీ విషయానికి వస్తే.. మల్లు నందిని.. పొంగులేటి ప్రసాదరెడ్డి.. తుమ్మల యుగంధర్ లతో పాటు ఇండస్ట్రీయలిస్టు వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ తో పాటు సీనియర్ నేత వీహెచ్ సైతం టికెట్ ను ఆశిస్తున్నరేసులో ఉన్నారు.

భువనగిరి ఎంపీ స్థానం విషయానికి వస్తే.. ముఖ్యమంత్రి రేవంత్ అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తోంది. అయితే.. ఇదే స్థానాన్ని మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి పేరు వినిపిస్తోంది. వీరితో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పేరు వినిపిస్తోంది. వీరితోపాటు కోమటిరెడ్డి కుటుంబానికి చెందిన పవన్ రెడ్డి కూడా రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. ఇంతమంది మధ్యలో చివరకు టికెట్ ఎవరికి దక్కనుంది అన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.

వరంగల్

ఎస్సీ రిజర్వు నియోజకవర్గం నుంచి మాదిగ సామాజిక వర్గానికి టికెట్ కేటాయిస్తారన్న మాట వినిపిస్తోంది. ఎందుకుంటే ఇప్పటివరకు ప్రకటించిన రెండు ఎస్సీ రిజర్వుడ్ సీట్లలో అభ్యర్థులుగా మాల సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వటంతో వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఫైనల్ చేసే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఇక.. రేసులో ఉన్న వారిలో దిమ్మాట సాంబయ్య.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన పసునూరి దయాకర్ .. గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ రాగమళ్ల పరమేశ్వర్ లు టికెట్లను ఆశిస్తున్నారు. మరి.. ఎవరికి దక్కుతుందో చూడాలి.

అదిలాబాద్.. నిజామాబాద్.. కరీంనగర్

బీజేపీ అధిక్యత ప్రదర్శిస్తున్న ఈ మూడు ఎంపీ స్థానాల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎవరు బరిలో నిలుస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తెలంగాణలో ఉన్న 17 ఎంపీ స్థానాల్లో ఈ మూడు స్థానాల్లో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మూడు నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్ కు పెద్దగా బలం లేని నేపథ్యంలో ఎంపీ ఎన్నికల్లో బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దింపాలని భావిస్తున్నారు.

కరీంనగర్ ఎంపీ విషయానికి వస్తే.. మాజీ ఎమ్మెల్యే అలిగి ప్రవీణ్ రెడ్డి పేరు వినిపిస్తోంది. ఆయన పేరుతో పాటు వెలిచాల రాజేందర్ పేరు వినిపిస్తోంది. అయితే.. ప్రవీణ్ రెడ్డికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. నిజామాబాద్ విషయానికి వస్తే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీ చేస్తారని చెబుతున్నారు. బాల్కొండ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన ముత్యాల సునీల్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. అదిలాబాద్ విషయానికి వస్తే..స్థానిక నేతలతో పోలిస్తే బయట నుంచి తీసుకొచ్చిన నేతల్ని బరిలోకి దింపుతారని చెబుతున్నారు. రిమ్స్ వైద్యురాలిగా పని చేసిన డాక్టర్ సుమలత.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణలో ఒకరు బరిలో ఉంటారని చెబుతున్నారు.