Begin typing your search above and press return to search.

మరో దారుణం: భార్య వేధింపులకు భర్త ఆత్మహత్య.. కన్నీటితో సెల్ఫీ వీడియో!

ఈ సమయంలో.. ఆ ఘటనను గుర్తుకు తెచ్చేలా మరో టెక్కీ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు..

By:  Tupaki Desk   |   28 Feb 2025 1:53 PM IST
మరో దారుణం: భార్య వేధింపులకు భర్త ఆత్మహత్య.. కన్నీటితో సెల్ఫీ వీడియో!
X

గత ఏడాది డిసెంబర్ లో బెంగళూరులో టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అతుల్.. ఆత్మహత్యకు ముందు సుమారు 40 పేజీల లేఖతో పాటు 80 నిమిషాల వీడియో కూడా రికార్డ్ చేశాడు! బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న అతుల్ సుభాష్.. తన భార్య, ఆమె కుటుంబ సభ్యులు విపరీతంగా వేధించినట్లు తెలిపాడు.

ఈ సమయంలో.. ఆ ఘటనను గుర్తుకు తెచ్చేలా మరో టెక్కీ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు.. ఇతడు కూడా ఒక భావోద్వేగ వీడియో రికార్డ్ చేసి, అందులో తన భార్యపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీంతో... ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఈ సందర్భంగా.. బెంగళూరులో అతుల్ సుభాష్ ఘటన జ్ఞప్తికి తెస్తున్నారు నెటిజన్లు.

అవును... ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా డిఫెన్స్ కాలనీకి చెందిన మానవ్ శర్మ (35) ఐటీ కంపెనీలో రిక్రూట్మెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఈ సమయంలో తాజాగా తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అంతకంటే ముందు.. ఓ భావోద్వేగ వీడియో రికార్డ్ చేసి, అందులో తన భార్యపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ వీడియోలో శర్మ కన్నీటి పర్యంతమవుతూ మాట్లాడారు!

ఈ సందర్భంగా... తన భార్య తనను విపరీతంగా వేధించిందని.. తనతో తరచూ దురుసుగా ప్రవర్తించేదని.. ఆమె నడవడికపైనా తనకు అనుమానం వచ్చిందని.. ఈ క్రమంలో ఇది వరకే తాను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించానని.. రోజు రోజుకీ తన భార్య వల్ల మరింత మానసిక క్షోభకు గురవుతున్నానని.. అందువల్లే అంతిమంగా ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు!

ఇదే వీడియోలో మానవ్ తన తల్లి తండ్రులకు క్షమాపణలు చెప్పారు. ఇందులో భాగంగా.. పాపా, మమ్మీ, అక్కూ.. సారీ.. ఇక నేను వెళ్లిపోతున్నా" అని అన్నారు. ఈ సందర్భంగా.. సమాజంలో పురుషుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎవరో ఒకరు దయచేసి మగవారి గురించి గొంతు విప్పాలని మానవ్ కోరుతూ... ఉరి బిగించుకున్నారు!

ఈ వ్యవహారంపై మానవ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా.. తన కుమారుడికి గత ఏడాది వివాహం అయ్యిందని.. పెళ్లి తర్వాత ఉద్యోగరీత్యా తనతో పాటు తన భార్యను ముంబైకి తీసుకెళ్లాడని.. అయితే, అక్కడ తరచూ గొడవలు జరిగేవని.. కుటుంబాన్ని తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు ఆమె బెదిరించేదని తెలిపారని తెలుస్తోంది.

ఇదే సమయంలో... తమ కోడలు, కుటుంబ సభ్యులతో కలిసి తన కుమారుడిని విపరీతంగా బెదిరించారని.. అందువల్లే మానవ్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారని అంటున్నారు. ఈ ఘటన.. భార్య వేధింపులు తాళలేక తనువు చాలిస్తున్న భర్తల పరిస్థితిపై చర్చను మరోసారి లేవనెత్తిందని అంటున్నారు.