Begin typing your search above and press return to search.

ఐటీ ఉద్యోగులకు ‘ఐటీ’ షాక్..

దేశీయ దిగ్గజ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పనిచేస్తున్న వేలాది మంది ఐటీ ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఝలక్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   13 Sep 2024 9:41 AM GMT
ఐటీ ఉద్యోగులకు ‘ఐటీ’ షాక్..
X

దేశీయ దిగ్గజ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పనిచేస్తున్న వేలాది మంది ఐటీ ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఝలక్ ఇచ్చారు. ఏకంగా 30 నుంచి 40 వేల మంది ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ ద్వారా నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ఉద్యోగులంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. సినీయారిటీని బట్టి ఒక్కో ఉద్యోగికి రూ.50వేల నుంచి లక్ష వరకు పన్ను చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.

ఐటీ విభాగం నుంచి ఒక్కసారిగా నోటీసులు రావడంతో ఉద్యోగులంతా అయోమయంలో పడ్డారు. ఇప్పటికే ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినప్పటికీ మళ్లీ ఎందుకు వచ్చాయంటూ భయపడిపోయారని ఓ ఇంగ్లిష్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే.. సాఫ్ట్‌వేర్‌లో పొరపాటు కారణంగానే టీడీఎస్‌కు సంబంధించిన వివరాలు తప్పుగా నమోదైనట్లుగా తెలుస్తోంది. ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లో వివరాలు సరిగా అప్‌డేట్ కాకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.

2023-24 ఆర్థిక సంవత్సరానికి పన్ను చెల్లింపుదారులు చెల్లించిన టీడీఎస్‌కు ఎలాంటి రికార్డులు లేకపోవడంతో ఐటీ చట్టం సెక్షన్ 143(1) ప్రకారం ఈ నోటీసులు జారీ చేసినట్లు ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసులు ఈ నెల 9న ఉద్యోగులు జారీ అయ్యాయి. ఫలితంగా ఉద్యోగులకు రావాల్సిన రీఫండ్ కూడా నిలిచిపోయినట్లు సమాచారం.

దీనిపై టీసీఎస్ సంస్థ స్పందించింది. నోటీసులు అందిన ఉద్యోగులు ఎవరూ ఐటీ చెల్లింపులు జరపవద్దని అంతర్గతంగా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. సంస్థ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చెల్లింపులు వద్దని పేర్కొంది. దీనిపై ఐటీ అధికారులతో చర్చిస్తున్నామని.. త్వరలోనే క్లారిటీ వస్తుందని చెప్పింది.