వైసీపీతో సంబంధాలు? కొలికపూడి ఎపిసోడ్ లో తాజా ఆప్డేట్స్!
తిరువూరు నియోజకవర్గానికి చెందిన ఏఎంసీ మాజీ చైర్మన్ రమేశ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కొలికపూడి పార్టీకి డెడ్ లైన్ విధించడం రాజకీయంగా సంచలనం రేపుతోంది.
By: Tupaki Desk | 29 March 2025 6:53 AMతిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారాన్ని టీడీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. పార్టీ నేత రమేశ్ రెడ్డిపై 48 గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానంటూ అల్టిమేటం జారీ చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన నుంచి కొలికపూడి అనేక వివాదాలకు కేంద్రంగా మారుతున్నారు. దీంతో ఆయన ప్రవర్తన హైకమాండుకు తలనొప్పిగా మారింది. రాజకీయాలకు కొత్త కావడంతో కొన్నాళ్లు సమయం ఇవ్వాలని భావించిన అధిష్టానం ఇన్నాళ్లు వేచిచూసిందని చెబుతున్నారు. పది నెలలు కావస్తున్నా కొలికపూడి తీరు మారకపోవడంతో ఇక తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీకి ఆయన అల్టిమేటం జారీ చేయడం పరాకాష్టగా చూపుతూ ఎమ్మెల్యేపై వేటు వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు.
తిరువూరు నియోజకవర్గానికి చెందిన ఏఎంసీ మాజీ చైర్మన్ రమేశ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కొలికపూడి పార్టీకి డెడ్ లైన్ విధించడం రాజకీయంగా సంచలనం రేపుతోంది. పార్టీలో ఏదైన అంతర్గత సమస్య ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి నాలుగు గోడల మధ్య సమస్యను పరిష్కరించుకోవాల్సివుంటుందని, కానీ కొలికపూడి మీడియా ముఖంగా పార్టీకే హెచ్చరికలు జారీ చేయడం తీవ్రంగా పరిగణించాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు. మరోవైపు కొలికపూడి ప్రవర్తనపై పార్టీ అధిష్టానం ఆరా తీస్తోంది. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి తిరువూరులోని వార్డు, గ్రామ స్థాయి నేతలకు ఫోన్లు చేసి సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. మెజార్టీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఎమ్మెల్యే కొలికపూడి టీడీపీ నేతలు, కార్యకర్తలను దూరంపెడుతూ వైసీపీ నేతలతో సంబంధాలు ఏర్పరుచుకుంటున్నారని అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఇసుక రవాణాకు సంబంధించి తిరువూరుకు చెందిన వైసీపీ నేతలతో ఎమ్మెల్యే కొలికపూడి సంబంధాలు ఏర్పరుచుకున్నారని పార్టీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. మరోవైపు పార్టీ అధిష్టానం ఆదేశాలతో జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం తిరువూరు టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే కొలికపూడికి మాజీ ఏఎంసీ చైర్మన్ రమేశ్ రెడ్డి మధ్య వివాదంపై ఆరా తీశారు. రమేశ్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్న ఆడియో నిజమో? కాదా? అనేది కూడా వివరణ ఇవ్వాలని కోరినట్లు చెబుతున్నారు.
ఏఎంసీ మాజీ చైర్మన్ తో వివాదం ఉంటే ఎమ్మెల్యే వ్యక్తిగత స్థాయిలో చూసుకోవాలని, కానీ పార్టీ క్రమశిక్షణను అతిక్రమిస్తూ అధిష్టానానికే అల్టిమేటం జారీ చేయడంపై పార్టీ నాయకత్వం అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇలాంటి ప్రవర్తన కారణంగానే జరవరిలో ఆయనను క్రమశిక్షణ సంఘం పిలిపించి వివరణ తీసుకుందని గుర్తు చేస్తున్నారు. ఆయన వ్యవహారంతో నిత్యం ఏదో వివాదాలు చెలరేగడంతోపాటు కార్యకర్తలు, మహిళలు ఆత్మహత్యాయత్నాలకు ఒడిగట్టడం కూడా పార్టీ సీరియస్ గా పరిగణిస్తోందని అంటున్నారు. మరోవైపు దుందుడుకు ప్రవర్తనతో ప్రభుత్వానికి తలనొప్పులు తెస్తున్నారని అంటున్నారు. గతంలో బెల్టుషాపులు ఉన్నాయని ఆరోపిస్తూ ఎమ్మెల్యే బహిరంగంగా మద్యం ప్రదర్శించడం కూడా పార్టీ పెద్దలు మరోమారు హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారంటున్నారు.
మొత్తంగా కొలికపూడి వ్యవహారంపై పూర్తి నివేదిక తెప్పించుకుంటున్న టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యేతో తలనొప్పిని వదిలించుకునే దిశగా అడుగులు వేస్తోందని అంటున్నారు. పది నెలలుగా నిత్యం వివాదాలతో తిరువూరు టీడీపీ నేతలు మనస్శాంతి లేకుండా గడుపుతున్నారని, ఇకనైనా ఎమ్మెల్యేని కట్టడి చేయకపోతే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మరింత ఘోరంగా దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొలికపూడిపై టీడీపీ హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.