టీడీపీ కార్యర్తలను నరికేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు
టీడీపీలో యాక్టివ్ గా ఉండే రామక్రిష్ణనాయుడ్ని దారుణంగా హత్య చేసిన వైనంపై నిరసన వ్యక్తమవుతోంది.
By: Tupaki Desk | 16 March 2025 10:46 AM ISTఉమ్మడి చిత్తూరులో చోటు చేసుకున్న దారుణహత్య షాకింగ్ గా మారింది. తెలుగుదేశం కార్యకర్తను వెంటాడి కత్తితో మెడ నరికేసిన వైనం సంచలనమైంది. పెద్ద వయస్కుడైన రామక్రిష్ణనాయుడ్నికత్తితో నరికేసి.. ఆయన కొడుకును హతమార్చే ప్రయత్నం చేయగా తప్పించుకున్నాడు. హత్య చేసిన వ్యక్తి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుచరుడిగా చెబుతున్నారు. టీడీపీలో యాక్టివ్ గా ఉండే రామక్రిష్ణనాయుడ్ని దారుణంగా హత్య చేసిన వైనంపై నిరసన వ్యక్తమవుతోంది. అధికారంలో కూటమి ప్రభుత్వం ఉన్నా.. పుంగనూరు నియోజకవర్గంలో మాత్రం పెద్దిరెడ్డి హవానే నడుస్తుందన్న ప్రధాన ఆరోపణ ఇప్పుడు అధికార పార్టీకి సవాలుగా మారింది.
తనకు వైసీపీ కార్యకర్తల నుంచి ప్రాణహాని ఉందని రెండు వారాల క్రితం రామక్రిష్ణ పోలీసులకు వీడియో ద్వారా విన్నవించుకున్నా.. పట్టించుకోలేదని.. ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించటమే తాజా హత్యకు కారణంగా ఆరోపిస్తున్నారు. ఈ ఉదంతం అనంతరం సీఐ.. హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా.. పోయిన ప్రాణం తిరిగి రాని పరిస్థితి.
పుంగనూరు మండలం చండ్రమాకులపల్లి పంచాయితీ క్రిష్ణాపురానికి చెందిన 55 ఏళ్ల రామక్రిష్ణ నాయుడు టీడీపీలో చురుకైనా కార్యకర్త. వైసీపీ ఐదేళ్ల పాలనను ఆయన ఎండగట్టేవారు. 20 ఏళ్ల క్రితం టీడీపీ హయాంలోఇంటి పట్టాలు ఇవ్వగా..ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకుంటూ ఉంటే వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫు పోలింగ ఏజెంట్ గా వ్యవహరించారు. ఫలితాలు వెలువడిన రోజున కేక్ కట్ చేసి.. టపాసులు కాల్చి తన ఆనందాన్ని ప్రదర్శించాడు.
దీన్ని జీర్ణించుకోలేని వైసీపీ కార్యకర్తలు వెంకటరమణ.. గణపతి.. మహేశ్.. త్రిలోక్ లు ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజునే రామక్రిష్ణపై దాడికి దిగారు. వీరి దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన రామక్రిష్ణ భార్య దేవమ్మను బైక్ తో ఢీ కొట్టారు. దీంతో ఆమె రెండు కాళ్లు దెబ్బ తిన్నాయి. తమపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఇరువురిపైనా కేసులు పెట్టటం గమనార్హం.
ఊళ్లో వైసీపీ అధిక్యతే ఉండాలని వార్నింగ్ ఇస్తూ ఇప్పటికి నాలుగుసార్లు రామక్రిష్ణపై హత్యాయత్నానికి పాల్పడితే.. తప్పించుకున్నాడు. ఐదోసారి మాత్రం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. రెండు వారాల క్రితం తన పొలంలో ట్రాక్టర్ తో మట్టి తరలిస్తుండగా వైసీపీ కార్యకర్తలు డ్రైవర్ తో గొడవకు దిగి కొట్టారు. అడ్డు వచ్చిన రామక్రిష్ణను చితకబాదారు. అక్కడితో ఆగకుండా అతని కొడుకు.. కోడలిపైనా దాడి చేశారు. దీనిపై సీఐ శ్రీనివాసులకు కంప్లైంట్ చేసినా స్పందించలేదు. దీంతో తమపై దాడి చేసినా చర్యలు తీసుకోరా? అంటూ గట్టిగా ప్రశ్నించగా ఐదు నిమిషాలు సెల్ లో కూర్చోబెట్టి వదిలేశారు.
శుక్రవారం రాత్రి నరసింహస్వామి రథం ఊరేగింపులోనూ వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. శనివారం ఉదయం రామక్రిష్ణ కొడుకు సురేశ్ ఒక షాప్ ముందు కూర్చొని ఉంటే.. వేటకొడవళ్లతో వచ్చి చంపే ప్రయత్నం చేయగా.. గాయాలతో తప్పించుకున్నాడు. అదే సమయంలో ట్రాక్టర్ మీద వస్తున్న రామక్రిష్ణపై దాడికి తెగబడిన వెంకటరమణ కత్తితో మెడపై నరికాడు. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించి.. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలోనే మరణించాడు.
కొద్దికాలంగా తమపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నా.. పోలీసులు స్పందించలేదని రామక్రిష్ణ కుటుంబీకులు వాపోతున్నారు. సీఐ పక్షపాత వైఖరితో వైసీపీ కార్యకర్తలకే వత్తాసు పలుకుతున్నారని.. ఇప్పటికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవానే నడుస్తుందని చెబుతున్నారు. ఆసుపత్రికి మాజీ మంత్రి అమరనాథ రెడ్డి.. ఎమ్మెల్యే పులివర్తి నాని.. మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేశ్.. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు తదితరులు వచ్చి బాధితులను పరామర్శించారు. ఎన్నికలకు ముందు టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడి.. తిరిగి వారిపైనే కేసులు పెట్టి జైళ్లకు పంపిన వైసీపీ కార్యకర్తలు ఇప్పటికి తమ ఆగడాల్ని కొనసాగిస్తున్నా.. చర్యలు శూన్యమన్న మాట టీడీపీ వర్గీయుల్ని తీవ్ర వేదనకు గురి చేస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాణాలు పోవటం ఒక ఎత్తు.. అధికారపక్షంగా ఉన్నప్పుడు కూడా తెగబడి మెడ నరికేసిన వైనం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.