Begin typing your search above and press return to search.

కూటమి ఉచిత బస్సు అక్కడిదాకానేనా ?

అప్పటికే తెలంగాణలో కర్ణాటకలో ఈ హామీ ఇచ్చి అక్కడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

By:  Tupaki Desk   |   15 Feb 2025 11:30 PM GMT
కూటమి ఉచిత బస్సు అక్కడిదాకానేనా ?
X

తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు పథకం అమలు చేయాలని చూస్తోంది అని ప్రచారం సాగుతోంది. ఎన్నికల వేళ కూటమి పెద్దలు దీని మీద ఒక హామీ ఇచ్చారు. ఇది కూడా కూటమి ఎన్నికల్లో గెలవడానికి ఒక కారణం అని చెబుతూంటారు. ఉచిత బస్సు పధకం మహిళల కోసం అన్నది ఎంతో పాపులర్ అయింది. అప్పటికే తెలంగాణలో కర్ణాటకలో ఈ హామీ ఇచ్చి అక్కడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

దాంతో దీనిని తెలుగుదేశం కూటమి తమ ఎన్నికల అజెండాలో పెట్టింది. ఇదిలా ఉంటే ఏపీలో బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా ఈ పథకం గురించి ఆలోచన చేయలేదు అన్న విమర్శలు ఉన్నాయి.

ఈ నెల 12తో ఎనిమిది నెలల పాలన పూర్తి చేసుకుంది కూటమి ప్రభుత్వం. కానీ ఉచిత బస్సు ఎపుడు అన్నది ఇంకా ఒక క్లారిటీ అయితే లేదని వైసీపీ సహా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మొదట దసరా అన్నారు, ఆ తరువాత సంక్రాంతి అన్నారు. అసలు అమలు చేస్తున్నారా లేదా అన్న విమర్శలు అయితే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంటోంది అని అంటున్నారు. ఈ పధకానికి ఉగాది నుంచి అమలు చేయడానికి కృత నిశ్చయంతో ఉందని చెబుతున్నారు. అయితే ఈ పథకం కోసం ప్రభుత్వం అనేక అధ్యయనాలు చేసింది. కర్ణాటక తమిళనాడుకు అధికారుల బృందాన్ని పంపించింది. అలాగే మంత్రుల బృందాన్ని కూడా పంపించింది. ఆ నివేదికలు దగ్గర పెట్టుకుని పూర్తి స్థాయి కసరత్తు చేసింది.

ఇక ఎవరికీ ఇబ్బంది లేకుండా అదే సమయంలో ఆర్టీసీకి నష్టాలు రాకుండా మహిళలకు ఉచిత బస్సు పధకాన్ని అమలు చేయాలని చూస్తోంది అని అంటున్నారు. పొరుగు రాష్ట్రాలలో ఈ పధకం ద్వారా ఆయా రాష్ట్రాల సరిహద్దుల దాకా ఉచితంగా నడుపుతున్నారు. దాని వల్ల ఆర్టీసీ నష్టాలలోకి వెళ్తోందని అని అధ్యయనాలు చెబుతున్నాయి.

దాంతో ఈ పధకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తూనే హద్దులను నిర్ణయించింది అని అంటున్నారు. ఈ పధకం ద్వారా మహిళకు జిల్లాలోనే ఉచితంగా ప్రయాణించేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు అని అంటున్నారు. అంటే ఏ జిల్లా వారు ఆ జిల్లాలోనే ప్రయాణం చేయగలుగుతారు అన్న మాట. వారు పక్క జిల్లాకు వెళ్ళాలి అంటే మాత్రం కచ్చితంగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.

ఇక జిల్లా పరిధిలో ప్రయాణించేందుకు కూడా అవసరం అయిన అదనంపు బస్సులను కొనుగోలు చేయడం అదనపు సిబ్బందిని నియమించడం వంటి దాని మీద ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అని అంటున్నారు. దీని వల్ల ఉచిత బస్సులు నడిపినా మిగిలిన ప్రయాణీకులకు ఇబ్బంది రాకుండా చూడాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది అని అంటున్నారు.

అంతే కాదు ఆర్టీసీ సిబ్బంది మీద పని భారం లేకుండా అదనపు సిబ్బందిని వేసుకోవాలని ఆలోచిస్తున్నారు.అని తెలుస్తోంది. ఇలా చేసినా కూడా ప్రభుత్వానికి ఖజానాకు నెలకు నాలుగు వందల కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతాయని చెబుతున్నారు. అయితే అన్నీ భరించి ఈ పధకాన్ని తెలుగు వారి కొత్త సంవత్సరాది ఉగాది నుంచి అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. దాంతో ఉచిత బస్సు హామీ అయితే తొందరలోనే నెరవేరుతుంది అని అంటున్నారు. మరి జిల్లాల వరకే ఉచిత బస్సు అంటే మహిళల నుంచి ఎంతవరకూ ఆదరణ ఉంటుంది అన్నది చూడాలని అంటున్నారు.