Begin typing your search above and press return to search.

టీడీపీ కూటమికి ఆదిలోనే ఇంతగానా?

కచ్చితంగా వంద రోజులు కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి కాలేదు.

By:  Tupaki Desk   |   5 Sep 2024 3:36 AM GMT
టీడీపీ కూటమికి ఆదిలోనే ఇంతగానా?
X

కచ్చితంగా వంద రోజులు కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి కాలేదు. కానీ వరసగా ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. విశాఖలో రెండు వారాల క్రితం ఒక సెజ్ లో భారీ ప్రమాదం జరిగి ఏకంగా ఇరవై మంది దాకా మృత్యు వాత పడ్డారు. ఆ ఘటన అలా ఉండగానే ఇపుడు దానిని మించి జల ప్రళయమే వచ్చి పడింది.

ఏపీకి వాణిజ్య రాజధానిగా ఉన్న బెజవాడ మీదనే వరద బీభత్సం తాకిడి చేసింది. దాంతో మొత్తం బెజవాడ స్తంభించి పోయింది. ఏపీకి ఆదాయాన్ని తెచ్చే ఈ నగరం ఇలా కునారిల్లడం ఇప్పట్లో కోలుకోలేని విధంగా నష్టాల పాలు కావడం నిజంగా కూటమికి పెద్ద కష్టమే తెచ్చిపెట్టింది అని అంటున్నారు.

వరదల వల్ల వచ్చిన నష్టం మాటలకు అందనిదీ ఏ రకమైన అంచనాలు వేయడానికి కూడా వీలు కుదరనిది అని అంటున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల్లో పడ్డారు. బిజీగా బిజినెస్ చేసుకునే ఒక నగరాన్ని జల ఖడ్గం కుత్తుక కత్తిరించినట్లు అయింది అని అంటున్నారు.

అంతే కాదు ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలతో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన రోడ్లు అన్నీ కూడా దారుణంగా దెబ్బ తిన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్ల విషయంలో ఆలోచన చేస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ తో రోడ్ల నిర్మాణం చేపట్టాలని చూస్తున్నారు.

తొలి దశలో కొన్ని మలిదశలో కొన్ని అని ప్రణాళికలు రూపొందించుకునే పనిలో ప్రభుత్వం ఉంది. ఇంతలో అసలు పట్టణం, పల్లె తేడా లేకుండా మొత్తం రోడ్లు కొట్టుకుని పోయాయి. అధికారులు అందించిన వివరాల ప్రకారం చూస్తే కనుక ఏకంగా 3,312 కిలోమీటర్లమేర రోడ్లు కొట్టుకుని పోయాయి.

అలాగే ఖరీఫ్ సీజన్ అతి పెద్దది. మొత్తం సంవత్సరం పంట అంతా వచ్చే సీజన్ ఇదే. అలాంటి సీజన్ లో వచ్చిన ఈ వాయుగుండం రైతుల పాలిట గండంగా మారింది. దానతో ఏపీలో ఒక లక్షా డెబ్బై వేల ఎకరాలలో పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. దాంతో రైతులు అంతా గగ్గోలు పెడుతున్నారు. అలాగే మరో 18.424 హెక్టార్లలో ఉద్యాన పంటలు కూడా దెబ్బ తిన్నాయి.

ఇలా అన్ని విధాలుగానూ ఏపీ ఇబ్బందులో కూరుకుని పోయింది. ఏపీ ఆర్ధిక పరిస్థితి చూస్తే ఏ మాత్రం బాగులేదు. దానికి తోడు అన్నట్లుగా వచ్చి పడిన వరదలతో కూటమి ప్రభుత్వం పూర్తిగా ఇబ్బందుల్లో పడింది అని అంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధానిని తొలి ప్రయారిటీగా పెట్టుకుంది.

అలాగే పోలవరం విషయంలోనూ పట్టుదలగా అడుగులు వేస్తోంది. ఈ సమయంలో వాయుగుండాలు వచ్చి పడడమే కాకుండా వరదలతో ఏపీని అతలాకుతలం చేస్తూంటే ఏపీ ఏ విధంగా ఎత్తిగిల్లుతుంది అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఈ భారీ నష్టానికి తగిన విధంగా ఆదుకోవాల్సింది కేంద్రమే అని అంటున్నారు.లేకపోతే ఏపీ కోలుకోలేదని కూడా అంటున్నారు.