Begin typing your search above and press return to search.

సూపర్ సిక్స్...కూటమికి ట్రబుల్స్ ఫిక్స్ ?

అయితే ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయినా సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చడం లేదు అని వైసీపీ కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   19 Oct 2024 2:46 AM GMT
సూపర్ సిక్స్...కూటమికి ట్రబుల్స్ ఫిక్స్ ?
X

సూపర్ సిక్స్ ని టచ్ చేయడమే తరువాయి టీడీపీ కూటమికి ట్రబుల్స్ ఫిక్స్ అవడం ఖాయమని అంటున్నారు. ఏపీ ఆదాయం అన్నది ఎంత పెరిగినా అది అభివృద్ధికి సంక్షేమానికి ఒకేసారి సరిపోదు, అందులోనూ అప్పులో పుట్టి అప్పులతో సాగుతో పది లక్షల కోట్ల అప్పు దాని మీద వేలల్లో వడ్డీ ఏపీ ఖజనాను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది.

అయితే ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయినా సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చడం లేదు అని వైసీపీ కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ అయితే సూపర్ సిక్స్ లేదు సెవెన్ లేదు అని అదే పనిగా ర్యాగింగ్ చేస్తున్నారు. బాబు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు కానీ హామీలు అమలు చేయరని కూడా ఆయన అంటున్నారు.

ఇక కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల కూడా ఉచిత హామీలు ఎపుడు అమలు చేస్తారు బాబు గారూ అని నిలదీస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అని కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఇక జనంలో చూస్తే సంక్షేమ పధకాల మీద కోటి ఆశలు పెట్టుకున్నారు. గత అయిదేళ్ళలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి మరీ సంక్షేమాన్ని అమలు చేస్తూ పోయింది. దాని ఫలితంగా ప్రతీ ఒక్కరి ఖాతాలో నేరుగా నగదు పడింది.

అలా చూసుకుంటే కనుక తక్కువలో తక్కువ ప్రతీ ఖాతాలో లక్షల రూపాయలు వచ్చి పడ్డాయి. వైసీపీ కంటే ఎక్కువ ఇస్తారని కూటమికి ఓటు వేసిన జనాలే ఎక్కువ. కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలిక పోయింది అన్నట్లుగా జగన్ కంటే ఎక్కువ ఇస్తారు అనుకుంటే అసలు పధకాల ఊసే లేదని జనాలు మండిపడుతున్న నేపథ్యం ఉంది. అది నెమ్మదిగా అసంతృప్తి నుంచి వ్యతిరేకత వైపుగా దారి తీయకుండా చూసుకోవాలంటే సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి తీరాల్సిందే.

అయితే ఏపీలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పి ఉంది. అప్పులతోనే అంతా జరుగుతోంది. జగన్ ఇచ్చిన మూడు వేల సామాజిక పెన్షన్లను నాలుగు వేలకు పెంచింది కూటమి ప్రభుత్వం దాని వల్ల అదనంగా మరో నాలుగు వేల కోట్లు అవుతోంది.

ఇపుడు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను దీపావళి నుంచి ఇవ్వడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దాని వల్ల కూడా పెను భారమే పడనుంది. సూపర్ సిక్స్ లోని తల్లికి వందనం అంటూ ప్రతీ విద్యార్ధి తల్లి ఖాతాలో ఇరవై వేల రూపాయలు వేస్తామని కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అది కూడా ఒక కుటుంబంలో ఎందరు పిల్లలు ఉంటే అందరికీ అని అన్నారు.

అలాగే రైతు భరోసా అని వైసీపీ ఇచ్చిన దాని కంటే డబుల్ అన్నట్లుగా అన్నదాత సుఖీభవ స్కీం తో ఇరవై వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఏపీలో మొత్తం యాభై లక్షల మంది దాకా రైతులు ఉన్నారు. వీరికి ఈ పధకాలు అంటే ఇంకా పెద్ద ఎత్తున భారం పడుతుంది.

ఇక 18 ఏళ్ళు నిండిన ప్రతీ మహిళకు నెలకు పదిహేను వందలకు ఇస్తామన్నది మరో పధకం. వీటిని అమలు చేసేందుకు ప్రభుత్వం వద్ద నిధులు ఎంత మేరకు ఉన్నాయో తెలియదు కానీ ఒత్తిడి మాత్రం గట్టిగానే ఉంది. దాంతో చంద్రబాబు ఈ నెల 23న నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో సూపర్ సిక్స్ పధకాల గురించే ప్రధానంగా చర్చిస్తారు అని అంటున్నారు

అంతే కాదు తల్లికి వందనం, అన్న దాత సుఖీభవ పధకానికి ఎంత ఖర్చు అవుతుంది అన్నది చూడాలని అధికారులను కోరినట్లుగా చెబుతున్నారు. మొత్తం మీద సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తే కనుక అభివృద్ధికి నిధుల కొరత ఏర్పడుతుంది. అమరావతి పోలవరం ప్రాజెక్టులను ప్రభుత్వం పతిష్టగా భావిస్తోంది.

మరి చంద్రబాబు వీటి విషయంలో ఏమి ఆలోచిస్తారో చూడాలి. ఇక సంక్షేమ పధకాలు అమలు చేయడం ఒక ఎత్తు అయితే ఎక్కడైనా తేడా వచ్చినా కొందరికి ఇవ్వకపోయినా ఆ తలనొప్పులు ఉండనే ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. బాబు గారు ఏమి చేస్తారో. సూపర్ సిక్స్ తో ఆర్ధికంగా ప్రాబ్లమ్స్ వస్తాయా అన్నది కూడా చర్చగా ఉంది.