టీడీపీ ఎమ్మెల్సీలు వీరే...అనూహ్యం ఈ ఎంపిక !
తెలుగుదేశం పార్టీ సుదీర్ఘమైన కసరత్తు చేసిన అనంతరం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది.
By: Tupaki Desk | 9 March 2025 8:27 PM ISTతెలుగుదేశం పార్టీ సుదీర్ఘమైన కసరత్తు చేసిన అనంతరం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. గత కొంతకాలంగా మీడియాలో ప్రముఖంగా వినిపించిన పేర్లు ఏవీ ఈ జాబితాలో లేకపోవడం విశేషం.
ఎన్నో లెక్కలు మరెన్నో సమీకరణలు ఇంకెన్నో ఆలోచనలు ఇలా అన్నీ కలగలిపి ఎంపిక చేసిన ఈ జాబితా ఆశావహులకు షాక్ అయినా పార్టీ ప్రయోజనాల రీత్యా ఆమోదయోగ్యమైన తీరులోనే ఉందని అంటున్నారు. అన్ని వర్గాల సమతూకం పాటిస్తూ ఈ ఎంపిక చేశారు.
ఒక మహిళకు అవకాశం ఇవ్వగా బడుగు బలహీన వర్గాలకు న్యయాం జరిగింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ టీడీపీ సీనియర్ నాయకురాలు అయిన ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీగా చాన్స్ ఇచ్చారు. ఆమె చాలా కాలంగా పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. నవతరం ప్రతినిధిగా ఉన్నారు. డైనమిక్ లేడీగా కూడా ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి మహిళకు ఆ విధంగా చాన్స్ దక్కిందని భావించాలి.
ఇక మరో ఎమ్మెల్సీ పదవికి నెల్లొరు జిల్లాకు చెందిన బీద రవిచంద్రకు ఎమ్మెల్సీగా అవకాశం లభించింది. ఆయన యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు. పార్టీలో బలమైన గొంతుకగా వెనకబడిన వర్గాల ప్రతినిధిగా ఉన్నారు. అలా ఆయనకు అవకాశం ఇచ్చారు.
ఇక రాయలసీమ జిల్లాల నుంచి బీటీ నాయుడుకు ఎమ్మెల్సీగా చాన్స్ ఇచ్చారు. ఆయన బోయ సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ విధంగా టీడీపీ అధినాయకత్వం ఈ ఎంపిక ద్వారా తనదైన శైలిని కనబరచింది అని చెప్పాలి. అయిదు ఖాళీలలో ఒకదానిని జనసేనకు ఇవ్వగా మరొకటి బీజేపీకి కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ పదవి కోసం చాలా మంది పేర్లు వినిపించాయి. వంగవీటి రంగా తనయుడు రాధాకు ప్రామిస్ ఇచ్చారని కూడా చర్చ సాగింది. అలాగే పిఠాపురం వర్మకు గ్యారంటీ అనుకున్నారు. ఇక మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుతో పాటు బుద్ధా వెంకన్న కూడా తీవ్రంగానే ప్రయత్నం చేశారు అని ప్రచారం సాగింది.
అయితే ఈ ఎంపిక మాత్రం టీడీపీ సరికొత్త మార్క్ పాలిటిక్స్ కి తెర తీసేలా ఉందని అంటున్నారు. కొత్త ముఖాలు యువ రక్తం పార్టీకి విధేయంగా ఉండడంతో పాటు మరింత జోష్ తో పనిచేసే వారు కావాలన్నది పార్టీ విధానంగా ఈ ఎంపిక ద్వారా కనిపిస్తోంది అని అంటున్నారు.