Begin typing your search above and press return to search.

ఆసక్తికరంగా పులివెందుల పాలిటిక్స్... టీడీపీ బిగ్ స్కెచ్!

అయితే.. ఆ పరిస్థితులు మారుతున్నాయని.. మార్చుతున్నారని.. ఆ మేరకు కూటమి నేతలు పక్కా స్కెచ్ వేస్తూ ముందుకు కదులుతున్నారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   28 Feb 2025 11:00 AM IST
ఆసక్తికరంగా పులివెందుల పాలిటిక్స్... టీడీపీ బిగ్ స్కెచ్!
X

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పులివెందుల అనేది ఓ బిగ్ బ్రాండ్ అనే సంగతి తెలిసిందే. నాడు వైఎస్సార్ నుంచి నేడు జగన్ హయాం వరకూ.. పులివెందుల అంటే వైఎస్ ఫ్యామిలీ కంచుకోట అని చెబుతుంటారు. అయితే.. ఆ పరిస్థితులు మారుతున్నాయని.. మార్చుతున్నారని.. ఆ మేరకు కూటమి నేతలు పక్కా స్కెచ్ వేస్తూ ముందుకు కదులుతున్నారని అంటున్నారు.

అవును... చాలా కాలంగా పులివెందులలో వైఎస్సార్ టైమ్ లో కాంగ్రెస్ జెండా, జగన్ హయాంలో వైసీపీ జెండా మాత్రమే ఎగురుతున్నాయని అంటోన్న వేళ.. త్వరలో అక్కడ పసుపు జెండా ఎగిరేలా కూటమి నేతలు ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ప్రధానంగా.. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లుగా పులివెందులపై స్పెషల్ ఫోకస్ పెట్టారని చెబుతున్నారు.

వాస్తవానికి గత ఏడాది జూన్ లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాయలసీమలో, ప్రధానంగా కడప, పులివెందులలో యాక్టివిటి బాగా పెంచింది కూటమి. జగన్ కంచుకోటను బద్ధలు కొట్టాలని పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఆపరేషన్ పులివెందుల ఊపందుకుందని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే పులివెందుల మున్సిపల్ పీఠంపై ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో 33 కౌన్సిల్ సీట్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేసి, మున్సిపల్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకుంది. ఈ సమయంలో టీడీపీ రచిస్తున్న సరికొత్త ప్లాన్ తో వైసీపీ కంచుకోటలో లీడర్లు సైకిల్ ఎక్కుతున్నారని అంటున్నారు. ఇది వైసీపీకి పెద్ద దెబ్బని చెబుతున్నారు.

ఇప్పటికే పులివెందులలో జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో 32 స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంది. ఇలా ఇటీవల పులివెందులలో పరిణామాలు వేగంగా మారుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే పులివెందుల మున్సిపాలిటీలో వైసీపీకి చెందిన ఓ కీలక కౌన్సిలర్ ఇటీవల టీడీపీకి జైకొట్టారు. త్వరలో మరో ఐదుగురు పార్టీ మారే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో జగన్ పులివెందుల పర్యటన పెట్టుకున్నారని అంటున్నారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న పలువురు కీలక నేతలతో చర్చలు జరిపారని తెలుస్తోంది. ప్రధానంగా.. ఇలాంటి కష్ట కాలంలోనే అంతా కలిసి ఉండాలని, పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని నొక్కి చెప్పారని అంటున్నారు. దీంతో... పులివెందుల రాజకీయం మరోసారి హాట్ టాపిక్ గా మారిందనే చర్చ మొదలైంది!