బీజేపీ గేట్లు తీయడం లేదా.. అడ్డుకుంటోంది ఎవరు ?
అలా అధికారంలో ఉన్నప్పుడు బలపడితే మరిన్ని ఎన్నికల్లో సీట్లూ ఓట్లు పెంచుకుని అధికారానికి ఏ రోజుకైనా చేరువ అవుతామన్న ఆశలు ఉంటాయి.
By: Tupaki Desk | 20 Feb 2025 2:30 AM GMTఏపీలో మూడు పార్టీలు కలసి కూటమి కట్టాయి. అధికారంలోకి వచ్చాయి. అయితే ఈ మూడు పార్టీలు ఇపుడు ఎవరికి వారుగా రాజకీయంగా బలపడే ప్రయత్నం చేస్తున్నాయి. రాజకీయ పార్టీలకు ఇది కావాల్సిందే కూడా. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటారు. అలా అధికారంలో ఉన్నప్పుడు బలపడితే మరిన్ని ఎన్నికల్లో సీట్లూ ఓట్లు పెంచుకుని అధికారానికి ఏ రోజుకైనా చేరువ అవుతామన్న ఆశలు ఉంటాయి.
అలా చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ తన బలాన్ని పెంచుకుంటోంది. ఆ పార్టీ వైసీపీ నుంచి చాలా మందిని చేర్చుకుంటోంది. జనసేన కూడా వైసీపీ నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి వారిని చేర్చుకుంది. అలాగే మంగళగిరిలో గంజి చిరంజీవిని, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను లాంటి వారిని చేర్చుకుంది.
బీజేపీ కూడా తాము ఎవరికీ తీసిపోమని చెప్పేందుకు యత్నిస్తోంది. ఆ పార్టీలో కూడా నేతలు చేరేందుకు చూస్తున్నారు అని టాక్ నడుస్తోంది. వైసీపీలోని నేతలకు మొదటి ఆప్షన్ టీడీపీనే. అక్కడ కాదు అంటే జనసేన లేదూ అంటే బీజేపీని ఆశ్రయిస్తున్నారు. ఆ విధంగా కూటమిలో తాము ఉన్నట్లు అయితే అనేక రకాలైన రాజకీయ ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతామని భావిస్తున్నారు. ఆ మీదట వచ్చే ఎన్నికల్లో చాన్స్ ఉంటే మళ్ళీ రాజకీయంగా రాణించవచ్చు అన్నది వారి అలోచనగా ఉంది.
అయితే బీజేపీలో చేరికలకు నేతలు యత్నిస్తున్నా వారికి బీజేపీ గేట్లు తెరచుకోవడం లేదు అని అంటున్నారు. దానికి కారణం ఏమిటి అన్నదే బీజేపీ కేంద్ర పెద్దలకు అర్ధం కావడం లేదుట. రాజకీయ పార్టీగా బలపడేందుకు ఇదే సరైన సమయం అని కానీ ఎందుకు ఈ విధంగా జరుగుతోంది అన్నది ఆరా తీసేందుకే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరిని ఢిల్లీ పిలిపించుకుని చర్చించారని తెలుస్తోంది.
అయితే ఏపీలో టీడీపీ కొందరు వైసీపీ నేతలను టార్గెట్ చేసిందని అంటున్నారు. అలాంటి నేతలు రాజకీయ ఆశ్రయం కోసం బీజేపీ వైపుగా వస్తున్నారని వారిని ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోవద్దని కూడా చెబుతున్నారని ప్రచారం అయితే సాగుతోంది. అలా విశాఖకు చెందిన ఒక మాజీ మంత్రి వైసీపీకి రాజీనామా చేసి మొదట టీడీపీలో చేరాలని చూశారని అంటున్నారు అక్కడ ఆయనకు చెక్ చెప్పారని, జనసేన నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రాలేదని దాంతో బీజేపీలోకి అయినా వెళ్ళాలని చూస్తే అక్కడా చుక్కెదురు అయిందని అంటున్నారు. అలాగే మరో మాజీ మంత్రి ఇంకా అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు అయితే టీడీపీ లేకపోతే బీజేపీ అని భావించినా వారి చేరికకు అడ్డు తగులుతున్న రాజకీయ శక్తులు ఉన్నాయట.
ఇక కోస్తా జిల్లాలత్గో పాటు రాయలసీమలో కూడా వైసీపీ నుంచి జనసేనలో చేరేందుకు కొంతమంది నేతలు సిద్ధపడుతున్నారుట. కానీ వారికి గ్రీన్ సిగ్నల్ లభించడం లేదని అంటున్నారు. దీంతో బీజేపీ కేంద్ర నాయకత్వం ఏపీ మీద ఫుల్ ఫోకస్ పెట్టింది అని అంటున్నారు. ఎవరేమి అనుకున్న చేరేందుకు వచ్చిన నాయకులు కమలం కండువా కప్పేసి చేర్చుకోవాలని కేంద్ర పెద్దలు ఆదేశిస్తున్నట్లుగా చెబుతున్నారు.
రాజకీయంగా బలపడేందుకు ఉన్న అవకాశాలను వదులుకోవద్దని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది. దాంతో బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలు తొందరలోనే ఉంటాయని అంటున్నారు. అనూహ్యమైన పేర్లు కూడా బీజేపీలో చేరే వారి జాబితాలో ఉంటాయని అంటున్నారు. మరి ఈ చేరికల వల్ల కూటమిలో ఏమైనా ఇబ్బందులు వస్తాయా అదే విధంగా ఆయా నియోజకవర్గాల్లో వర్గ పోరు పెరుగుతుందా అంటే చూడాల్సిందే అని అంటున్నారు.