Begin typing your search above and press return to search.

టీడీపీలో క్రెడిట్ గోళ మొద‌లైంది... !

ముఖ్యంగా జిల్లా ఇంచార్జ్‌లుగా ఉన్న‌వారు ఒక విధంగా లెక్కలు వేసుకుంటుంటే.. నామినేటెడ్ ప‌ద‌వుల కోసం ఎదురు చూస్తున్న వారు మ‌రో లెక్క‌లు వేసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   11 Sep 2024 9:30 PM GMT
టీడీపీలో క్రెడిట్ గోళ మొద‌లైంది... !
X

టీడీపీ నాయ‌కులు క్రెడిట్ లెక్క‌లు వేసుకుంటున్నారు. విజ‌య‌వాడ వ‌ర‌దల విష‌యంలో ఎవరు ఏం చేశార‌న్న విష‌యంపై చంద్ర‌బాబుకు నివేదిక‌లు ఇచ్చేందుకు త‌మ్ముళ్లు రెడీ అయ్యారు. మేం ఇది చేశాం.. అది చేశాం.. అని చెప్పుకొనేందుకు రెడీ అయ్యారు. ముఖ్యంగా జిల్లా ఇంచార్జ్‌లుగా ఉన్న‌వారు ఒక విధంగా లెక్కలు వేసుకుంటుంటే.. నామినేటెడ్ ప‌ద‌వుల కోసం ఎదురు చూస్తున్న వారు మ‌రో లెక్క‌లు వేసుకుంటున్నారు.

ఆర్థికంగా సాయం చేశామ‌ని.. కొంద‌రు నేత‌లు చెబుతున్నారు. మ‌రికొంద‌రు ఫిజిక‌ల్‌గా వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించామ‌ని.. ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉన్నామ‌ని అంటున్నారు. ఇంకొంద‌రు.. వ‌ర‌ద విప‌త్తు స‌మ‌యంలో ఆహారం, నీరు అందించేందుకు స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌ను ఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చామ‌ని చెబుతున్నారు. మొత్తంగా ఎవ‌రికివారు క్రెడిట్ లెక్క‌లు వేసుకోవ‌డం పార్టీలో చ‌ర్చ‌కు దారి తీస్తోంది. నిజానికి క్షేత్ర‌ స్థాయిలో ప‌ర్య‌టించిన వారు ఎక్కువ‌గానే ఉన్నారు.

పొరుగు జిల్లాల నుంచి వ‌చ్చి.. విజ‌య‌వాడలో తిష్ట‌ వేసిన వారు కూడా ఉన్నారు. చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌.. తొలి రోజు నుంచి చివ‌రి వ‌ర‌కు కూడా విజ‌య‌వాడ‌లో త‌న‌కు అప్ప‌గించిన డివిజ‌న్ల‌లో ప్ర‌జ‌ల‌కు సేవ చేశారు. అదేవిధంగా చంద్ర‌గిరి ఎమ్మెల్యే పులివ‌ర్తి నాని కూడా.. కృష్ణ లంక‌లో అప్ప‌గించిన ప‌నులను బాగానే చేశారు. ఇత‌ర నాయ‌కులు కూడా ప‌నుల్లో భాగం పంచుకున్నారు. అంద‌రూ క‌ష్ట‌ప‌డ్డార‌నే చెప్పాలి. అయితే.. ఎవ‌రికి వారు తామే ఎక్కువ‌గా చేశామ‌న్న భావ‌న‌తో ఉండ‌డం ఇప్పుడు ఆస‌క్తిగా మారింది.

ఇదిలావుంటే.. విజ‌య‌వాడ‌కు చెందిన కొంద‌రు నాయ‌కులు మాత్రం కొంత మేర‌కు విరాళం ఇచ్చి త‌ప్పుకొన్నారు. త‌మ ప్రాంతాలు కూడా వ‌ర‌దలో ఉన్నాయ‌ని.. విరాళంతో స‌రిపుచ్చారు. కానీ.. ఇప్పుడు రేపో మాపో .. మీరేం చేశారో.. చెప్పండి! అంటూ చంద్ర‌బాబు ప్ర‌శ్నిస్తే.. ఆయ‌న‌కు నోటితో కంటే రాత పూర్వ‌కంగా స‌మాధానం చెప్పాల‌న్న ఆదేశాల నేప‌థ్యంలో త‌మ్ముళ్లు ఇప్పుడు క్రెడిట్ లెక్క‌లు వేసుకుంటున్నారు. ఎవ‌రికి వారు.. ఈ లెక్క‌ల హ‌డావుడిలో మునిగిపోయారు. మ‌రి చంద్ర‌బాబు ఏమంటారో చూడాలి.