Begin typing your search above and press return to search.

చిన్న‌బాబు వ్య‌వ‌హారం ఇప్ప‌టిది కాదు.. ఈ విష‌యాలు తెలుసా..!

టీడీపీ నాయ‌కులు చిన్న‌బాబుగా పిలుచుకునే నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇవ్వాలంటూ.. కొన్నిరోజులుగా యాగీ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 Jan 2025 6:02 AM GMT
చిన్న‌బాబు వ్య‌వ‌హారం ఇప్ప‌టిది కాదు.. ఈ విష‌యాలు తెలుసా..!
X

టీడీపీ నాయ‌కులు చిన్న‌బాబుగా పిలుచుకునే నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇవ్వాలంటూ.. కొన్నిరోజులుగా యాగీ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఎక్క‌డో క‌డ‌ప‌లో ఉన్న టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు ఆర్‌. శ్రీనివాస‌రెడ్డి ర‌గిల్చిన వ్య‌వ‌హారం.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పాకింది. సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి వారు మ‌రింతగా దీనిని పెంచి పోషించేందుకు రెడీ అయ్యారు. ఈ వ్య‌వ‌హారం రానున్న రోజుల్లో పెరుగుతుంద‌ని అంద‌రూ అంచ‌నాకు కూడా వ‌చ్చేశారు.

ఇలాంటి కీల‌క స‌మ‌యంలో అనూహ్యంగా చంద్ర‌బాబు స్పందించి.. బ్రేకులు వేసే ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం. క‌ట్ చేస్తే.. అస‌లు ఈ డిప్యూటీ సీఎం వ్య‌వ‌హారమే కాదు.. పార్టీలోనూ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌(ఈ పోస్టు ప్ర‌స్తుతం లేదు) వంటి ప‌ద‌విని సృష్టించి.. దానిని నారా లోకేష్‌కు ఇవ్వాల‌న్న డిమాండ్ ఈ నాటిది కాదు. 2014-19 మ‌ధ్య పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యం నుంచి కూడా ఈ డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. అప్ప‌ట్లో చిన్న‌రాజ‌ప్ప‌, కేఈ కృష్ణ‌మూర్తి డిప్యూటీ సీఎంలుగా ఉన్న విష‌యం తెలిసిందే.

అయితే.. వీరిలో కేఈ వ‌యోవృద్ధుడు అయ్యార‌ని.. ఆయ‌న‌ను త‌ప్పించి నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌విని ఇవ్వాల‌ని.. తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు బహిరంగ వ్యాఖ్య‌లు చేశారు. అప్ప‌ట్లోనూ కొన్ని రోజులు ఇలానే నాయ‌కులు స్పందించారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. తెలంగాణ అప్ప‌టి మంత్రి కేటీఆర్‌తో పోల్చుతూ.. ఆయ‌న‌కు మాదిరిగా.. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇచ్చి.. చంద్ర‌బాబు త‌ర్వాత పార్టీ ప‌గ్గాలు ఆయ‌న‌కే అప్ప‌గించాల‌న్న వివాదం కూడా తెర‌మీదికి వ‌చ్చింది.

ఏతా వాతా ఎలా చూసుకున్నా.. పార్టీ అధికారంలోకి వ‌చ్చినప్పుడ‌ల్లా.. నాయ‌కులు ఇదే డిమాండ్‌ను విని పిస్తూ వ‌చ్చారు. అయితే.. అప్ప‌టికి.. ఇప్ప‌టికి తేడా ప‌వ‌న్ క‌ల్యాణ్‌. అప్ప‌ట్లో ప‌వ‌న్ మాదిరిగా.. మ‌రో నాయ‌కుడు చంద్ర‌బాబు త‌ర్వాత ఆ స్థాయిని అందుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. కానీ, ఇప్పుడు ప‌వ‌న్ ఉన్నాడ‌న్న సంకేతాల‌ను జ‌న‌సేన వ‌ర్గాలు ప్ర‌జ‌ల్లోకి పంపుతున్నాయి.

ఇటీవ‌ల కూడా.. ఓ సీనియ‌ర్ నాయ‌కుడు.. గుంటూరుకు చెందిన నేత‌.. బాబు త‌ర్వాత ప‌వ‌నే ఈ రాష్ట్రాన్ని కాపాడుతాడంటూ కామెంట్ చేయ‌డంతో మ‌రోసారి ఈ వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. మొత్తంగా చూస్తే.. చిన్న‌బాబు వ్య‌వ‌హారం.. అయితే.. ఇప్ప‌టిది కాదు. దీనికి చంద్ర‌బాబు సాధ్య‌మైనంత వేగంగా ప‌రిష్కారం చూపించాల్సి ఉంటుంది.