ఈ వీరాభిమానిని కలవాలి చంద్రబాబు!
తాజాగా తాను చేస్తున్న దీక్షను ముగించారు. ఇంతకూ ఆయన ఈ శపధం ఎందుకు చేయాల్సి వచ్చింది? అన్న ప్రశ్నలోకి వెళితే.. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కౌంటింగ్ ఏజెంటుగా టీడీపీ నేత సుధాకర్ వెళ్లాడు.
By: Tupaki Desk | 29 March 2025 4:37 AMఅభిమానానికి ఎల్లలు ఉండవు. తాము అభిమానించే వారు ఫలానా స్థాయికి వెళ్లాలని కోరుకోవటం మామూలే. కానీ.. ప్రతినబూని మరీ.. తనకు కష్టం ఎదురైనా వెనక్కి తగ్గని వీరాభిమానులు కొందరు ఉంటారు. ఇప్పుడుచెప్పే ఉదంతం ఆ కోవకు చెందిందే. టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని శపధం చేయటమే కాదు.. చంద్రబాబు సీఎం అయ్యే వరకు చెప్పులు వేసుకోనని చెప్పటమే కాదు.. చేసి చూపిన ఈ వీరాభిమాని గురించి చదవాల్సిందే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించినప్పటికి.. తమ ఊరికి డెవలప్ మెంట్ జరగాలని.. అది జిరగిన తర్వాతే తన పంతం వీడతానని చెప్పటమే కాదు చేతల్లో చేసి చూపించాడు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం కాట్రాయపాడు మాజీ సర్పంచి సుధాకర్.
తాజాగా తాను చేస్తున్న దీక్షను ముగించారు. ఇంతకూ ఆయన ఈ శపధం ఎందుకు చేయాల్సి వచ్చింది? అన్న ప్రశ్నలోకి వెళితే.. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కౌంటింగ్ ఏజెంటుగా టీడీపీ నేత సుధాకర్ వెళ్లాడు. అప్పుడు పార్టీ ఓడిపోయింది. ఈ సందర్భంగా ప్రత్యర్థి వర్గాలు మరో 30 ఏళ్ల పాటు టీడీపీ అధికారంలోకి రాదంటూ చేసిన ప్రకటనలకు మనస్తాపానికి గురయ్యారు.
ఈ సందర్భంగా మళ్లీ ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే వరకు తాను చెప్పులు వేసుకోనంటూ శపధం చేశారు. ఐదేళ్లుగా చెప్పులు వేసుకోకుండా తాను చేపట్టిన దీక్షను కంటిన్యూ చేశారు. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. కావలి ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి క్రిష్ణారెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు.
తెలుగు తమ్ముడు సుధాకర్ కోరుకున్నట్లే చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో తన దీక్షకు స్వస్తి పలికేందుకు తన సొంతూరు నుంచి తిరుమలకు చెప్పుల్లేకుండా పాదయాత్ర చేశారు. ఈ సమయంలో కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి కాట్రాయపాడుకు వెళ్లి ఆయనకు సాదర వీడ్కోలు పలికారు. యాత్ర ముగిసిన తర్వాత తిరుపతిలో పాదరక్షలు బహుకరిస్తానని చెప్పారు. అయితే.. తన సొంతూరు కాట్రాయపాడులో డెవలప్ మెంట్ కార్యక్రమాలు చేపట్టి.. వాటిని పూర్తి చేసిన తర్వాత ప్రజల సమక్షంలో తాను పాదరక్షకల్ని స్వీకరిస్తానని సుధాకర్ చెప్పారు.
మొత్తంగా సుధాకర్ కోరుకున్నట్లే కాట్రాయపాడులో రూ.24 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్డును తాజాగా ప్రారంభించారు. ప్రజల సమక్షంలో సుధాకర్ కు చెప్పులు బహుకరించారు. పార్టీ పట్ల.. పార్టీ అధినేత చంద్రబాబు పట్ల సుధాకర్ కు ఉన్న అభిమానానికి బహుమతిగా మరో రూ.27 లక్షల ఖర్చుతో ఇంకో సిమెంట్ రోడ్డును మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు కావలి ఎమ్మెల్యే. ఇలాంటి వీరాభిమానిని సీఎం చంద్రబాబు స్వయంగా కలవాల్సిన అవసరం ఉంది కదా. ఇలాంటివే.. పార్టీకి.. పార్టీ క్యాడర్ కు కొండంత ధీమాను కలుగజేస్తాయన్నది మర్చిపోకూడదు. మరి.. చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.