ప్రతి ఇంటిపైనా టీడీపీ జెండా.. నినాదం కాదు.. నిజం!
అక్కడ నిన్న మొన్నటి వరకు మిశ్రమ రాజకీయ మద్దతు ఇచ్చిన ప్రజలు ఇప్పుడు టీడీపీలోకి చేరిపోయారు.
By: Tupaki Desk | 1 Jan 2025 11:30 PM GMT''ప్రతి ఇంటిపైనా మన పార్టీ జెండా ఎగురాలి!''- సహజంగా పార్టీల నాయకులు ఇలాంటి పిలుపులు ఇస్తూనే ఉంటారు. ముఖ్యం గా పార్టీల సభ్యత్వాలు నమోదు ప్రారంభించిన సమయంలో ఇలాంటి పిలుపులు.. నినాదాలు కామన్‌గా ఉంటాయి. అయితే.. ఎంతమంది ఇళ్లపై ఆయా పార్టీల జెండాలు ఎగురుతాయనేది చెప్పడం కష్టం. ప్రజల అభిప్రాయాలు, రాజకీయాలపై ఆసక్తి.. వంటివి ఇలాంటి విషయాల్లో ప్రధానంగా డామినేట్ చేస్తాయి. అయితే.. తాజాగా ఓ గ్రామం మొత్తం టీడీపీ వైపు చూసింది. అక్కడ నిన్న మొన్నటి వరకు మిశ్రమ రాజకీయ మద్దతు ఇచ్చిన ప్రజలు ఇప్పుడు టీడీపీలోకి చేరిపోయారు.
ఏదా గ్రామం?
విశాఖపట్నం జిల్లాలోని కీలకమైన భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో 'ముచ్చర్ల' అనే గ్రామం ఉంది. ఇక్కడ 480 గడప ఉంది. మొత్తంగా 1400 మంది ఓటర్లు ఉన్నారు. నిన్న మొన్నటి వరకు ఇక్కడి వారు వైసీపీవైపు.. కమ్యూనిస్టుల వైపు కూడా ఉన్నారు. మరికొందరు మాత్రం టీడీపీతో ఉన్నారు. అయితే.. తాజాగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పింఛన్లు.. గ్యాస్ వంటివి ఇక్కడి ప్రజలను టీడీపీ వైపు చూసేలా చేశాయి. తాజాగా జరుగుతున్న టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఇక్కడి మొత్తం 1400 మంది కూడా టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. దీంతో పూర్తిగా గ్రామం అంతా కూడా.. పసుపు మయం అయిపోయింది.
ప్రతి ఇంటిపైనా టీడీపీ జెండాను ఎగురవేశారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక.. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి మెచ్చి.. ఇక్కడి ప్రజలు టీడీపీలో చేరారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరికీ బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నామని వివరించారు. పార్టీ తరఫున ఇక్కడ మరింత అభివృద్ది కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చెప్పారు. అదేవిధంగా ప్రబుత్వం పక్షాన కూడా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయనున్నట్టు వివరించారు. ఇదిలావుంటే, ముచ్చెర్ల గ్రామం మొత్తం టీడీపీ సభ్యత్వం తీసుకోవడం పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరాభిమానాలకు ఇదే నిదర్శనమని తెలిపారు.