Begin typing your search above and press return to search.

అద్భుత మెజారిటీని ఎంజాయ్ చేయలేకపోతున్నారే ?

ఇపుడు చూడబోతే ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తీరు కూడా అలాగే ఉంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   2 Oct 2024 5:37 AM GMT
అద్భుత మెజారిటీని ఎంజాయ్ చేయలేకపోతున్నారే ?
X

చక్కని పాలు తెచ్చి ముందర పెడితే తాగలేక ముంత ఒలకబోసుకుంది పిల్లి అని ఒక సామెత ఉంది. ఇపుడు చూడబోతే ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తీరు కూడా అలాగే ఉంది అని అంటున్నారు. ఎందుకు అంటే టీడీపీ స్థాపించాక ఈ స్థాయిలో ఓట్లూ సీట్లూ ఎపుడూ రాలేదు.

ఎంతో సినీ గ్లామర్ కలిగి ఉన్న ఎన్టీఆర్ హయాంలో కూడ మూడొంతుల సీట్లూ అలాగే 45 శాతం పైగా ఓట్ల షేర్ ని సాధిస్తూ వచ్చిన టీడీపీ 2024 ఎన్నికల్లో మాత్రం 95 శాతం పైగా సీట్లను సాధించింది. అంతే కాదు కూటమి కట్టి 55 శాతం పైగా ఓట్లను రాబట్టుకుంది.

టీడీపీ సొంతంగా 144 సీట్లకు పోటీ చేస్తే 135 గెలుచుకుంది. ఇది ఎపుడూ టీడీపీ సాధించని అద్భుత విజయం. అంతే కాదు జనసేన 21 సీట్లు మొత్తానికి మొత్తం గెలిచింది. పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబుకు నమ్మకమైన మిత్రుడిగా ఉన్నారు.

బీజేపీకి కేంద్రంలో బాబు మద్దతు అత్యంత కీలకంగా మారింది. దాంతో బీజేపీ నుంచి కూడా ఏ రకమైన పేచీ పూచీలు లేవు. ఒక విధంగా బాబు తన మూడు టెర్ముల పాలనలో ఎన్నడూ లేనంత ఫ్రీగా ఫుల్ పవర్స్ తో నాలుగవ టెర్మ్ పాలన సాగించాల్సి ఉంది.

ఆయనకు వచ్చిన మెజారిటీని చూసి అంతా అలాగే అనుకున్నారు. అయితే బాబు నాలుగు నెలల పాలన చూసిన తరువాత ఎందుకు ఇలా జరుగుతోంది అన్న చర్చ సాగుతోంది. ప్రజలు కట్టబెట్టిన బ్రహ్మాండమైన మెజారిటీని అందుకుని హాయిగా పాలన చేసుకోక ఎందుకు వివాదాలతో దోస్తీ కట్టడం అన్న చర్చ కూడా సాగుతోంది.

ఏపీలో అసలు విపక్షం అన్నది లేదు. జగన్ కి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఆయన ఊసుని జనాలు ఎంత వరకూ తలుస్తున్నారో తెలియదు. ఇక జగన్ సైతం బెంగళూరులోనే ఎక్కువగా గడుపుతున్నారు. అలాంటిది కోరి మరీ జగన్ ని పిలిచి మరీ బస్తీ మే సవాల్ అని టీడీపీ కూటమి కాలు దువ్వుతోంది. ఏదో ఒకటి రెండు సందర్భాలలో జగన్ పాలనలో తప్పులు జరిగాయి అంటే సబబుగా ఉంటుంది. కానీ ఎత్తుకున్న ప్రతీ విషయంలోనూ జగన్ దే పాపం అన్నట్లుగా మాట్లాడడంతో జనాలకు అది ఏ మాత్రం జీర్ణం కావడం లేదు.

పైగా జగన్ చేసిన తప్పులకు ఘోరంగా ప్రజా కోర్టులో శిక్షించిన తరువాత మళ్లీ ఆయన గురించి ఎందుకు అన్న మాట కూడా జనంలో ఉంది. ఇక జగన్ నామస్మరణ ఎంత దాకా వచ్చిందంటే ఆయనే అన్నీ చేశారు అని చెబుతూ ఆఖరుకు తిరుపతి లడ్డూల ఇష్యూ కూడా తెచ్చేశారు.

ఇలా అన్ని రకాల విమర్శలుగానే దీనిని వదిలారు. కానీ ఇక్కడే రివర్స్ అయింది సీన్. వ్యవహారం బూమరాంగ్ అయింది. మొత్తం మీద చూస్తే అధికారంలోకి వచ్చి పట్టుమని ఆరు నెలలు కూడా కాలేదు. హానీమూన్ పీరియడ్ ముగియలేదు. ఇంతలోనే ఇంతటి వివాదాలు ఎందుకు అసలు కూటమిలో ఏమి జరుగుతోంది అన్న చర్చ కూడా సాగుతోంది.

కోరి చేసుకున్న దానికి ప్రారబ్దం గానే చూస్తారు అంతా. ఇపుడు కూటమి వ్యవహారం చూస్తే లాక్కోలేక పీక్కోలేక అన్నట్లుగా ఉంది. గెలిచిన నాడు ఉన్న సంబరం అంతలోనే ఆవిరి అవుతోందా అన్న చర్చ ఉంది. కేంద్రంతో మాట్లాడి ఏపీకి కోరిన నిధులు తెచ్చుకుని సంక్షేమ పధకాలను అభ్వృద్ధి కార్యక్రమాలను చేస్తూ పోతే ఏపీలో కూటమికి తిరుగు లేని పరిస్థితి ఉంటుంది కదా అని అంటున్నారు.

అలాంటి రాజమార్గం మరచి ఈ షార్ట్ కట్ మెదడ్స్ ఏంటి, ఇందులో వివాదాలు ఎందుకు దానికి బాబు ఇమేజ్ ని సైతం ఫణంగా పెట్టుకోవడం ఏంటి అన్న చర్చ కూడా పార్టీ లోపలా బయటా వస్తోంది. వైసీపీలో ఎంతో మంది వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసే మంత్రులు ఉన్నారు. టీడీపీ కూటమిలో ఆ పరిస్థితి లేదు. కానీ బాబు పవన్ సంయమనం పాటిస్తే అన్నీ సర్దుకుంటాయని కూడా అంటున్నారు.