Begin typing your search above and press return to search.

పట్టభద్రుల ఎమ్మెల్సీ..టీడీపీ రిపీట్ చేస్తుందా ?

ఏపీలో 2023లో మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎన్నికలే టీడీపీ దశ దిశా మార్చాయి.

By:  Tupaki Desk   |   26 Oct 2024 7:30 AM GMT
పట్టభద్రుల ఎమ్మెల్సీ..టీడీపీ రిపీట్ చేస్తుందా ?
X

ఏపీలో 2023లో మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎన్నికలే టీడీపీ దశ దిశా మార్చాయి. ఏకంగా ఉత్తరాంధ్రా, గ్రేటర్ రాయలసీమ పరిధిలో మొత్తం నాలుగు చోట్ల ఎన్నికలు జరిగితే టోటల్ గా గెలుచుకుని విజయభేరీ మోగించింది. ఆ దెబ్బతో వైసీపీకి రెడ్ సిగ్నల్ పడింది. ఇక వైసీపీ ఇంటికే అన్న భావనను క్యాడర్ లో బలంగా జొప్పించిన ఎన్నికలుగా వీటిని టీడీపీ చాటి చెప్పుకుంది.

ఇక ఆ మీదట టీడీపీ రాజకీయంగా దూకుడే చేసింది. దాంతో టీడీపీ ఘన విజయం అలా దక్కించుకుంది. వైసీపీకి తొలి ఓటమి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే లభించిది. అది వరసబెట్టి కొనసాగుతూ చివరికి వైసీపీ ఓటమిని నుదిటిన రాస్తూ కఠినమైన తీర్పునే ఇచ్చేశాయి.

ఇపుడు చూస్తే మరోమారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. ఏపీలో రెండు చోట్ల ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి అలాగే, కృష్ణా జిల్లా-గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ మేరకు టీడీపీ కూటమి తరఫున అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. జనసేన బీజేపీ మద్దతు కూడా ఈసారి దొరుకుతుంది. ఈ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కీలకమైన ఈ ఎన్నికలను గెలుచుకుని తీరాలంటూ నాలుగు జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ లో దిశా నిర్దేశం చేశారు.

పార్టీ నాయకులు అంతా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని టీడీపీ నేతలకు ఆన గట్టిగానే కోరారు. అంతే కాదు నవంబరు 6వ తేదీ లోపు పట్టభద్రుల ఓటర్ల నమోదుని పూర్తి చేయాలని కూడా కోరారు అదే విధంగా ప్రతి పట్టభద్రుడు ఓటు నమోదు చేసుకోవాలని, ఆ విధంగా వారికి అవగాహన కల్పించాలని కోరారు.

2029 ఎన్నికల్లోనూ ఎన్డీయే గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచే కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. మండలాల వారీగా ఎన్డీయే సమన్వయ కమిటీలు పెట్టాలని అన్నారు. ప్రతి చోట మూడు పార్టీల నేతలతో సమన్వయ భేటీలు నిర్వహించాలని తెలిపారు.

మొత్తం మీద చూస్తే చంద్రబాబు పట్టభద్రుల ఎన్నికలను చాలా సీరియస్ గానే తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకూ వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీ గురించి ఏమీ ప్రకటించలేదు. అసలు పోటీ చేస్తుందా అన్న చర్చ కూడా ఉంది. ఈవీఎంల ద్వారానే టీడీపీ కూటమి గెలిచింది అంటూ వైసీపీ విమర్శిస్తున్న నేపథ్యంలో పూర్తిగా బ్యాలెట్ ద్వారా నిర్వహించే ఈ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కదా అని కూడా చర్చ వస్తోంది.

ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి పట్ల చైతన్యవంతమైన పట్టభద్రులలో వ్యతిరేకత ఉంటే దానిని సొమ్ము చేసుకుని వైసీపీకి కొత్త బలాన్ని ఇవ్వవచ్చు కదా అని కూడా చర్చ సాగుతోంది. మరి వైసీపీ ఈ ఎన్నికల గురించి అయితే ఎక్కడా మాట్లాడడం లేదు. టీడీపీ మాత్రం జోరు చేస్తోంది. గత విజయాన్ని రిపీట్ చేయాలని పట్టుదలగా ఉంది. వైసీపీ రేసులో లేకపోతే టీడీపీని అసలు అడ్డుకునే వారే ఉండరు అన్న చర్చ కూడా వస్తొంది.