టీడీపీ పెద్ద ప్లానే.. అందుకే వలసలకు గ్రీన్ సిగ్నల్!
మరోవైపు గ్యాప్ ఉన్నచోటే వలస నేతలను చేర్చుకోవాలని మిత్రపక్షం జనసేనకు కండీషన్ పెడుతున్నట్లు చెబుతున్నారు.
By: Tupaki Desk | 19 Dec 2024 12:30 PM GMTఅసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత విపక్షం నుంచి పెద్ద ఎత్తున వలస వచ్చేందుకు నేతలు ఉబలాటపడుతున్నా టీడీపీ అధిష్ఠానం మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బలమైన నేతలు ఉండటంతో పక్క పార్టీ నుంచి ఎరువు తెచ్చుకోవడం అవసరమా? అనే ధోరణిని ఇన్నాళ్లు ప్రదర్శించింది. అయితే కొందరి విషయంలో మాత్రం టీడీపీ హైకమాండ్ ఆలోచనలు భిన్నంగా ఉండటంతో వారి చేరికకు రైట్ రైట్ చెబుతోంది. మరోవైపు గ్యాప్ ఉన్నచోటే వలస నేతలను చేర్చుకోవాలని మిత్రపక్షం జనసేనకు కండీషన్ పెడుతున్నట్లు చెబుతున్నారు.
ఎన్నికల్లో ఘోర ఓటమితో చాలా మంది వైసీపీ నేతలు కూటమి పార్టీల వైపు చూస్తున్నారు. కానీ, కొద్ది మందికి మాత్రమే టీడీపీ, జనసేనల్లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ లభిస్తోంది. ఇప్పటివరకు వైసీపీకి రాజీనామా చేసిన నేతల్లో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరగా, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారు రోశయ్య, సామినేని ఉదయభాను జనసేనలో చేరారు. అదేవిధంగా వైసీపీకి రాం రాం చెప్పేసిన ఆళ్ల నాని నేడో రేపో టీడీపీలో చేరనున్నారు.
ఇదే తోవలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాసరావు ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేక వెయిటింగులో ఉన్నారు. అయితే టీడీపీలో చేరేందుకు నేతలు ఎక్కువగా ఆసక్తిచూపుతున్నా, నియోజకవర్గ స్థాయిలో ఖాళీ లేకపోవడంతో అందరికీ ఓకే చెప్పడం లేదు టీడీపీ. కానీ, కొందరి విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకుంటోంది. వీరి చేరికకు స్థానిక నేతలు అభ్యంతరం చెప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు పొందిన మోపిదేవి, గోదావరి జిల్లాల్లో ప్రధాన సామాజికవర్గానికి చెందిన ఆళ్ల నాని విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని పార్టీలో చేర్చుకునేలా అడుగులు వేసింది టీడీపీ. మోపిదేవి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీలో చేరారు. ఆయనతోపాటు రాజీనామా చేసిన మిగిలిన ఇద్దరు ఎంపీల సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించిన కూటమి, మోపిదేవికి ప్రత్యేక ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడికి అసెంబ్లీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మోపిదేవి సొంత నియోజకవర్గం రేపల్లెలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన మంత్రి అనగాని తన ప్రత్యర్థిని చేర్చుకోవడంలో ఎలాంటి వ్యతిరేకత చూపకపోవడానికి ప్రధాన కారణం టీడీపీ రూపొందించిన ఫార్ములానే అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాలు పెరుగుతాయని, పెరిగిన చోట మోపిదేవికి అవకాశం ఇస్తామని మంత్రి అనగానికి నచ్చజెప్పడంతో ఆయన తన రాజకీయ ప్రత్యర్థి విషయంలో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని చెబుతున్నారు. ఇదే ఫార్ములాతోనే ఏలూరులోనూ వర్క్ అవుట్ చేశారంటున్నారు. ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల టీడీపీలో చేరతామంటే అక్కడి కేడర్ తీవ్రంగా వ్యతిరేకించింది.
అయితే భవిష్యత్తులో ఏలూరు రూరల్ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉండటంతో ఆళ్ల చేరిక అనివార్యమని కేడర్ కు నచ్చజెప్పింది అధిష్టానం. దీంతో ఆళ్ల చేరికకు లైన్ క్లియర్ అయింది. ఈ విధంగా భవిష్యత్తు అవసరాలను ద్రుష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటోంది టీడీపీ. ఇదే ఫార్ములా జనసేనకు సూచించడంతో ఒంగోలు వంటి జనాభా ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ నేతలను చేర్చుకోడానికి ఆ పార్టీ వేగంగా అడుగులు వేస్తోందంటున్నారు.