జనసేన ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఇంచార్జి!
ఇపుడు అదే జరుగుతోంది. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట మేమూ రెడీ అంటేనే తేడాలు వచ్చేస్తున్నాయి.
By: Tupaki Desk | 16 Nov 2024 4:16 AM GMTకూటమిలో కుంపట్లు రగులుతున్నాయా అంటే భేషుగ్గా అని అంటున్నారు. ఎందుకంటే ఎవరి ఆశలు వారివి, ఎవరి కోరికలు వారివి. ఎవరి ఆలోచనలు ఎవరి రాజకీయ వ్యూహాలు కూడా వారివే. ప్రస్తుతం ఎన్నికలు అయిపోతే వచ్చే ఎన్నికల మీద ఆశలతో కర్చీఫ్ వేసుకోవడం అలవాటు. ఇపుడు అదే జరుగుతోంది. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట మేమూ రెడీ అంటేనే తేడాలు వచ్చేస్తున్నాయి.
విశాఖ జిల్లాలో పెందుర్తి అసెంబ్లీ సీటు రాజకీయంగా చాలా కీలకమైనది. దీనిని ఎంతో ప్రాధాన్యత కూడా ఉంది. 1979లో ఏర్పాటు అయిన పెందుర్తి నియోజకవర్గంలో మొదటి నుంచి రాజకీయంగా జమాజెట్టీలు లాంటి వారే గెలుస్తూ వస్తున్నారు. అప్పట్లో ద్రోణంరాజు సత్యనారాయణ, గుడివాడ గురునాధరావు, పెతకం శెట్టి అప్పల నరసింహం వంటి వారి మధ్య పెందుర్తి రాజకీయం ఒక రేంజిలో సాగింది.
తరువాత రోజులలో కూడా పెందుర్తి అంటే హాట్ సీటు గానే ఉంది. అటువంటి పెందుర్తిలో కొత్తగా రాజకీయ అరంగ్రేట్రం చేసి ప్రజారాజ్యం తరఫున 2009లో గెలిచిన వారు పంచకర్ల రమేష్ బాబు. ఆయన 2014 నాటికి టీడీపీలో చేరి పెందుర్తి టికెట్ ఆశించినా అక్కడ మాజీ మంత్రి సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి ఉండడంతో ఎలమంచిలి పంపించారు. టీడీపీ ఊపులో అక్కడ నుంచి ఆయన గెలిచారు.
అయితే 2019లో మాత్రం వైసీపీ వేవ్ లో ఓటమి చెందారు. ఆ తరువాత వైసీపీలో చేరిన రమేష్ బాబు ఎన్నికలకు చాలా ముందే జనసేనలో చేరారు. అలా ఆయనకు పెందుర్తి టికెట్ దక్కింది. పొత్తులో భాగంగా ఆయన గెలిచారు. బండారుని మాడుగుల షిఫ్ట్ చేశారు
ఆ విధంగా బండారు తన రాజకీయాలను కూడా మాడుగుల కేంద్రంగా ప్రస్తుతం నడిపిస్తున్నారు. అయితే పెందుర్తి టికెట్ ఆశించి భంగపడిన మరో నేత మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ. పార్టీ ఆయనను బుజ్జగించి విశాఖ టీడీపీ ప్రెసిడెంట్ గా నియమించింది. ఇక అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చింది.
ఇటీవల రెండవ విడత నామినేటెడ్ పోస్టుల భర్తీలో బాబ్జీకి ఏపీ కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ పదవి దక్కింది. దాంతో ఆయన కీలకమైన పొజిషన్ లోకి వచ్చారు. నిజానికి ఆయన టీడీపీ జిల్లా ప్రెసిడెంట్ గా ఉంటూనే పెందుర్తిలో తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు.
అక్కడ ఆయన హవాయే సాగుతోందని అంటున్నారు. పెందుర్తి ఎమ్మెల్యేగా ఉన్నా కూడా పంకర్ల మాట ఎక్కడా చెల్లడంలేదు అన్నది ఎమ్మెల్యే వర్గీయుల ఆవేదనగా ఉంది. ఇక అధికారిక సమావేశాలలో గతంలో బాబ్జీ పాల్గొనేవారని ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం ఏ హోదా లేదని జనసేన నుంచి విమర్శలు వినిపించాయి.
ఇపుడు ఆయనకు కీలకమైన చైర్మన్ పదవి రావడంతో ప్రోటోకాల్ కి ఏమీ తక్కువ లేదని అంటున్నారు. దాంతో మరింత దూకుడుగా గండి బాబ్జీ తన రాజకీయానికి పదును పెడుతున్నారు. ఈ పరిణామాలతో జనసేనలో చర్చ సాగుతోంది. ఎవరు ఎమ్మెల్యే అన్నది కూడా తెలియడం లేదని అంటున్నారు
తన మాట నెగ్గనపుడు ఏమి లాభం అని ఎమ్మెల్యే శిబిరంలో మధనం సాగుతోందని అంటున్నారు. ఆఖరికి పోలీసుల పోస్టింగుల విషయంలోనూ మాట చెల్లకపోయేసారికి పంచకర్ల వర్గం ఇబ్బందిగా ఫీల్ అవుతోందిట. ఈ విధంగా పెందుర్తి అనే ఒరలో రెండు కత్తులుగా అటు బాబ్జీ ఇటు పంచకర్ల వర్గాలు పోరు సాగిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎవరూ కూడా తగ్గేది లేదని సంకేతాలు ఇస్తున్నారు. ఇదంతా వచ్చే ఎన్నికల కోసం అని అంటున్నారు. మొత్తానికి ఎమ్మెల్యేగా అయి కూడా ఆనందం లేకుండా పోతోందని జనసేన వర్గం లో అసంతృప్తి అయితే కనిపిస్తోంది అని అంటున్నారు.