తంబళ్ల పల్లి తగువు.. మంత్రి ముందే తమ్ముళ్లు కొట్టేసుకున్నారుగా!
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తంబళ్లపల్లి. ఇక్కడ టీడీపీ పాగా వేసే ప్రయత్నాలు గత రెండు దఫాలుగా కూడా విఫలమయ్యాయి.
By: Tupaki Desk | 14 April 2025 4:23 AMఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తంబళ్లపల్లి. ఇక్కడ టీడీపీ పాగా వేసే ప్రయత్నాలు గత రెండు దఫాలుగా కూడా విఫలమయ్యాయి. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా కూటమి సునామీ కనిపించినా.. తంబళ్లపల్లిలో మాత్రం వైసీపీ హవానే కొనసాగింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు, వైసీపీ నాయకుడు ద్వరకానాథ్‌రెడ్డి వరుస విజయాలు అందు కున్నారు. ఇలాంటి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఎలా ఉండాలి? ఏవిదంగా ముందుకు సాగాలి? అంటే.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కలసి కట్టుగాముందుకు సాగాలి. వైసీపీని ధీటుగా ఎదిరించే శక్తిని పుంజుకోవాలి.
కానీ, తమ్ముళ్లు అలా లేరు. పార్టీలో పదవుల విషయంలో ఆధిపత్య పోరు సాగిస్తూ.. సొంత పార్టీలోనే కుంపట్లు పెట్టుకుని పొలిటికల్ చలిమంటలు కాగుతున్నారు. ఇప్పిటికి ఈ పది మాసాల్లో రెండు సార్లు తంబళ్లపల్లి రాజకీయ చర్చ, పంచాయతీలు అమరావతి కేంద్రంగా జరిగాయి. అయినప్పటికీ.. తమ్ముళ్ల మధ్య సఖ్యత కనిపించడం లేదు. దీంతో వర్గ పోరు కాస్తా.. రాజకీయ పోరుగా మారి నడిరోడ్డుపై పడ్డారు. పోనీ వీరేమన్నా.. చిన్నా చితకా నాయకులా? అంటే.. రాష్ట్ర స్థాయి నేతలు. అయినా.. పద్ధతి మాత్రం మార్చుకోలేక పోతున్నారు. ఫలితంగా టీడీపీకి ఇప్పుడు మరో తలనొప్పి వచ్చినట్టు అయింది.
ఏం జరిగింది?
టీడీపీ సీనియర్ నాయకుడు, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నమయ్య జిల్లా టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్నారు. ఇక, గత ఎన్నికల్లో తంబళ్ల పల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన జయచంద్రారెడ్డికి.. జనార్దన్ రెడ్డికి మధ్య పొసడం లేదు. ఇంచార్జ్‌గా ఉన్న మంత్రి జనార్దన్‌రెడ్డిని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తూ.. జయచంద్రారెడ్డి అనుచరులు ట్రోల్ చేస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున జనార్దన్‌రెడ్డి అనుచరులు ప్రతి దాడి చేస్తున్నారు. ఇక, దీనికి కూడా కారణం ఉంది.. 2014లో టీడీపీ తరఫున విజయం దక్కించుకున్న జీ. శంకర్ యాదవ్ కు 2024 ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో తనను కాదని జయచంద్రారెడ్డి టికెట్ తెచ్చుకున్నారన్న భావనతో ఉన్న శంకర్ యాదవ్.. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జయచంద్రారెడ్డి ఓటమికి కారణమయ్యారన్న చర్చ ఉంది. ప్రస్తుతం నియోజకవర్గం ఇంచార్జ్‌గా జయ చంద్రారెడ్డి ఉన్నారు. అయితే.. తనను ఓడించేందుకు ప్రయత్నించిన శంకర్ యాదవ్‌ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెనుకేసుకు వస్తున్నారన్న వాదన జయచంద్రారెడ్డి వర్గంలో ఉంది. ప్రస్తుతం ఇన్ఛార్జ్‌గా ఉన్న జయచంద్రరెడ్డికి అడుగడుగునా శంకర్ అడ్డు పడుతున్నా.. ఇంచార్జ్‌గా ఉన్న మంత్రి పట్టించుకోవడం లేదని వాదిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సాక్షిగా తమ్ముళ్లు ఘర్షణకు దిగారు. జయచంద్ర రెడ్డి వర్గీయులు మంత్రి, శంకర్ యాదవ్‌కు వ్యతిరేకంగా పోటాపోటీగా నినాదాలు చేశారు. ఇరువర్గాల నేతలు సవాళ్లు విసురుకొని దూషించుకున్నారు. ఈ క్రమంలో తోపులాటలు.. ముష్టి ఘాతాలు కూడా కురిపించుకున్నారు. ఈ హఠాత్పరిణామంతో సమావేశాన్ని అర్ధంతరంగా నిలిపివేసిన మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి.. విషయాన్ని చంద్రబాబుకు నివేదిస్తానని చెప్పారు. కాగా.. ఇప్పటికే శంకర్ యాదవ్ వర్సెస్ జయచంద్రారెడ్డిల మధ్య వివాదాలపై రెండు సార్లు చంద్రబాబు పంచాయతీ పెట్టారు. కానీ, ఏమీ తేల్చ లేకపోయారు. మరి ఇప్పటికైనా పరిష్కరిస్తారో లేదో చూడాలి.