Begin typing your search above and press return to search.

వైసీపీ మాజీ మంత్రి కొడుకు టీడీపీలోకి ?

పార్టీ ఓడాక తొలి నాళ్ళలో తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు వెళ్లి జగన్ నిర్వహించిన సమీక్షలో పాలుపంచుకున్నారు.

By:  Tupaki Desk   |   4 Sep 2024 3:47 AM GMT
వైసీపీ మాజీ మంత్రి కొడుకు టీడీపీలోకి ?
X

ఆ మాజీ మంత్రి సీనియర్ మోస్ట్ లీడర్. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితం ఆయన సొంతం. ఆయనే ఉత్తరాంధ్ర కు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఆయన కొంతకాలంగా రాజకీయ వైరాగ్యాన్ని పాటిస్తున్నారు. పార్టీ ఓడాక తొలి నాళ్ళలో తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు వెళ్లి జగన్ నిర్వహించిన సమీక్షలో పాలుపంచుకున్నారు. ఆ మీదట ఆయన మళ్లీ కనిపించలేదు.

ఆయన ఇపుడు రాజకీయంగా డోలాయమానంలో ఉన్నారు అని అంటున్నారు. ఆరున్నర పదుల వయసులో మరోసారి పార్టీ మారడమా అన్న ఆలోచన ఒక వైపు ఉంటే ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెబితే ఎలా ఉంటుంది అన్నది మరో ఆలోచన. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తులు చూసిన ధర్మాన ప్రసాదరావు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక జూనియర్ లీడర్ చేతిలో ఓటమి పాలు అయ్యారు. ఆ విధంగా రాజకీయ చరమాంకం భారీ ఓటమిని ఇచ్చిందని ప్రసాదరావు మదనపడుతున్నారు అని అంటున్నారు.

ఆయన అందుకే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పారని హుందాగా రాజకీయాల నుంచి తప్పుకుని తన గౌరవం కాపాడుకోవాలని అనుకున్నారని అంటున్నారు. కానీ జగన్ ఒత్తిడి మేరకు ఆయన 2024 ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఫలితం తేడా కొట్టేసింది.

ఇక ఆయనలో అసంతృప్తికి మరో కారణం ఏంటి అంటే తన కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని అడిగారు. దానికి జగన్ నో చెప్పి ధర్మాననే పోటీకి పెట్టారు. ఆ విధంగా తన కుమారుడి రాజకీయ జీవితం చక్కదిద్దు కోలేక పోయాను అన్న బాధ ఆయనకు ఉంది అని అంటున్నారు.

దాంతో ఆయన రెండు రకాలుగా ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. వైసీపీ రాజకీయాలతో పూర్తిగా దూరంగా ఉంటున్న ఆయన ఇక పాలిటిక్స్ కి గుడ్ బై కొట్టేసి కుమారుడిని టీడీపీలోకి పంపిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. శ్రీకాకుళం శాసన సభ సీటు టీడీపీకి కంచుకోట. టీడీపీ ఏర్పడ్డాక కాంగ్రెస్ పార్టీనే తక్కువ సార్లు గెలిచింది. ఒకసారి వైసీపీ గెలిచింది.

దాంతో పాటుగా చూస్తే తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి మొత్తం క్యాడర్ టీడీపీకి మళ్ళింది. ఓటమి తరువాత ఇపుడు మరింత బలహీనపడింది అన్ అంటున్నారు. దాంతో వైసీపీలో కంటే టీడీపీలో ఉంటే తన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందేమో అన్న ఆలోచనలలో పెద్దాయన ఉన్నారు అన్నది పుకారుగా వినిపిస్తున్న మాట.

ఇక టీడీపీలో కింజరాపు కుటుంబంతో తెర వెనక బంధాలు ధర్మాన కుటుంబానికి బాగానే ఉన్యాయని కూడా చెబుతూంటారు. దాంతో కుమారుడి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని సైకిలెక్కించి తాను మాత్రం రాజకీయ విరమణ చేస్తే ఉభయత్రా బాగానే ఉంటుందని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

మరి టీడీపీలో కొడుకుని ఒక్కడినే పంపించి ఊరుకుంటారా లేక తాను కూడా చేరుతారా అన్నది చూడాలని అంటున్నారు. ఏది ఏమైనా కొద్ది రోజులల్లో సిక్కోలులో కీలక రాజకీయ పరిణామాలు వైసీపీలో చోటు చేసుకుంటాయని అంటున్నారు.