Begin typing your search above and press return to search.

కమలం అంటే ఫ్లవర్ అనుకుంటున్నారా ?

బీజేపీ జాతీయ పార్టీ. కేంద్రంలో మూడు సార్లు వరసగా అధికారంలోకి వచ్చిన పార్టీ.

By:  Tupaki Desk   |   8 Dec 2024 4:26 PM GMT
కమలం అంటే ఫ్లవర్ అనుకుంటున్నారా ?
X

బీజేపీ జాతీయ పార్టీ. కేంద్రంలో మూడు సార్లు వరసగా అధికారంలోకి వచ్చిన పార్టీ. ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామిగా ఉన్న పార్టీ. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో బీజేపీ సముచితమైన స్థానంలో ఉంది.

అటువంటి పార్టీలో బీజేపీకి దక్కాల్సిన గౌరవం దక్కుతోందా అన్నది ఒక చర్చగా ఉంది. టీడీపీ కూటమిలో చంద్రబాబు పవన్ మాత్రమే కనిపిస్తున్నారని వారిద్దరే ప్రతీ అంశం మీద చర్చించుకుంటున్నారని అంటున్నారు. ఇక ఫ్లెక్సీల మీద పోస్టర్ల మీద కూడా చంద్రబాబు బొమ్మ ఒక వైపు ఉంటే పవన్ కళ్యాణ్ బొమ్మ మరో వైపున ఉంటోంది. అంతే తప్ప బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి ఫోటో అయితే కనిపించడం లేదు అని ఆ పార్టీ వారు అంటున్నారు.

ఇటీవల విశాఖ పర్యటనకు చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో వస్తే ఆయనకు ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలలో అన్ని చోట్లా బాబు పవన్ ఫోటోలే ఉన్నాయి తప్ప పురంధేశ్వరి ఫోటోలు ఎక్కడా లేవని అంటున్నారు. అలాగే కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటిదాకా జరిగిన నామినేటెడ్ పదవుల పందేరంలో కూడా బీజేపీకి తగిన న్యాయం జరగలేదని కమలం పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

ఇక పురంధేశ్వరి విషయంలో కేంద్ర బీజేపీ నాయకత్వం కూడా కొంత అసంతృప్తిగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఏపీలో సభ్యత్వం జోరు అయితే లేదని కేవలం రెండు లక్షలు మాత్రమే చేశారని దానికి కనీసంగా అయిదు లక్షలకు పెంచాలని జేపీ నడ్డా కోరారని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే బీజేపీ ప్రెసిడెంట్ గా పురందేశ్వరి పార్టీలో అందరినీ కలుపుకుని పోవడం లేదని కూడా అంతర్గతంగా అంటున్నారు. అదే విషయం మీద కొందరు పెద్దలకు కూడా చెప్పారని అంటున్నారు ఈ విధంగా బీజేపీకి కూటమిలో సముచితమైన ప్రాధాన్యత దక్కకపోవడానికి చిన్నమ్మ వైఖరి కూడా కారణం అని అంటున్నారు.

ఏది ఏమైనా కూటమి అంటే బాబు ప్లస్ పవన్ అన్నట్లుగానే ఉందని బీజేపీ ఊసు ఎక్కడా లేదని వాపోవడం మాత్రం కమలనాధులు చేస్తున్నారు. అయితే ఇదంతా కాదని కూటమిలో బీజేపీకి విలువ ఉందని ఏకంగా కేంద్రంలో బీజేపీ పెద్దలను ప్రతీ దానికీ సంప్రదిస్తూనే వారి సలహా సూచనలతో ప్రభుత్వం సాగుతోందని రేషియో ప్రకారమే పదవుల పంపిణీ జరుగుతోందని కూటమి వైపు నుంచి వినిపిస్తోంది.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే కూటమి అధికారంలోకి వచ్చినా తమకు దక్కింది ఏమీ లేదని బీజేపీ సీనియర్లు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు. అలాగే కూటమి అంటే మూడు పార్టీలు అని జనంలోకి గట్టిగా తీసుకుని వెళ్ళడంలోనూ రాష్ట్ర బీజేపీ నాయకత్వం సరిగ్గా వ్యవహరించ లేకపోతోంది అని అంటున్నారు.