Begin typing your search above and press return to search.

కూట‌మి నేత‌ల కొట్లాట‌.. క‌ర్నూలుకు పాకిన విభేదాలు..!

కూట‌మిలో కీల‌క పార్టీల మ‌ధ్య విభేదాలుకొన‌సాగుతూనే ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు క‌లిసిమెలిసి సాగుతున్నారు.

By:  Tupaki Desk   |   31 Jan 2025 10:03 AM GMT
కూట‌మి నేత‌ల కొట్లాట‌.. క‌ర్నూలుకు పాకిన విభేదాలు..!
X

కూట‌మిలో కీల‌క పార్టీల మ‌ధ్య విభేదాలుకొన‌సాగుతూనే ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు క‌లిసిమెలిసి సాగుతున్నారు. వీరి మ‌ధ్య విభేదాలు, భేదాభిప్రాయాలు లేవు. కానీ, క్షేత్ర‌స్థాయిలో మాత్రం నాయ‌కుల మ‌ధ్య తేడాలు రోడ్డెక్కుతున్నాయి. ఉభ‌య గోదావ‌రి జిల్లాల నుం చి విశాఖ వ‌ర‌కు కూడా.. ఈ భేదాభిప్రాయాల‌తో నాయ‌కులు కుమ్మేసుకుంటున్నారు. ఇక‌, విజ‌య‌వాడ‌లో అయితే.. నువ్వెవ‌రో.. నేనెవ‌రో అన్న‌ట్టుగా నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

తాజాగా క‌ర్నూలులోనూ టీడీపీ-జ‌న‌సేన నాయ‌కుల మ‌ధ్య వివాదాలు రోడ్డెక్కాయి. ఆదోని స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యం ముందే ఈ రెండు పార్టీల‌కు చెందిన నాయ‌కులు తోపులాట‌ల‌కు దిగారు. టీడీపీ నేత మీనాక్షినాయుడు, జ‌న‌సేన నాయ‌కుల‌కు మధ్య మాటా మాటా పెరిగి.. తీవ్ర‌స్థాయిలో దూషించుకున్నారు. త‌ర్వాత‌.. తోపులాట‌ల‌కు దిగారు. దీనికి కార‌ణం.. స్థానికంగా డీల‌ర్ షిప్‌ల వ్య‌వ‌హారంలో పంప‌కాలు కుద‌ర‌క పోవ‌డ‌మేన‌ని నాయ‌కులు చెబుతున్నారు.

వివాదం ఇదీ..

ఆదోని నియోజ‌క‌వ‌ర్గంలో పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ ఆధ్వ‌ర్యంలో రేష‌న్ షాపుల‌ను కేటాయించారు. దీనికి సంబంధించి గతంలో ఉన్న వైసీపీ అనుకూల డీల‌ర్ల‌ను తొల‌గించారు. ఈ క్ర‌మంలో నియోజ‌క‌వ‌ర్గంలో డీల‌ర్ షిప్‌ల‌ను పంచుకునేందుకు టీడీపీ-జ‌న‌సేన నాయ‌కులు పోటీ ప‌డ్డారు. ఈ వ్య‌వ‌హారంలో కీల‌క నిర్ణ‌యాలు అన్నీ స‌బ్ క‌లెక్ట‌ర్ ద్వారానే జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను కాకా ప‌ట్టేందుకు ఇరు ప‌క్షాలు పోటీ ప‌డ్డాయి. క‌లెక్ట‌ర్‌కార్యాల‌యానికి చేరుకున్నారు.

అయితే.. మీరు మీరు తేల్చుకున్నాక‌.. నా ద‌గ్గ‌ర‌కు రావాల‌ని స‌బ్ క‌లెక్ట‌ర్ ఆదేశించ‌డంతో నాయ‌కులు చ‌ర్చ‌ల‌కు దిగారు. టీడీపీ నాయ‌కులు 32 డీల‌ర్ షిప్‌లు కోర‌గా.. కాదు.. 35 మాకే ఇవ్వాల‌ని జ‌న‌సేన నాయ‌కులు ప‌ట్టుబ‌ట్టారు. ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా 70కిపైగా డీల‌ర్ షిప్పులు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని వైసీపీ నాయ‌కులు ఉంచుకున్నారు. కొంద‌రు కోర్టుకు వెళ్లి అనుకూలంగా మార్చుకున్నారు. దీంతో 64 డీల‌ర్ షిప్పుల‌ను పంచుకోవాల్సి ఉంది.

ఈ క్ర‌మంలో చెల‌రేగిన వివాదం ఏకంగా త‌న్నుకునే వ‌ర‌కు వ‌చ్చింది. దీంతో విష‌యాన్ని క‌లెక్ట‌ర్‌కు స‌మ‌ర్పిస్తానంటూ.. స‌బ్ క‌లెక్టర్ చేతులు ఎత్తేశారు. ఇదిలావుంటే.. క‌లివిగా పంచుకుంటే వేరేగా ఉండేద‌ని.. ఇలా ర‌గ‌డ‌కు దిగ‌డం స‌రికాద‌ని ఇరు పార్టీల సీనియర్లు చెబుతున్నారు. ఇక‌, ఈ విష‌యం చంద్ర‌బాబు వ‌ర‌కు చేరింది. దీనిపై మీనాక్షినాయుడిని ఆయ‌న వివ‌ర‌ణ కోరిన‌ట్టు తెలిసింది.