అశోక్ పోటీపైన తేల్చేసిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు
By: Tupaki Desk | 19 July 2023 8:17 PM GMTవిజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు వయసు దాదాపుగా ఏడున్నర పదులు. ఆయన 2024 ఎన్నిక ల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఒక విధంగా ఆయనకు ఇవే చివరి ఎన్నికలు. అయితే అశోక్ ఈసారి ఎక్కడ నుంచి పోటీ చేస్తారు, ఎమ్మెల్యేగానా, లేక ఎంపీగానా అన్నది జిల్లా టీడీపీలో చర్చనీయాంశంగా ఉంది.
అశోక్ అయితే 2014, 2019లలో రెండు సార్లూ ఎంపీగానే విజయనగరం నుంచి పోటీ చేశారు. 2014లో మంచి మెజారిటీతో గెలిచిన ఆయన నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా నాలుగేళ్ళ పాటు పనిచేశారు. ఇక 2019లో ఆయనను మరోసారి ఎంపీగా బాబు పోటీకి దింపారు కానీ రెండవసారి ఆయన ఓటమి పాలు అయ్యారు. అంతే కాదు విజయనగరం జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే సీట్లూ వైసీపీ క్లీన్ స్వీప్ చేసి పారేసింది.
ఇక 2024లో చూస్తే అశోక్ ఎంపీగానే మళ్లీ పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా సన్నిహితులతో చెబుతూ వచ్చారు. తాను ఎక్కడైతే ఓడానో అక్కడే గెలిచి తన సత్తా చాటుకోవాలని అశోక్ ఉవ్విళ్ళూరుతున్నారుట. ఇదిలా ఉంటే విజయనగరం జిల్లా పరిస్థితుల మీద చర్చించేందుకు చంద్రబాబు అశోక్ గజపతిరాజుని మంగళగిరి పార్టీ ఆఫీసుకు తాజాగా పిలిపించారు.
ఈ సందర్భంగా విజయనగరం పార్లమెంట్ కి ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది అన్నది చర్చకు వచ్చినట్లుగా తెలిసింది. తాను ఎంపీగానే పోటీ చేస్తాను అని అశోక్ తన మనసులో మాట బయటపెట్టారని అంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం అశోక్ ని విజయనగరం నుంచి అసెంబ్లీకే పోటీ చేయించాలని అనుకుంటున్నట్లుగా చెప్పినట్లు సమాచారం.
ఇక బాబు మదిలో వేరే పేరు ఎంపీ అభ్యర్ధిత్వం మీద ఉందని అంటున్నారు. ముఖ్యంగా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బీసీ నేతను విజయనగరం నుంచి ఎంపీగా పోటీ చేయిస్తే మొత్తం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆ ప్రభావం గట్టిగా పడుతుంది అన్నది బాబు మాటగా ఉంది. దాంతో బాబు మాటకు అశోక్ ఓకే చెప్పారా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.
అయితే అశోక్ తాను ఎంపీగా పోటీ చేసి తన కుమార్తెను విజయనగరం ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఇక ఇదే సీటు విషయంలో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత సైతం పోటీ పడుతున్నారు. అలాగే కొత్తగా మరో బలమైన సామాజికవర్గానికి చెందిన కనకమహాలక్ష్మి కూడా వచ్చారు. మరి చంద్రబాబు మాట మేరకు అశోక్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయన కుమార్తెకు ఇక పోటీకి చాన్స్ ఉండ్దని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.