జ్యోతుల వారి బాధ - ఆవేదన.. రీజనేంటి ..!
సీనియర్ నాయకుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. రగిలిపోతున్నారు. సీనియర్ నాయకుడైన ఆయనకు ప్రత్యేక గుర్తింపు లేకపోవడంపై రగిలిపోతున్నారు.
By: Tupaki Desk | 19 March 2025 3:00 AM ISTసీనియర్ నాయకుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. రగిలిపోతున్నారు. సీనియర్ నాయకుడైన ఆయనకు ప్రత్యేక గుర్తింపు లేకపోవడంపై రగిలిపోతున్నారు. గత ఎన్నికల్లో జగ్గంపేట నుంచి విజయం దక్కించుకున్న జ్యోతుల.. మంత్రివర్గంలో సీటును ఆశించారు. సీనియర్ మోస్టు కావడంతో ఆయన ఆశ తప్పుకాదు. కానీ, సమీకరణలు.. ఇతరత్రా కారణాలతో చంద్రబాబు ఆయనను పక్కన పెట్టారు. ఇది ఆయనకు మంట పుట్టించింది.
ఇక, అసెంబ్లీ స్పీకర్ పదవిని కోరుకున్నారు. కానీ, అది కూడా బీసీ కోటాలో అయ్యన్న కొట్టేశారు. డిప్యూటీ స్పీకర్ పదవిని రఘురామ దక్కించుకున్నారు. ఇక, ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో తనకంటే సీనియర్ ఎమ్మెల్యే లేకపోయినా.. పదవి మాత్రం దక్కలేదన్న ఆవేదన, ఆందోళన కూడా జ్యోతులలో కనిపిస్తోంది. అంతేకాదు.. తనను సీఎం చంద్రబాబు అసలు పట్టించుకోవడం లేదని కూడా బాధ చెందుతున్నారన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామాలే.. అసెంబ్లీలో జ్యోతులను ఒంటరి చేసింది.
గత అసెంబ్లీ సమావేశాల్లోనే తన ఆవేదనను పరోక్షంగా వెల్లడించారు. తాను అందరికన్నా సీనియర్ ఎమ్మెల్యేనని.. అయినా.. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. ఇది అప్పటి డిప్యూటీ స్పీకర్.. రఘురామకు, జ్యోతులకు మధ్య వాగ్వాదాన్ని సైతం పెంచింది. ఇక, తాజాగా సెషన్‌లోనూ.. జ్యోతు ల ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం సమస్యలను చెప్పుకొనేందుకు ఎవరూ వినిపించుకోవడం లేదని అన్నారు.
సభలోనూతనను పట్టించుకోవడం లేదని, మైకు ఇచ్చినట్టే ఇచ్చి కట్ చేస్తున్నారని.. తానేమైనా ప్రతిప క్షంలో ఉన్నానా? అని ప్రశ్నించారు. ఈ పరిణామం కూడా మరోసారి సభలో స్పష్టంగా జ్యోతుల ఆవేదనను కళ్లకు కట్టింది. నిజానికి ఎమ్మెల్యేలు అందరికీ.. అనేక సమస్యలు ఉన్నాయి. కానీ, జ్యోతుల ఆవేదన మా త్రం వ్యక్తిగత సమస్య. కానీ, బయటకు చెప్పుకోలేక.. దిగమింగుకోలేక.. ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుం డడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే జ్యోతుల రగిలిపోతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. కనీసం ఏదో ఒక నామినేటెడ్ పదవి అయినా.. ఆయనకు ఇస్తే కొంత వరకు ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.