అసంతృప్తితో రగిలిపోతున్న టీడీపీ నేతలు
గత ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న తమకు సరైన గుర్తింపు, గౌరవం దక్కడం లేదని రగిలిపోతున్న నేతలు రాజీనామాలకు రెడీ అవుతున్నారు.
By: Tupaki Desk | 13 Jan 2025 6:24 AM GMTటీడీపీలో ద్వితీయ, త్రుతియ శ్రేణి నాయకుల్లో అసంతృప్తి నానాటికీ పెరిగిపోతోంది. గత ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న తమకు సరైన గుర్తింపు, గౌరవం దక్కడం లేదని రగిలిపోతున్న నేతలు రాజీనామాలకు రెడీ అవుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక మరింత నిర్లక్ష్యానికి గురవుతున్నామని భావిస్తున్న నేతలను అధిష్ఠానం అర్థం చేసుకోలేకపోతోందా? ఏడు నెలల్లోనే కార్యకర్తల్లో నైరాశ్యం నిండిపోతే మున్ముందు పరిస్థితి ఏంటనే ఆవేదన వ్యక్తమవుతోంది.
టీడీపీ అధికారంలోకి వచ్చినా పార్టీ నేతల్లో ఆనందం కనిపించడం లేదు. ఎన్నో కష్టాలు అనుభవించి పార్టీని గెలిపిస్తే, అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలకు ప్రాధాన్యమిస్తున్నారని, ప్రత్యర్థులను చేరదీస్తూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారని దిగువ శ్రేణి నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఆవేదనతోనే ఏలూరు జిల్లా చాట్రాయి మండలానికి చెందిన పలువురు నేతలు ఆదివారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తమ నియోజకవర్గంలో వైసీపీ నేతలు, కార్యకర్తలకు లభిస్తున్న గుర్తింపు తమకు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం టీడీపీలో వింత పరిస్థితి నెలకొందని ఈ సంఘటన తేటతెల్లం చేస్తోంది. ఏడు నెలలుగా అధికారంలో ఉన్నా తమ పనులు చేయడం లేదని టీడీపీ కార్యకర్తలు, నేతలు ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్ఠానానికి తమ బాధలు చెప్పుకుంటున్న పరిస్థితిలో మార్పు రావడం లేదని అంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో కార్యకర్తలు, నేతలు స్థానిక ఎమ్మెల్యేపై తిరుగుబాటు చేసి రోడ్డెక్కడం తెలిసిందే. ఈ పరిస్థితి రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఉన్నప్పటికీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు.
ఇక విజయనగరం జిల్లాలో అయితే వైసీపీ నేతల హవాయే కొనసాగుతోందనే విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు మంత్రులు, 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఆ జిల్లాలో వైసీపీకి చెందిన జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు హవా కొనసాగుతోందని దిగువస్థాయిలో ఆవేదన వ్యక్తమవుతోంది. రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితిపై కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో సైతం వైసీపీ కార్యకర్తలకే ఎమ్మెల్యేలు, ఎంపీలు పనులు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక రాజధాని ప్రాంతంలో ఓ మంత్రి ఏకంగా వైసీపీ శ్రేణులను కాపాడే ప్రయత్నం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి పేర్నికి ప్రభుత్వ సమాచారం చేరవేయడంతోపాటు మట్టి, మైనింగ్ మాఫియా నడిపిన వైసీపీ నేతలను కాపాడేందుకు విశ్వప్రయత్నం చేస్తుండటం కార్యకర్తలను ఆవేదనకు గురి చేస్తోందంటున్నారు.
తాము కష్టపడి గెలిపించిన నేతలే తమను చిన్నచూపు చూస్తున్నారని కార్యకర్తలు మండిపడుతున్నారు. ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చిన వైసీపీ వారికి ప్రాధాన్యమిస్తూ తమను వెనక్కి నెట్టేస్తున్నారని అంటున్నారు. వైసీపీ నుంచి వచ్చిన వారు పదవుల్లో ఉండటం, వారిని ఎదిరించి పనిచేసిన వారికి ఎలాంటి పదవులు లేకపోవడం అసంతృప్తికి కారణమవుతోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఇలాంటి వారికి అవకాశం ఇస్తే కొంత సంతృప్తి పరిచే అవకాశం ఉన్నా, టీడీపీ అధిష్ఠానం ఆ దిశగా ఆలోచించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన నియోజకవర్గ స్థాయి పదవులను ఇంకా నియమించలేదు. దీంతో దిగువ శ్రేణి నేతలు, కార్యకర్తలు పదవుల కోసం ఎదురుచూసి నైరాశ్యంలోకి జారిపోతున్నారు.