Begin typing your search above and press return to search.

విజయవాడ కోర్టుకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ మాజీ నేతలు!

ఓ కేసుకు సంబంధించి విచారణ కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు విజయవాడ కోర్టుకు హాజరయ్యారు.

By:  Tupaki Desk   |   24 Dec 2024 10:30 AM GMT
విజయవాడ కోర్టుకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ మాజీ నేతలు!
X

టీడీపీకి చెందిన పాత నేతల అంతా ఒకేచోట కనిపించడంతో సందడి కనిపించింది. ఓ కేసుకు సంబంధించి విచారణ కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. వీరిలో కొందరు ప్రస్తుతం టీడీపీలో ఉండగా, తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్నారు.


రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమా, అమర్నాథ్ రెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, మాజీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్, తెలంగాణ కాంగ్రెస్ నేత, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి వీరంతా ఒకప్పుడు టీడీపీలో సహచరులు. చంద్రబాబు ఆదేశాలతో ఎన్నో పోరాటాలు చేశారు. కలిసిమెలిసి తిరిగారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నేతలు టీడీపీని వదిలి వేర్వేరు పార్టీల్లోకి వలస పోగా, ఏపీ నేతలు మాత్రం ఇప్పటికీ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే వీరంతా మంగళవారం ఒక్కసారిగా కలిశారు. 2007లో అనంతపురం జిల్లా ఓబులాపురం మైనింగ్ కేసులో నమోదైన కేసుకు సంబంధించి విచారణ ఉండటంతో అంతా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఎదుట హాజరయ్యారు. చాలా కాలం తర్వాత పాత నేతలు అంతా ఒకే చోట చేరడంతో కోర్టు ఆవరణ సందడిగా మారిపోయింది.


రాష్ట్ర విభజన తర్వాత సీనియర్ నేత నాగం సొంత పార్టీ పెట్టుకుని ఆ తర్వాత బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో పనిచేసి 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా ఎర్రబెల్లి సైతం టీడీపీలో ఓ వెలుగు వెలిగారు. రాష్ట్ర విభజన తర్వాత కొద్దికాలం టీడీపీలోనే కొనసాగినా, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో బీఆర్ఎస్లో చేరి మంత్రిగా పనిచేశారు. ఇక మరో సీనియర్ వేం నరేందర్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రియ శిష్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న వేం నరేందర్ రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత తన స్నేహితుడు రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ కి వలస పోయారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ప్రభుత్వ సలహాదారుగా చక్రం తిప్పుతున్నారు. వీరంతా కోర్టు పనిపై విజయవాడకు రావడం, ఇదే కేసులో నిందితులుగా ఉన్న అచ్చెన్నాయుడు, చినరాజప్ప, దేవినేని ఉమా కోర్టుకు వెళ్లడంతో కార్యకర్తలకు కనువిందు కలిగింది. గతంలో కలిసిమెలిసి తిరిగిన నేతలను మళ్లీ ఒకే చోట చూడటంపై కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.

దాదాపు 17 ఏళ్ల తర్వాత కేసు విచారణకు రావడం, పదేళ్ల తర్వాత మళ్లీ కలుసుకోవడంతో తెలంగాణ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ కేసులో మొత్తం 21 మంది నిందితులు కాగా, ముగ్గురు మరణించారు. మిగిలిన 18 మంది కోర్టు ఎదుట హాజరయ్యారు.