ఎమ్మెల్యేలపై టీడీపీ క్యాడర్ తిరుగుబాటు? తప్పెవరది?
అయితే గెలిచిన ఎమ్మెల్యేలు కార్యకర్తలను విస్మరించి తమ చుట్టూ భజన బృందానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని విమర్శిస్తున్నారు.
By: Tupaki Desk | 24 Jan 2025 5:44 AM GMTమొన్న శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, నిన్న నూజివీడు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పార్థసారథి, నేడు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్.. ఇలా ఒక్కో ఎమ్మెల్యేపై టీడీపీ క్యాడరులో అసంతృప్తి పెరిగిపోతోంది. దాడులు చేసేంత తీవ్రంగా పరిస్థితి మారిపోతోంది. ఏడు నెలల వ్యవధిలోనే టీడీపీ క్యాడరులో అసహనం డేంజర్ బెల్ మోగిస్తుందా? పార్టీ అధిష్ఠానం ఏం చేస్తోందనేది పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ గా మారింది.
క్రమశిక్షణకు మారుపేరైన టీడీపీలో కార్యకర్తలు కట్టు తప్పుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీరుపై సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు గురువారం దాడి చేయడం పెద్ద చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే గెలుపునకు తాము ఎంతో కష్టపడితే విజయం సాధించిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని కార్యకర్తలు ఆగ్రహిస్తున్నారు. ఈ కారణంతో కొందరు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీలో ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేకపోవడంతో అధిష్ఠానం కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. కార్యకర్తల్లో వచ్చిన మార్పును పార్టీ ఎలా చక్కదిద్దుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ముఖ్యంగా గత ఐదేళ్లు తీవ్ర నిర్బంధం ఎదుర్కొన్న టీడీపీ కార్యకర్తలు, పార్టీ గెలిచాక ఎక్కువ గుర్తింపు, గౌరవం కోరుకుంటున్నారు. అయితే గెలిచిన ఎమ్మెల్యేలు కార్యకర్తలను విస్మరించి తమ చుట్టూ భజన బృందానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని విమర్శిస్తున్నారు. గురువారం గుంటూరులో జరిగిన దాడికి ఇదే కారణమని పార్టీ వర్గాల సమాచారం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత రెండు ఎన్నికల్లోనూ వైసీపీయే గెలిచింది. వాస్తవానికి ఈ సీటులో టీడీపీయేతర వర్గాలకే ఎక్కువ బలం ఉండేది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ భారీ విజయం సాధించారు. ఆయన విజయం కోసం పనిచేసిన మైనార్టీ నేతలను ఎమ్మెల్యే విస్మరిస్తున్నారని ఆవేదన ఇటీవల కాలంలో ఎక్కువవుతోంది. దీనికి తగ్గట్టే గురువారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ నివాళి కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. అయితే ఆ ప్రాంతంలో టీడీపీ నేతలు ఫెరోజ్, ఇంతియాజ్, రియాజ్ ఉంటున్నారు. వీరికి కనీస సమాచారం లేకపోవడంతో ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే వారిపై ఫైర్ అవ్వడంతో దాడికి దిగారు. ఈ ఘటన టీడీపీలో సంచలనం రేపింది.
ఒక్క గుంటూరులోనే కాదు గతంలో శింగనమలలోనూ ఎమ్మెల్యే బండారు శ్రావణి అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీడీపీకే చెందిన ప్రసాద్ అనే గ్రామస్థాయి నేత ధర్నాకు దిగాడు. పార్టీకి 30 ఏళ్లుగా పనిచేస్తే ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి డబ్బులు అడుగుతున్నారని ఆయన వాపోయాడు. అదేవిధంగా ఎన్నికల ముందే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన మంత్రి పార్థసారథిపైనా టీడీపీ కార్యకర్తలు రగిలిపోతున్నారు. పార్టీ కోసం కష్టపడిన తమకంటే ఎక్కువగా వైసీపీ వారికే మంత్రి ప్రాధాన్యమిస్తున్నారనే ఆవేదనతో నియోజకవర్గానికి చెందిన 500 మంది కార్యకర్తలు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు.
ఇలా పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే కార్యకర్తల్లో అసమ్మతి వ్యక్తమవుతుండటంపై టీడీపీ అధిష్ఠానం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే ఎమ్మెల్యేలు, మంత్రుల వైఖరి మార్చుకోవాలని, కార్యకర్తలకు ప్రాధాన్యమివ్వాలని సూచిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదంటున్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను తమ సామ్రాజ్యంలా భావిస్తూ కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తుండటంతో వారిలో అసహనం పెరిగిపోతోందంటున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తానని చెబుతున్న యువనేత లోకేశ్ రంగ ప్రవేశం చేస్తేనే మార్పు వస్తుందని ఆశిస్తున్నారు. మొత్తానికి ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు మధ్య పెరిగిపోతున్న గ్యాప్ తగ్గించేలా అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకుంటుదనేది ఆసక్తికరంగా మారింది.