అమ్మో టీడీపీ సోషల్ మీడియా భయపడుతున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు
దీంతో వైసీపీ మాదిరిగానే టీడీపీకి బలమైన సోషల్ మీడియా సైన్యం ఏర్పాటైంది. ఇప్పుడు అదే సోషల్ మీడియా పార్టీ నేతల పాలిట శాపంలా మారుతోంది.
By: Tupaki Desk | 19 Dec 2024 6:30 PM GMTఆన్ లైన్ వేదికగా టీడీపీ కోసం పోరాడిన సోషల్ సైనికులు ఇప్పుడు తమ బాణాలను సొంత పార్టీ నేతలపైనే ఎక్కువపెట్టారా? అనే చర్చ జరుగుతోంది. ఇటీవల నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణకు వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేశ్ వస్తే నానా రచ్చచేసిన టీడీపీ సోషల్ మీడియా సైనికులు ఇప్పుడు తమ యుద్ధాన్ని ఎస్సీ రిజర్వుడు ఎమ్మెల్యేలపైకి మళ్లించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేయాలో.. ఎలా నడుచుకోవాలో అనే విషయాలను ఆన్ లైన్ వేదికగా పనిచేసే కార్యకర్తలు సూచిస్తుండటంతో ఇదెక్కడి తలనొప్పంటూ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
ప్రజా ప్రతినిధులుగా ఏ కార్యక్రమానికి వెళ్లాలి? వెళితే అక్కడ ఎవరైనా ప్రతిపక్ష పార్టీ నేతలు తారసపడితే ఎలా నడుచుకోవాలనేది పెద్ద సమస్యగా మారిందని వాపోతున్నారు. రాజకీయాల్లో ఇంతకుముందు లేని ఈ క్రమ‘శిక్ష’ణ తమ స్వేచ్ఛను హక్కులను కూడా హరిస్తుందని, అలాగని తమ కోసం పోరాడిన వారిని హద్దుల్లో ఉండమని చెప్పలేకపోతున్నామని మదనపడుతున్నారు.
ఒకప్పుడు రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితమయ్యేవి. ఎన్నికల అనంతరం వైరివర్గాలకు చెందిన నేతలు కలిసిమెలిసే ఉండేవారు. పార్టీ కార్యక్రమాలకు తప్ప మిగిలిన వ్యవహారాలు ఉమ్మడిగానే సాగించేవారు. శుభకార్యక్రమాలకు, కష్టసుఖాలకు వెళ్లడమనే మంచి సంప్రదాయం ఉండేది. కానీ, కొద్ది సంవత్సరాలుగా ఏపీ రాజకీయాల్లో ఈ సంపద్రయాం కనిపించడం లేదు. ముఖ్యంగా గత ఐదేళ్లు వైసీపీ పాలనలో ఫ్యాక్షన్ తరహా రాజకీయం కొనసాగడం, ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు విచ్చలవిడి పోస్టులతో శ్రుతిమించి ప్రవర్తించడంతో టీడీపీ కూడా అదే పంథాను ఎంచుకుంది. దీంతో వైసీపీ మాదిరిగానే టీడీపీకి బలమైన సోషల్ మీడియా సైన్యం ఏర్పాటైంది. ఇప్పుడు అదే సోషల్ మీడియా పార్టీ నేతల పాలిట శాపంలా మారుతోంది.
నూజివీడులో మాజీ మంత్రి జోగి రాకను వ్యతిరేకించడంలో న్యాయముందని కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగితో వేదిక పంచుకోడాన్ని తప్పుబట్టవచ్చు. ఈ కారణంతోనే ఆ కార్యక్రమానికి వెళ్లిన మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీషా వివరణ ఇచ్చుకున్నారు. దీంతో తాము విజయం సాధించామనే సోషల్ మీడియా మరింత జూలు విదుల్చుతోంది. గతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత లోకేశ్ విధానాలను ప్రశ్నించిన టీడీపీ సోషల్ మీడియా రచ్చ చేస్తోంది. నూజివీడు ఎపిసోడ్లో మంత్రి లోకేశ్ కూడా సోషల్ మీడియాకు వత్తాసు పలకడంతో ఇప్పుడు తమ ఫోకస్ మిగిలిన నేతలపైకి మళ్లించింది.
ఈ క్రమంలో ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో గెలిచిన మాల సామాజిక వర్గ ఎమ్మెల్యేలపై అస్త్రాలు సంధించేందుకు సిద్ధమవుతోంది టీడీపీ సోషల్ మీడియా. ఈ నెల 22న రాజధాని పరిధిలోని తాడేపల్లి బ్రహ్మానందపురంలో మాల సామాజికవర్గానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీకి చెందిన ఎంపీలు గంటి హరీశ్ బాలయోగి, దగ్గమళ్ల ప్రసాదరావుతోపాటు వైసీపీకి చెందిన తిరుపతి ఎంపీ గురుమూర్తిని ఆహ్వానించారు. అదేవిధంగా కూటమిలోని 14 మంది ఎమ్మెల్యేలు, మరికొందరు మాజీ ఎమ్మెల్యేలను పిలిచారు. ఈ క్రమంలోనే వైసీపీలోని మాల సామాజికవర్గ నేతలను ఆహ్వానించారు. ఈ లిస్టులో మాజీ మంత్రి మేరుగ నాగార్జున పేరు కూడా ఉంది. దీంతో టీడీపీ సోషల్ సైనికులు కొందరు మేరుగ నాగార్జునకు ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మాల సామాజికవర్గ ఉద్యోగుల ఆత్మీయుల సమావేశానికి అన్ని పార్టీల నాయకులను ఆ ఉద్యోగ సంఘం ఆహ్వానించింది. ఈ కార్యక్రమం టీడీపీకి సంబంధం లేకపోయినా, ఆ పార్టీ సోషల్ మీడియా మాత్రం తమ ఎమ్మెల్యేలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశమవుతోంది. ఇంతకుముందు లేని ఈ పెడధోరణికి ఆదిలోనే ఫుల్ స్టాప్ పెట్టాలని లేదంటే పాముకు పాలు పోసి పెంచినట్లే అవుతుందని టీడీపీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. వైసీపీ కూడా సోషల్ మీడియాకు విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చి తగిన మూల్యం చెల్లించుకుందని, అదే తప్పు తమ పార్టీ చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తోందని హెచ్చరిస్తున్నారు.