నన్ను జైల్లో పెడతారా? వాడి జేజెమ్మ దిగిరావాలి: వంశీ కామెంట్లు గుర్తు చేస్తున్న తమ్ముళ్లు
రాజకీయాల్లో లొంగి ఉండక్కర్లేదు.. కానీ.. తగ్గి ఉండాలి. వినయం, విధేయతలు లేకపోయినా.. విచారణా త్మకమైన విధానంతో నాయకులు ముందుకు సాగాలి.
By: Tupaki Desk | 14 Feb 2025 12:30 PM GMTరాజకీయాల్లో లొంగి ఉండక్కర్లేదు.. కానీ.. తగ్గి ఉండాలి. వినయం, విధేయతలు లేకపోయినా.. విచారణా త్మకమైన విధానంతో నాయకులు ముందుకు సాగాలి. ఇది లేకపోతే.. కష్టం. అధికారం ఎవరికీ శాస్వతం కాదన్నది ప్రజాస్వామ్యం చెబుతున్న మాట. కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం కూడా. కానీ, కొందరు నాయకులు ఈ నిజాన్ని ఒప్పుకొనేందుకు అంత ఇష్టపడరు. కళ్లముందు కనిపిస్తున్న అధికారం తమ చేయి దాటి పోదని అనుకుంటారు. అందుకే.. గత వైసీపీ హయాంలో నాయకులు చేతికి, నోటికి కూడా పని చెప్పారు.
ఈ కోవలోనే.. 2022-23 మధ్య వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు శ్రుతి మించాయి. అప్పటి సీఎం జగన్.. వచ్చే 30 ఏళ్లు మనమే అధికారంలో ఉంటామని పదే పదేచెప్పడంతో ఇదంతా నిజమేనని నాయకులు కూడా నమ్మేశారు. దీంతో ఎవరికి వారు.. ఇష్టానుసారం రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే 2019లో టీడీపీ తరఫున విజయం దక్కించుని గన్నవరం నుంచి ప్రాతినిధ్యం వహించిన వల్లభనేని వంశీ.. తర్వాత కాలంలో వైసీపీ పంచన చేరిపోయారు. అయితే.. పార్టీలు మారడం తప్పుకాకపోవచ్చు. కండువాలు కప్పుకోవడమూ తప్పుకాకపోవచ్చు.
కానీ, వైసీపీని చూసుకుని నోరు పారేసుకున్న విధానమే వంశీని అప్పట్లో వివాదాల సుడిలోకి నెట్టాయి. ఏకంగా చంద్రబాబు ఫ్యామిలీలోని లేడీస్‌పైనే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అప్పట్లో దుమా రం రేపింది. నారా లోకేష్‌పై పరుష వ్యాఖ్యలు చేయడం.. ఇంట్లో లేడీస్‌ను బూతులు తిట్టడం.. వంటివి వంశీ వ్యవహారాన్ని వివాదాల్లోకి నెట్టింది. ఈ క్రమంలోనే టీడీపీ అధికారంలోకి వస్తే.. వంశీని అరెస్టు చేయడం ఖాయమన్నచర్చ తెరమీదికి వచ్చింది. ఆ సమయంలో వంశీ రియాక్షన్ భిన్నంగా ఉంది.
''నన్ను అరెస్టు చేస్తారా? జైల్లో పెడతారా? వాడి జేజెమ్మ దిగిరావాలి. అరెస్టు చేసినప్పుడు చూద్దాంలే'' అ ని వంశీ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు టీడీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. అధికారం ఉందని.. మితిమీరి న వంశీకి ఇప్పుడు తగిన శాస్తి జరిగిందని తమ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. దురహంకారంతో రెచ్చిపోయి.. ఆనాడు చంద్రబాబుపైనే వ్యాఖ్యలు చేసిన వంశీని కోర్టులు కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్న వారు కూడా కనిపిస్తుండడం గమనార్హం. సో.. ఈ పరిణామాలు వంశీకి గుర్తున్నాయో లేదో!!