విడివిడి అన్నారు.. కలివిడిగా సాగారు.. బాబు ఎఫెక్ట్!
కానీ, ఇప్పుడు చంద్రబాబు ఎఫెక్ట్‌తో అంతా కలిసిపోయారు. ఆయన చెప్పినట్టే విన్నారు.
By: Tupaki Desk | 3 Sep 2024 11:30 AM GMTవారంతా.. టికెట్లు దక్కని నాయకులు. పోనీ.. నామినేటెడ్ పదవులు అయినా.. దక్కుతాయో లేదో అన్న సందిగ్ఢంలో ఉన్న నాయకులు. అంతేకాదు.. ఎన్నికల సమయంలో తాము చేసిన త్యాగాలకు.. ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం కనిపించడం లేదని కూడా అంటున్న నాయకులు. దీంతో వారంతా బుంగమూతి పెట్టుకుని.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరికొం దరు బాహాటంగానే అధినేతపై చిందులు తొక్కుతున్నారు. పార్టీ తరఫున కూడా పెద్దగా యాక్టివ్‌గా ఉండడం లేదు. దీంతో ఇలాంటి వారంతా.. పార్టీకి షాకిస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. అంచనాలు కూడా వేసుకున్నారు.
కానీ, ఇప్పుడు చంద్రబాబు ఎఫెక్ట్‌తో అంతా కలిసిపోయారు. ఆయన చెప్పినట్టే విన్నారు. ఆయన చూపినట్టే చేశారు. వారే.. టీడీ పీ సీనియర్ నాయకులు. ఎన్నికల సమయంలో టికెట్లు త్యాగం చేసిన వారు కొందరు. మరికొందరు.. పోటీలో ఉంటామని అనుకుని ఏర్పాట్లు చేసుకుని చివరకు టికెట్లు దక్కక వెనక్కి తగ్గిన వారు. ఇలా.. మొత్తంగా టీడీపీలో చాలా మంది నాయకులు ఉన్నారు. వీరంతా కూడా.. చంద్రబాబు తమకు న్యాయం చేస్తారని.. నామినేటెడ్ పదవులు ఇస్తారని ఆశించారు. వీరిలో దేవినేని ఉమా మహేశ్వరరావు, కొనకళ్ల నారాయణ, బుద్దా వెంకన్న వంటివిజయవాడ, కృష్నాజిల్లాకు చెందిన నాయకులు ఉన్నారు.
అయితే.. ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నామినేటెడ్ వ్యవహారాన్ని తేల్చడం లేదు. దీంతో వారంతా.. కొన్నాళ్లు వేచి చూసి.. తర్వాత నియోజకవర్గాలకు, పార్టీ కార్యకర్తలకు కూడా దూరంగా ఉంటున్నారు. అయితే.. తాజాగా విజయవాడను పోటెత్తిన వరద కారణంగా.. చంద్రబాబు ఒకే ఒక్క పిలుపు ఇచ్చారు. నాయకులు, కార్యకర్తలు అందరూ.. వరద బాధితులకు సాయం చేయాలని పేర్కొన్నారు. దీంతో వారంతా ఏకమయ్యారు.
స్థానిక ఎమ్మెల్యేలతో ఉన్న విభేదాలను కూడా పక్కన పెట్టి.. అందరూ కలిసి కట్టుగా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి వరద బాధితులను ఆదుకునేందుకు చేతులు కలిపారు. దీంతో నిన్న మొన్నటి వరకు కూడా విడివిడిగా ఉన్నారని అనుకున్న నాయకులు కలివిడిగా ముందుకు సాగడంతో అందరూ ఆశ్చర్య పోయారు. ఇదంతా చంద్రబాబు ఎఫెక్టేనని సోషల్ మీడియాలోనూ కామెంట్లు పడుతున్నాయి.