తమ్ముళ్లు అంత బలహీనంగా ఉన్నారా? ఇదేదో ఆలోచించాలి!
అందుకే నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలన్న డిమాండ్ తెరమీదికి వచ్చిందన్నది పల్లావారి ఉవాచ. కానీ, వాస్తవం ఇదేనా? అంటే.. కాదనేది విశ్లేషకుల మాట.
By: Tupaki Desk | 24 Jan 2025 6:30 AM GMTఏపీలో కూటమి సర్కారుకు నేతృత్వం వహిస్తున్న తెలుగు దేశం పార్టీ బలహీనంగా ఉందా? ముఖ్యంగా.. సీనియర్ నాయకులు, మంత్రులు కూడా.. బలహీనంగా ఉన్నారా? ఇప్పుడు ఇదే చర్చ తెరమీదికి వచ్చిం ది. ఎందుకంటే టీడీపీ రాష్ట్ర చీఫ్ పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ట్రాప్‌లో తమ పార్టీ నాయకులు చిక్కుకుంటున్నారని.. కాలకేయులు తమ పార్టీని నాశనం చేసి.. కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
ఈ వ్యాఖ్యల తర్వాత.. సోషల్ మీడియాలో ఈ తరహా చర్చ తెరమీదికి వచ్చింది. వైసీపీ వంటి బలహీన పార్టీ(11 మంది ఎమ్మెల్యేలు ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు) బలమైన టీడీపీ నేతలను ప్రభావితం చేస్తోందా? అనేది సందేహం. ఇటీవల నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలన్న డిమాండ్లు వినిపిం చాయి. దీనిపై ఉత్తరాంధ్ర నుంచి సీమ వరకు నాయకులు పలు వ్యాఖ్యలు చేశారు. అయితే.. చంద్రబాబు జోక్యంతో ప్రస్తుతం ఈ వాదన వీగిపోయింది. కానీ, దీనివెనుక వైసీపీ ఉందని.. కూటమిపై కుట్రలు చేస్తోం దని పల్లా చెప్పుకొచ్చారు.
అందుకే నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలన్న డిమాండ్ తెరమీదికి వచ్చిందన్నది పల్లావారి ఉవాచ. కానీ, వాస్తవం ఇదేనా? అంటే.. కాదనేది విశ్లేషకుల మాట. ఎందుకంటే.. పదవులు ఆశిస్తున్న కొందరు టీడీపీ నాయకులు.. సీనియర్లు కూడా.. నారా లోకేష్‌ను కాకాపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను మచ్చిక చేసుకోవడం ద్వారా.. పదవులు పొందే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే డిప్యూటీ సీఎం అనే డిమాండ్ తెరమీదికి వచ్చిందని చెబుతున్నారు.
ఒకవేళ.. దీని వెనుక వైసీపీ నేతలు కానీ... ఆ పార్టీ అధిష్టానం కానీ ఉంటే.. అది పూర్తిగా టీడీపీ వైఫల్యమే అవుతుందని కూడా చెబుతున్నారు. ఏమాత్రం బలం లేని వైసీపీ నేతలు చెప్పినట్టు బలమైన టీడీపీ నాయకులు వింటారా? అంటే.. ప్రతిపక్షం అధికార పక్షాన్ని ఆడిస్తోందా? అనేది ప్రశ్నలుగా మిగిలాయి. అంతేకాదు.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు మరీ అంత బలహీనంగా ఉన్నారా? అనే ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని.. దానిని సరిదిద్దుకుంటే బెటర్ అని.. సూచిస్తున్నారు.