కడపలో మహానాడు... టీడీపీ రాజకీయ సంచలనం!
వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఈసారి తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది.
By: Tupaki Desk | 1 Feb 2025 4:21 AM GMTవైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఈసారి తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పొలిట్ బ్యూరో లో నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. మహానాడు టీడీపీకి ఒక పండుగ. పార్టీలో ఉన్న క్యాడర్ మొత్తం ఎంతో ఉత్సాహంగా పాల్గొంటుంది. ఇక చూస్తే 2023లో రాజమండ్రిలో టీడీపీ మహానాడు జరిగింది. ఆనాడు రాజమండ్రిలో నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా పార్టీ కార్యక్రమాలు సాగాయి. సూపర్ సిక్స్ పధకాల గురించి ఆనాడే ప్రస్తావించారు.
దాంతో గోదావరి జిల్లాలలో రాజకీయం గేర్ మార్చింది మహానాడు. అలా వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కకుండా చేసి కూటమి కట్టి మరీ టీడీపీ గోదావరి తీరంలో రాజకీయాన్ని తమ వైపు తిప్పుకుంది. ఇక 2024లో మహానాడు నిర్వహించలేదు. అప్పటికి ఏపీలో ఎన్నికలు పూర్తి అయిపోయాయి. ఫలితాల కోసం వేచి చూసే పరిస్థితి ఉంది. దాంతో వచ్చేసారికి ఘనంగా నిర్వహిద్దామని భావించి మహానాడుని వాయిదా వేశారు. ఇక ఇపుడు చూస్తే టీడీపీ బంపర్ విక్టరీ కొట్టి పూర్తి ఉత్సాహంలో ఉంది.
పైగా వైసీపీ దారుణమైన ఓటమిని మూటగట్టుకుని కునారిల్లుతోంది. జగన్ సొంత జిల్లా ఆ పార్టీకి కంచుకోట అయిన కడపలో పది అసెంబ్లీ సీట్లు ఉంటే కేవలం మూడు మాత్రమే వైసీపీకి గత ఎన్నికల్లో దక్కాయీ అంటే ఆ పార్టీ పరిస్థితి ఎలా అయింది అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం.
అంతే కాదు 52 అసెంబ్లీ సీట్లు ఉన్న రాయలసీమలో వైసీపీకి అరడజన్ సీట్లు కంటే కూడా తక్కువ వచ్చాయి. దాంతో రాయలసీమలో వైసీపీ గాలి పూర్తిగా తగ్గిపోయిందని టీడీపీ భావిస్తోంది. దాంతో తమకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మరింతగా పదిలపరచుకుని రాయలసీమలో పూర్తి స్థాయిలో పటిష్టం కావాలని చూస్తోంది.
ప్రభుత్వం సైతం రాయలసీమ అభివృద్ధికి పెద్ద పీట వేస్తోంది. ఇపుడు రాజకీయంగా కూడా సీమలో సైకిల్ ని నిరంతరంగా పరుగులు పెట్టించాలని టీడీపీ చూస్తోంది. అందుకే రాయలసీమకు గుండెకాయ లాంటి కడపను ఈసారి మహానాడుకు ఎంచుకుంది.
మే నెల 27 28 తేదీలలో రెండు రోజుల పాటు సాగే మహనాడుకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేయాలని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్ళాయి. కడప గడపలో వైసీపీని నిర్వీర్యం చేయడం జగన్ సొంత ఇలాకాలో బస్తీమే సవాల్ విసరడం ద్వారా సీమలో రాజకీయాన్ని ఏకపక్షం చేయాలని టీడీపీ వ్యూహ రచన చేస్తోంది.
మరి కడపలో టీడీపీ మహానాడు అంటేనే రాజకీయ సంచలనంగా ఉంటుంది. ఈ మహానాడులో చంద్రబాబు లోకేష్ సహా కీకల నేతలు ఏ విధంగా ప్రసంగాలు చేస్తారు, వైసీపీని జగన్ ని ఎలా టార్గెట్ చేస్తారు అన్నది చూడాల్సిందే.