కడప గడపకు పసుపు పూత...వైసీపీకి డేంజర్ బెల్స్ ?
ఈలోగా కడప కార్పోరేషన్ లో వైసీపీ జెండాను దించేసే కార్యక్రమానికి టీడీపీ గట్టిగానే ప్రయత్నాలు మొదలెట్టింది. కడప ఎమ్మెల్యేగా ఉన్న మాధవీరెడ్డి ఆ పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు.
By: Tupaki Desk | 15 Dec 2024 4:05 AM GMTకడప అంటే వైఎస్సార్ ఫ్యామిలీకి కంచుకోట. వైఎస్సార్ ప్రతిపక్షంలో అత్యధిక కాలం నెట్టుకుని వచ్చారూ అంటే దానికి కారణం సొంత జిల్లాలో బలం బలగం పెద్ద ఎత్తున ఉండడమే. ఇక ఆయన రాజకీయ వారసుడిగా జగన్ కి కూడా ఆ బలం తోడు అయింది. కాంగ్రెస్ ని జగన్ ధిక్కరించి వచ్చినా సొంత పార్టీ పెట్టినా అక్కున చేర్చుకుని ఆదరించింది సొంత జిల్లా.
అయితే 2024 నాటికి మొత్తం పరిస్థితులు మారిపోయాయి. కడపలో టీడీపీ గెలిచి తొడకొట్టి సవాల్ చేస్తోంది. ఇక కడప జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ సీట్లకు గానూ వైసీపీకి కేవలం నాలుగు మాత్రమే దక్కితే మెజారిటీ కొటమి ఎగరేసుకుని పోయింది.
ఇక కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో కడప జిల్లా పరిషత్ మీద కన్నేసింది. ఎన్నికల ముందు తరువాత కొంతమంది జెడ్పీటీసీలను చేర్చుకుంది. దాంతో అలెర్ట్ అయిన వైసీపీ అధినాయకత్వం వారిని పిలిచి మరీ బుజ్జగించింది. అధికార పార్టీ కంటే కూడా అన్ని రకాలుగా ఎక్కువ ప్రయోజనం కలిగిస్తామని హామీ ఇచ్చింది.
అయితే జెడ్పీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. ఈలోగా కడప కార్పోరేషన్ లో వైసీపీ జెండాను దించేసే కార్యక్రమానికి టీడీపీ గట్టిగానే ప్రయత్నాలు మొదలెట్టింది. కడప ఎమ్మెల్యేగా ఉన్న మాధవీరెడ్డి ఆ పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు.
ఆమె ఇటీవల కార్పోరేషన్ మీటింగ్ కి వెళ్తే ఆమెను వేదిక మీదకు ఆహ్వానించలేదని అనుచరులు రచ్చ చేశారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం ఆమెను ఆ విధంగా వేదిక మీదకు అనుమతించే అవకాశం లేదని అధికారులు చెప్పినా ఆ రచ్చ కొనసాగింది. అది హైలెట్ అయింది. అంతే కాదు వైసీపీకి చెందిన మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు చెత్తను పోయించి ఆ మధ్య టీడీపీ నేతలు చేసిన నిరసనలు కూడా ఒక హైలెట్ గా నిలిచాయి.
ఇపుడు చూస్తే ప్రభుత్వ విప్ పదవి ఆమెకు ఇచ్చారు. దాంతో పాటు కేబినెట్ ర్యాంక్ హోదా కూడా ఇచ్చారు. ఈ నేపధ్యంలో కడప కార్పొరేషన్ ని వైసీపీ నుంచి లాగేయాలన్న అధినాయకత్వం ఆలోచనలను తెలుసుకుని మరీ ఆమె వ్యూహాలు రూపొందిస్తున్నారు అని అంటున్నారు.
కడపలో ఆపరేషన్ ఆకర్ష్ ని స్టార్ట్ చేశారు అని అంటున్నారు. ఈ దెబ్బకు వైసీపీ నుంచి ఏకంగా పదిహేను నుంచి ఇరవై మంది కార్పోరేటర్లు టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్త్తోంది. చాలా తొందరలో వారందరినీ అమరావతికి తెచ్చి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేర్చాలని మాధవీరెడ్డి సూపర్ ప్లాన్ రెడీ చేసుకున్నారు.
వారికి భారీగా తాయిలాలు కూడా అందిస్తున్నారని టాక్. అదే విధంగా వచ్చే ఎన్నికల్లో మళ్లీ వారికే టికెట్లు ఇవ్వాలని కూడా హామీలో ఉందిట. ఇలా వైసీపీ కార్పోరేటర్లను తమవైపునకు తిప్పుకుని మేయర్ గా ఉన్న సురేష్ బాగుని దించేయాలని మాధవీరెడ్డి పట్టుదలగా ఉన్నారని అంటున్నారు.
ప్రోటోకాల్ విషయంలో తమను అవమానపరచిన మేయర్ ని మాజీని చేయడమే సరైన జవాబు అన్నట్లుగా ఆమె దూకుడు చేస్తున్నారు అని అంటున్నారు. టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కి ఊహించని విధంగా మద్దతు లభిస్తోందిట. మరింతమంది కార్పోరేటర్లు కూడా టీడీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. అదే కనుక జరిగితే జగన్ సొంత ఇలాకాలో కార్పోరేషన్ చేజారడం ఖాయమని అంటున్నారు.
ముందు కార్పోరేషన్ తో మొదలెట్టి ఆ తరువాత జెడ్పీ పీఠం కూడా టీడీపీకి దక్కేలా చూసుకుంటే వైసీపీ అధినేత సొంత జిల్లాలోనే ఆ పార్టీ కూశాలు కదిలిపోయాయని ఏపీవ్యాప్తంగా ప్రచారం చేయవచ్చు అని తద్వరా ఆ పార్టీని పొలిటికల్ గా డీ మోరలైజ్ చేయవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.