టీడీపీ ఎమ్మెల్యే భర్త రియల్ ఎస్టేట్ దందాలు!
గత ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ నేతల తీరుతో సామాన్యులు చాలా ఇబ్బందులు పడ్డారని.. కూటమి పార్టీ నేతల నుంచి విమర్శలు పెద్ద ఎత్తున వినిపించిన నేపథ్యంలో
By: Tupaki Desk | 28 Aug 2024 6:30 AM GMTగత ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ నేతల తీరుతో సామాన్యులు చాలా ఇబ్బందులు పడ్డారని.. కూటమి పార్టీ నేతల నుంచి విమర్శలు పెద్ద ఎత్తున వినిపించిన నేపథ్యంలో... ప్రస్తుతం కూటమి పార్టీలోనూ అలాంటి విమర్శలు తెరపైకి వస్తుండటం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఈ సమయంలో తాజాగా ఓ మహిళా ఎమ్మెల్యే భర్త వ్యవహారం వివాదాస్పదమవుతోంది.
అవును... గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త గల్లా రామచంద్రరావు వ్యవహారం ఇప్పుడు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని తెలుస్తోంది. తాజాగా ఈయన ఓ భూ వివాదంలో చిక్కుకున్నారు! వెంకటేశ్వర్లు అనే రైతు పొలాన్ని.. ఎమ్మెల్యే భర్త రామచంద్రరావు తన పేరున రాయమని వేధిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో.. ఈ విషయంపై పెనుదుమారం లేస్తోంది!
వివరాళ్లోకి వెళ్తే... పెదకూరపాడు నియోజకవర్గం పీసపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే రైతుకు చెందిన ఎనిమిది ఎకరాల్లో 3 ఎకరాల 90 సెంట్లను గల్ల రామచంద్రరావు గతంలో కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. అయితే... మిగిలిన పోలాన్ని కూడా ఇవ్వమని తనను వేధిస్తున్నారని రైతు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే భర్త అనుచరులు తమపై దాడి చేశారని వాపోతున్నారు.
ఇలా తమపై దాడి చేసి, తిరిగి తమపైనే అక్రమంగా అట్రాసిటీ కేసులు పెట్టించారంటూ భాదితుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు! ఇదే సమయంలో ఎమ్మెల్యే భర్త ఎద్వారా తనకు ప్రాణహాని ఉందని కూడా రైతు వాపోతుండటం గమనార్హం.
గతంలో తనవద్ద ఎకరం భూమిని రూ.48 లక్షలకు కొన్న ఎమ్మెల్యే భర్త రామచంద్రరావు... 3.9 ఎకరాల భుమి కొనుగోలుకు అగ్రిమెంట్ చేసుకున్నాడని చెబుతున్నారు. అయితే ఇప్పుడు తన భార్య ఎమ్మెల్యే అయిన తర్వాత... మిగిలిన నాలుగు ఎకరాలకు రూ.30 లక్షలు ఇస్తామని, ఆ పొలాన్ని తనకు అమ్మేయాలని, లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు!
ఈ నేపథ్యంలో... పట్టాభిపురం పోలీసుల సమక్షంలోనే తన కుటుంబంపై దాడికి పాల్పడ్డారని చెబుతున్న బాధితుడు... తాను కోర్టును ఆశ్రయించడంతో న్యాయమూర్తి ఆదేశాలతో రామచంద్రరావుపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. దీంతో... ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.