వివాదంలో మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు!
వీరిలో ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన గంగాధర నెల్లూరు (జీడీ నెల్లూరు)ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్, మనదపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా తదితరులు ఉన్నారు.
By: Tupaki Desk | 6 Oct 2024 12:30 AM GMTతిరుమలలో స్వామివారి దర్శనానికి వచ్చే అన్య మతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటనను ఖరారు చేసుకుని.. చివరి క్షణంలో రద్దు చేసుకున్నారు. వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందనే కారణంతోనే తన పర్యటనను రద్దు చేసుకున్నారనే విమర్శలు బలంగా వినిపించాయి.
కాగా ప్రస్తుతం టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీసమేతంగా తిరుమలలో పర్యటిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించి.. వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు.
చంద్రబాబు పర్యటన సందర్భంగా పలువురు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు సైతం తిరుమలకు వచ్చారు. వీరిలో ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన గంగాధర నెల్లూరు (జీడీ నెల్లూరు)ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్, మనదపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా తదితరులు ఉన్నారు.
అయితే.. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్య మతస్తుడు అయినప్పటికీ తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వలేదని.. ఇవ్వకుండానే స్వామివారి దర్శనం చేసుకున్నారని వైసీపీ అనుకూల మీడియా తన కథనాల్లో పేర్కొంది.
అలాగే గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ డిక్లరేషన్ పైన సంతకం చేశారని తెలుస్తోంది. ఆయన క్రిస్టియన్ కావడంతో డిక్లరేషన్ పై సంతకం చేశారని చెబుతున్నారు. అయితే క్రిస్టియన్లకు ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని వైసీపీ నేతలు అంటున్నారు.
థామస్ ఈ ఏడాది మే నెలలో జరిగిన ఎన్నికల్లో గంగాధర నెల్లూరు (జీడీ నెల్లూరు) నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మరి థామస్ క్రిస్టియన్ అయితే ఆయనకు ఎస్సీ రిజర్వేషన్ ఉండదు.. బీసీ రిజర్వేషన్ మాత్రమే ఉంటుంది. అలాంటప్పుడు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన గంగాధర నెల్లూరు నుంచి రిజర్వేషన్ తో ఆయన పోటీ చేయడమే అక్రమవుతుందని వైసీపీ నేతలు అంటున్నారు.
ఈ నేపథ్యంలో డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా ఎమ్మెల్యే థామస్, డిక్లరేషన్ ఇవ్వకుండా షాజహాన్ బాషా వివాదంలో చిక్కుకున్నారని అంటున్నారు. మరి వీరిపై చర్యలు ఉండవా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్ కు అయితే ఒక న్యాయం.. షాజహాన్ బాషాకు అయితే మరో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు.