Begin typing your search above and press return to search.

కూటమి ఎమ్మెల్యేలపై సొంత మీడియా వేట.. వరుస వ్యతిరేక కథనాలు!

పక్కా ఆధారాలతో వార్తలు రాయడమే కాకుండా, వారిపై చర్యలు తీసుకునే వరకు వెంట పడుతుండటంతో ఎమ్మెల్యేలు నెత్తీనోరు బాధుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   10 March 2025 8:00 PM IST
కూటమి ఎమ్మెల్యేలపై సొంత మీడియా వేట.. వరుస వ్యతిరేక కథనాలు!
X

కూటమి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా టీడీపీ శాసనసభ్యులను సొంత మీడియా టార్గెట్ చేసిందా? అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. టీడీపీకి అనుకూలంగా భావించే ఓ ప్రధాన పత్రికలో వరుసగా వ్యతిరేక కథనాలు వెలువడుతున్నాయి. పక్కా ఆధారాలతో వార్తలు రాయడమే కాకుండా, వారిపై చర్యలు తీసుకునే వరకు వెంట పడుతుండటంతో ఎమ్మెల్యేలు నెత్తీనోరు బాధుకుంటున్నారు. ఇంకే మీడియాలో అయిన వ్యతిరేక కథనాలు వస్తే, ప్రతిపక్షాల కుట్ర అంటూ తప్పించుకోవచ్చునని, కానీ, తమ అధినేతకు అనుకూలంగా చెప్పుకుంటూ తమను టార్గెట్ చేయడమే అంతుచిక్కడం లేదని ఆవేదన చెందుతున్నారు.

ఏపీలో అధికార కూటమికి రెండు ప్రధాన పత్రికలు, మరో మూడు టీవీ చానళ్లు అనుకూలంగా పనిచేస్తాయని ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అయితే ఓ ప్రధాన పత్రిక, ఆ పత్రికకు అనుబంధంగా ఉండే టీవీ చానల్ మాత్రం కొద్ది నెలలుగా టీడీపీ శాసనసభ్యులను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోందంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన నుంచి ఆ పత్రిక రూటు మార్చి చిన్న విషయాలను సైతం పెద్దగా చూపుతూ రాద్ధాంతం చేస్తోందని టీడీపీ నేతలు అంతర్గత చర్చల్లో వాపోతున్నారు.

తాజాగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుపై ఆ పత్రికలో వచ్చిన కథనం సంచలనం సృష్టిస్తోంది. రామాయపట్నం పోర్టు కాంట్రాక్టులో వాటా కావాలంటూ ఎమ్మెల్యే ఇంటూరి బెదిరించారంటూ ఆ పత్రిక బ్యానర్ వార్తను ప్రచురించింది. అదేవిధంగా రెండు రోజుల క్రితం నరసారావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఎక్సైజ్ డైరెక్టర్ ను ఘెరావ్ చేశారంటూ ఆ పత్రిక ప్రచురించింది. అంతకుముందు కూడా రాయలసీమలోని ఓ కూటమి ఎమ్మెల్యేపైన, కోస్తాలో ఓ మంత్రిపైనా ఆ పత్రికలో వ్యతిరేక కథనాలు వచ్చాయి. అదేవిధంగా గోదావరి జిల్లాలకు చెందిన ఓ ఎంపీని సైతం ఆ పత్రిక టార్గెట్ చేసిందని ప్రచారం ఉంది.

సొంత పత్రిక, చానల్ అనుకున్న సంస్థే తమను వెంటాడు తుండటంతో కూటమి ఎమ్మెల్యేలు షాక్ తింటున్నారు. తమ బాధ ఎవరితో చెప్పుకోవాలని తలలు పట్టుకుంటున్నారు. కోట్ల రూపాయల ఖర్చుపెట్టి ఎమ్మెల్యేలుగా గెలిచామని, తమను గెలిపించిన అనుచరులకు చిన్నాచితకా పనులు చేయించుకోవాలని కోరుకోవడమూ తప్పేనా? అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. అధినేతను పొగుడుతూ, తమను తిడుతూ ఆ పత్రికలో కథనాలు వస్తుండటంతో ఎమ్మెల్యేలు డైలమాలో పడిపోతున్నారంటున్నారు. ఇది సొంత మీడియా డబుల్ గేమ్ అంటూ వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ మీడియా యాజమాన్యాన్ని దారికి తెచ్చుకునే మార్గాలు అన్వేషిస్తున్నారు. తమ పక్కలో బళ్లెంలా తయారైన మీడియాను అదుపు చేయాల్సిందిగా కూటమి పెద్దలను వేడుకుంటున్నారు.