పేర్నితో టచ్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు?
మచిలీపట్నంలో రేషన్ బియ్యం అక్రమ తరలింపు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
By: Tupaki Desk | 29 Dec 2024 12:30 PM GMTమచిలీపట్నంలో రేషన్ బియ్యం అక్రమ తరలింపు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత 20 రోజులుగా మాజీ మంత్రి పేర్ని నాని టార్గెట్ గా అధికార పార్టీ పావులు కదపడం, ఈ వివాదం నుంచి ఎలాగోలా బయటపడాలని అధికారులు, నేతల సహకారంతో పేర్ని నాని ప్రయత్నించడం విపరీతమైన చర్చకు దారితీసింది. అదేవిధంగా టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు తనతో టచ్ లో ఉన్నారని, ఈ విషయంలో ఏమీ చేయలేమని వారు చెప్పినట్లు శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్లో వెల్లించారు పేర్ని నాని. దీంతో ఆయనతో టచ్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరన్న చర్చ టీడీపీలో వేడిపుట్టిస్తోంది.
గత ప్రభుత్వంలో రవాణా మంత్రిగా పనిచేసిన పేర్ని నాని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు. ఆయన స్థానంలో కుమారుడు పేర్ని కిట్టూను పోటీకి పెట్టారు. కిట్టూపై ప్రస్తుత మంత్రి కొల్లు రవీంద్ర ఘన విజయం సాధించారు. 2014 నుంచి కొల్లు, పేర్ని మధ్య రాజకీయ యుద్ధం జరుగుతోంది. ఈ పొలిటికల్ ఫైట్ కొన్నాళ్లుగా పరిధి దాటి వ్యక్తిగత వైరంగా మారింది. గత ప్రభుత్వంలో ఓ హత్య కేసులో కొల్లును జైలుకు పంపించారు. దీంతో ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న మంత్రి కొల్లుకి.. రేషన్ బియ్యం మాయం కేసు అస్త్రంగా మారింది.
పౌరసరఫరాల శాఖ అద్దెకు తీసుకున్న పేర్ని జయసుధ గిడ్డంగిలో దాదాపు మూడు వేల బస్తాల రేషన్ బియ్యం మాయమయ్యాయి. దీనిపై ప్రభుత్వం దొంగతనం కేసు పెట్టింది. పౌరసరఫరాల అధికారుల ఫిర్యాదు మేరకు గొడౌన్ యజమాని జయసుధపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడమే కాకుండా, ఆమెను అరెస్టు చేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం పేర్ని జయసుధ హైకోర్టును ఆశ్రయించారు. అయితే జయసుధకు బెయిల్ రాకుండా మంత్రి కొల్లు అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ శనివారం మీడియా ముందుకు వచ్చిన పేర్ని నాని.. వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవాలంటే తన సతీమణిని విడిచిపెట్టి, తనను అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. ఈ సందర్భంలో టీడీపీలో తనకు ఎందరో మిత్రులు ఉన్నారని, ఈ సమయంలో ఎలాంటి సాయం చేయలేమని వారు చేతులెత్తేస్తున్నారని సంచలన విషయం బయటపెట్టారు. దీంతో పేర్నికి అంత సన్నిహితులైన నేతలు టీడీపీలో ఎవరున్నారనే విషయమై అధిష్టానం ఆరా తీస్తోంది.
గత ప్రభుత్వంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పై పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. జనసేనాని పవన్ కు కనీస గౌరవం ఇవ్వకుండా విమర్శలు గుప్పించేవారు. దీంతో కూటమి ప్రభుత్వం హిట్ లిస్టులో పేర్ని నాని పేరు ఎప్పుడో చేర్చారని చెబుతున్నారు. ఇన్నాళ్లు ఆయన విషయంలో ఏ ఆధారాలు దొరక్కపోవడంతో ఏడు నెలలుగా వేచిచూశారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా పేర్నికి అక్రమ మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయనే ఆరోపణలు చేసేది. అధికారంలోకి వచ్చాక తగిన ఆధారాలు లేక సమయం కోసం వేచిచూసింది. ఈ పరిస్థితుల్లోనే బియ్యం అక్రమ తరలింపు విషయం బయటపడింది. ఈ ఇష్యూలో పేర్ని కుటుంబం అడ్డంగా దొరికిందనే భావనతో మంత్రి కొల్లు రవీంద్ర పకడ్బందీగా వ్యూహరచన చేసి పేర్ని అరెస్టుకు ప్రణాళిక వేశారు. అయితే ఎప్పటికప్పుడు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకున్న పేర్ని నాని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇంతవరకు చిక్కకుండా తిరుగుతున్నారు.
వాస్తవానికి బియ్యం తరలింపులో పేర్ని నాని నిందితుడు కాదు. కానీ, ఇతర నిందితులతో ఆయన పేరు చెప్పించి నిందితుల జాబితాలో చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్ని నాని అనుమానిస్తున్నారు. దీంతో టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులతో టచ్లో ఉంటూ ఎప్పటికప్పుడు తనకు వ్యతిరేకంగా ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. లీకులు లేకుండా పేర్ని నానిని ఇరికించేలా వ్యూహం సిద్ధంచేసిందంటున్నారు. దీంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మీడియా ముందుకు వచ్చిన పేర్ని నాని, తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ఆరోపించి కాక రేపారు. ఇదే సందర్భంలో టీడీపీలో ఉన్న తన మిత్రుల సహకారంపై ఆయన కామెంట్లు చేయడం రాజకీయంగా హీట్ పుట్టించింది.
పేర్ని కామెంట్లతో టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. పేర్నికి సహకారం అందిస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరనే విషయమై ఆరా తీస్తోంది. ప్రభుత్వ సమాచారం ప్రత్యర్థులతో పంచుకోవడంపై పార్టీలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో పేర్ని అనుసరించిన పద్ధతులను మరచిపోతే ఎలా అంటూ క్యాడర్ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులను నిందిస్తున్నారు. ఈ కేసు బయటకు వచ్చిన నుంచి పేర్నిని రక్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయని టాక్. ఒకవైపు అధికారులు, మరోవైపు అధికార పార్టీ నేతలు సహకారం ఉండటంతో తనకేమీ జరగదని తొలుత మాజీ మంత్రి పేర్ని లైట్ తీసుకున్నారు. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించడంతో అన్ని రకాలుగా టైట్ చేశారు. ఫలితంగా తన సతీమణికి బెయిల్ దొరకడం క్లిష్టంగా మారడంతో సీఎం చంద్రబాబును ప్రసన్నం చేసుకునేలా మాట్లాడటమే కాకుండా టీడీపీలో తనకు మిత్రులు ఉన్నారని, తన ప్రత్యర్థులను భయపెట్టేలా స్టేట్మెంట్ ఇచ్చారంటున్నారు. పేర్ని నాని చేసిన పనికి ఇన్నాళ్లు ఆయనతో టచ్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు టెన్షన్ పడుతున్నట్లు చెబుతున్నారు.