Begin typing your search above and press return to search.

వాలంటీర్ల మోడల్...కొత్త ప్లాన్ తో టీడీపీ

ప్రభుత్వ పధకాలు వారికి అందుతున్నాయా లేదా తెలుసుకుంటారని వాటిని అందించేలా చూస్తారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   1 Feb 2025 7:30 PM GMT
వాలంటీర్ల మోడల్...కొత్త ప్లాన్ తో టీడీపీ
X

తెలుగుదేశం పార్టీ ఫార్టీ ఇయర్స్ హిస్టరీ. ఆ పార్టీ మరో అర్ధ శతాబ్దం పైగా కొనసాగాలని గట్టిగా భావిస్తోంది. దాని కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. తాజాగా జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలను తీసుకుంది.

అందులో అసక్తిని కలిగించేది ఏంటి అంటే కో ఆర్డినేటర్ల వ్యవస్థను పార్టీ పరంగా ఏర్పాటు చేయాలనుకోవడం. ఇది చూడబోతే వాలంటీర్ల వ్యవస్థను పోలి ఉంది. అయితే వాలంటీర్ల వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనంతో సాగేది. దాని వల్లనే విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం నిధులు వెచ్చిస్తూ పార్టీ కార్యక్రమాలకు వారిని ఎలా తీసుకుంటారు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి.

మరో వైపు వైసీపీ పార్టీ వ్యవస్థని నిర్వీర్యం చేసేల ఈ వ్యవస్థ కొనసాగింది. చివరికి వ్రతమూ చెడింది, ఫలితమూ దక్కకుండా వైసీపీ ఘోరంగా దెబ్బ తింది. అయితే ప్రతీ యాభై ఇళ్ళకు ఒక వాలంటీర్ అన్న వైసీపీ ఆలోచన గొప్పదే. ఇపుడు దానినే స్పూర్తిగా తీసుకుని ఆ పార్టీ చేసిన తప్పులను లోపాలను సరిచేసుకుంటూ టీడీపీ తన పార్టీలో సరికొత్త విధానం ప్రవేశపెట్టబోతోంది అని అంటున్నారు

దాని పేరే కో ఆర్డినేటర్ వ్యవస్థ. ఈ వ్యవష్తలో కూడా విభజన చేసి పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ఎంపవర్మెంట్ కో ఆర్డినేటర్లు అలాగే యూత్ కో ఆర్డినేటర్లుగా వీరి పోస్టులను డిజైన్ చేస్తున్నారు. ఈ విధంగా పార్టీ పరంగా నియమితులు అయిన వారికి ఒక్కొక్కరికీ అరవై కుటుంబాలను అప్పగిస్తారు. ఆ కుటుంబాల బాగోగులను వారు చూస్తారు.

ప్రభుత్వ పధకాలు వారికి అందుతున్నాయా లేదా తెలుసుకుంటారని వాటిని అందించేలా చూస్తారని అంటున్నారు. యూత్ కో ఆర్డినేటర్లు యువతను కలుపుకుని ముందుకు సాగుతారని ప్రచారం సాగుతోంది. ఇక వీరికి సంబంధించిన నియామకాలను ఈ నెల 6వ తేదీ నుంచి మొదలెడతారని అంటున్నారు. అలాగే క్లస్టర్ యూనిట్ ఇంచార్జిలను కూడా కొత్తగా పోస్టులను క్రియేట్ చేసి పార్టీ పరంగా ఔత్సాహికులను నియమించాలని అతి ముఖ్యమైన నిర్ణయమే తీసుకున్నారు.

దీని వల్ల పార్టీ రాష్ట్ర స్థాయి నుంచి ప్రతీ కుటుంబానికి నేరుగా కనెక్ట్ అయ్యేలా ఉంటుందని భావిస్తున్నారు. అలాగే టీడీపీని మరింతగా పటిష్టం చేయడంతో పాటు ఓటు బ్యాంక్ మరింతగా పెరుగుతుందని, టీడీపీ ఓటు బ్యాంక్ ని చెక్కు చెదరకుండా చేసుకోవడమే దీని వెనక ఉన్న అసలైన ఆలోచన అని అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీ వాలంటీర్ల వ్యవస్థ అని జబ్బలు చరచుకుని బొక్క బోర్లా పడింది. కానీ టీడీపీ ఆ కాన్సెప్ట్ ని స్పూర్తిగా తీసుకుని టీడీపీకి ఒక కంచుకోటగా ఏపీలో ఎలా నిలబెట్టాలో వినూత్న తరహా ఆలోచనలు చేస్తోంది అని అంటున్నారు. మరి ఈ కో ఆర్డినేటర్ల వ్యవస్థ టీడీపీని ఏ విధంగా బలోపేతం చేస్తుందో చూడాల్సి ఉందని అంటున్నారు