కేసులు పెట్టించుకున్నా.. పదవులు దక్కలేదు.. రీజనేంటి..!
దీంతో వైసీపీ హయాంలో జగన్ సర్కారుపై పోరాటం చేసిన నాయకులు పదవుల కోసం ఎదురు చూశారు.
By: Tupaki Desk | 26 Sep 2024 1:32 PM GMTతాజాగా నామినేటెడ్ పదవుల పందేరం ప్రారంభమైంది. కూటమి సర్కారు వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు పదవుల విషయంపై పెద్ద ఎత్తున నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా టీడీపీ తరఫున ఎక్కువ మంది పదవులు దక్కుతాయని లెక్కలు వేసుకున్నారు. దీనికి ప్రాతిపదికగా.. ఎవరు ఎక్కువ కేసులు పెట్టించుకుంటే.. వారికే పదవులు దక్కుతాయన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో వైసీపీ హయాంలో జగన్ సర్కారుపై పోరాటం చేసిన నాయకులు పదవుల కోసం ఎదురు చూశారు.
అయితే.. తాజాగా ప్రకటించిన 20 పదవుల్లోనూ.. పోరాట నాయకులకు అవకాశం పెద్దగా చిక్కలేదు. దీంతో వారంతా ఇప్పుడు చంద్రబాబు వైఖరిపై రగిలిపోతున్నారు. దీనిని పసిగట్టిన సీఎం.. వారిని ఉద్దేశించి హె చ్చరికలు జారీ చేస్తున్నారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. ఇక, ఇప్పటికిప్పుడు వారు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపించడం లేదు. అయితే.. అంతర్గతంగా పార్టీలో మాత్రం వారు రుసరుసలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఉదాహరణకు విజయవాడకు చెందిన ఇద్దరు టీడీపీ నాయకులు నామినేటెడ్ పదవులపై భారీ ఆశలు పెట్టుకున్నారు. వీరిలో ఒకరు కొమ్మారెడ్డి పట్టాభిరాం. అప్పట్లో సీఎం జగన్‌పై తీవ్ర పదజాలంతో విరుచు కుపడిన నాయకుడిగా.. రాష్ట్ర వ్యాప్తంగా పట్టాభి పేరు మార్మోగింది. ఈ పరిణామమే టీడీపీ ఆఫీసుపై వైసీపీ నేతలు దాడి చేసేందుకు పురిగొల్పింది. అంతేకాదు.. అప్పట్లో పట్టాభిని వైసీపీ నాయకులు అరెస్టు కూడా చేశారు. దీంతో తనకు పార్టీలో మరింత గుర్తింపు లభిస్తుందని ఆయన ఆశించారు.
ఇక, విజయవాడ వెస్ట్‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా.. ఇదే తరహా ఆశలు పెట్టుకున్నా రు. ఈయన కూడా వైసీపీ సర్కారుపైనా.. ముఖ్యంగా సజ్జల రామకృష్నారెడ్డి, విజయసాయి రెడ్డి వంటి కీలక వైసీపీ నాయకులపైనా ఫైట్ చేశారు. నిరంతరం.. పార్టీ తరఫున బలమైన గళం కూడా వినిపిస్తున్నా రు. ఇక, చంద్రబాబు చిత్రపటానికి రక్తాభిషేకం కూడా చేశారు.
ఇంత చేసినా.. ఆయనకు కూడా తాజాగా నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం దక్కలేదు. అయితే.. ఇంకా పదవుల పంపకం పూర్తి కాలేదు కాబట్టి.. వీరి ఆశలు సజీవంగానే ఉన్నాయని సీనియర్లు చెబుతున్నారు. కానీ, వీరు మాత్రం పార్టీకి గత రెండు రోజులుగా దూరంగా ఉంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.