ప్రీమియర్ షోలకు అనుమతి ఉండాల్సిందే: టీడీపీ
పుష్ప-2 ప్రీమియర్ షో విడుదల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివా సరావు స్పందించారు
By: Tupaki Desk | 22 Dec 2024 4:38 PM GMTపుష్ప-2 ప్రీమియర్ షో విడుదల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివా సరావు స్పందించారు. సంధ్య ధియేటర్ వద్ద జరిగిన ఘటనను దురదృష్టకరమైందిగా ఆయన పేర్కొన్నా రు. అయితే.. ఈ ఒక్క ఘటనను అడ్డు పెట్టుకుని సినిమా ఇండస్ట్రీ మొత్తాన్నీ ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వాల్సిందేనని చెప్పారు. లేకపోతే.. పరిశ్రమ దెబ్బతింటుందని చెప్పారు.
కొత్త సినిమాలకు సంబంధించి ప్రీమియర్‌షోలు, బెనిఫిట్ షోలు వేయ్యకూడదని కొందరు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి తీసే ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు ఇలాంటివి ఉపయోగపడతాయని తెలిపారు. ఇండస్ట్రీని ఆదుకునేందుకు ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పుష్ఫ-1 హిట్ అయిందని.. అలాగే పుష్ప-2 కూడా హిట్ అవుతుందని అందరూ అనుకున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే ముందు జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే బాగుండేదని చెప్పారు.
అయితే.. ప్రభుత్వంతోపాటు.. సినిమా నిర్మాతలు.. దర్శకులు కూడా.. సినిమా హాళ్ల దగ్గర భద్రతను కల్పించాలని పల్లా శ్రీనివాసరావు సూచించారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని.. మీడియా ముందుకు రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. భవిష్యత్తులో ప్రమాద ఘటనలు జరగకుండా చూడాలని సూచించారు. ప్రీమియర్ షోలకు హీరోలు, దర్శకులు వెళ్ళకపోవడమే మంచిదని అన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలు భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా చూసుకోవలసిన అవసరం ప్రభుత్వం, సినిమా ఇండస్ట్రీపై ఉందని తెలిపారు.
ఏపీలో జాగ్రత్తలు తీసుకునే విధంగా ప్రభుత్వానికి తాను సూచనలు చేయనున్నట్టు పల్లా వివరించారు. ఏపీలో ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని. అయితే.. క్రౌడ్ మేనేజ్ మెంటును అందరూ కలిసి కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీలో లక్షల మంది పనిచేస్తున్నారని.. వారి ఉపాధిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు.